టెహ్రాన్: హార్మూజ్ జలసంధిని అంతర్జాతీయ షిప్పింగ్‌కు వీలుగా తెరిచే ఉంచుతామని ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలను మాత్రమే దాని గుండా అనుమతించబోమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ వెల్లడించారు. ‘ఈ మార్గాన్ని ఇతర దేశాల నౌకలకు తెరిచే ఉంచుతాం. ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నా పలు ట్యాంకర్లు, సరుకు రవాణా నౌకలు హార్మూజ్ గుండా వెళ్లాయి. కొన్ని షిప్పింగ్ కంపెనీలు భద్రతా కారణాలతో వేరే మార్గాలు ఎంచుకుంటున్నాయి’ అని ఆయన తెలిపారు.
మరో జలసంధి బంద్..!
మరోవైపు.. ఇరాన్ అండదండలున్న యెమన్ హౌతీ మిలిటెంట్లు ఆ దేశానికి మద్దతుగా అతి త్వరలో రణరంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే ఆసియా–యూరప్ వాణిజ్యానికి ప్రధాన మార్గమైన బాబ్ ఎల్–మాండెబ్ జలసంధి కూడా మూతపడేలా కనిపిస్తోంది. ఎర్ర సముద్రం, హిందూ మహాసముద్రాలను మధ్యదరా సముద్రంతో అనుసంధానించే మాండెబ్‌పై హౌతీలకు గట్టి పట్టుంది. ప్రపంచ దేశాలపై ఒత్తిడి పెంచడానికి దాన్ని మూసేస్తామని హౌతీలు చెబుతున్నారు. ప్రపంచ చమురు రవాణాకు ఆయువుపట్టు వంటి హార్మూజ్ జలసంధి మూతపడటంతో ఇప్పటికే చమురు, గ్యాస్ ధరలు మండిపోతున్నాయి. మాండెబ్ నుంచి కూడా రవాణా ఆగితే సరుకుల ధరలకు రెక్కలు రావడం ఖాయం.
భారత్ వైపు చమురు నౌక..
భారత్‌కు చెందిన మరో నౌక ‘జగ్ లాడ్కీ’ భారీ చమురుతో యూఏఈలోని పుజైరా చమురు కేంద్రం నుంచి స్వదేశానికి బయల్దేరింది. పశ్చిమాసియా యుద్ధక్షేత్రం నుంచి క్షేమంగా బయటపడిన నాలుగో భారత నౌకగా నిలిచింది. పుజైరాపై భీకర దాడులు జరుగుతున్నా 80,800 టన్నుల ముడి చమురు నింపుకొని క్షేమంగా వస్తున్నట్లు కేంద్రం అదివారం వెల్లడించింది.


