అహర్నిశలూ ప్రత్యేక కమెండో విభాగం కాపలా
శత్రు శేషం, రుణ శేషం, వ్రణ శేషం, అగ్ని శేషం ఉండకూడదంటారు. ఇరాన్ నూతన సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ విషయంలో అమెరికా కూడా ఈ సూత్రాన్నే పాటించే ప్రయత్నంలో ఉంది. తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ మాదిరిగానే మొజ్తబాను కూడా అంతం చేయాలని చూస్తోంది. కానీ అదంత సులువు కాదని ఇరాన్ ధీమాగా చెబుతోంది. అందుకు కారణం ఒక్కటే. మొజ్తబా చుట్టూ ఉన్న అత్యున్నత రహస్య భద్రతా కమెండో విభాగం ‘నోపో’!
ఏమిటీ నోపో?
నోపో ఇరాన్ ప్రత్యేక రహస్య భద్రతా దళం. పార్సీ భాషలోని ‘నిరోయే విజేహ్ పాస్దరాన్ వేలాయత్’కు సంక్షిప్త రూపం. అంటే ‘పాలకులను కాపాడే ప్రత్యేక దళం’ అని చెప్పొచ్చు. ఇరాన్ పోలీస్ వ్యవస్థలో ఒక విభాగంగా నోపోను దశాబ్దాల క్రితం ఏర్పాటుచేశారు. మెరుపు వేగంతో పనిముగించే మెరికల్లాంటి కమెండోలు ఇందులో ఉంటారు. 1979లో ఇరాన్‌లో ‘ఇస్లామిక్ చైతన్యం’ తర్వాత తొలి సుప్రీం నేతగా ఆవిర్భవించిన అయతొల్లా రుహొల్లా ఖమేనీ కాలంలో తిరుగుబాటుదారుల నుంచి అగ్ర నేతల రక్షణ నిమిత్తం 28వ రొహల్లా డివిజన్ నుంచి నోపోను ఏర్పాటు చేశారు. ఇరాన్‌లో అత్యంత శక్తిమంతమైన, పలుకుబడి గల సాయుధ విభాగమైన రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్‌జీసీ)తో కూడా నోపోకు సంబంధం ఉండదు.
కేవలం అగ్ర నేతల భద్రతపైనే ఇది దృష్టి సారిస్తుంది. వారిని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతుంది. నోపో కమెండోల పని పూర్తిగా గోప్యంగానే కొనసాగుతుంది. ప్రమాదాన్ని పసిగట్టి ముందస్తు వ్యూహాలు రచించి అమలు చేయడం, పరిస్థితి హఠాత్తుగా అదుపు తప్పితే స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్లడం ఈ దళం ప్రత్యేకత. నాలుగు నోపో బ్రిగేడ్లు మొజ్తబా రక్షణలో నిరంతరం నిమగ్నమైనట్టు తెలు స్తోంది. మహ్ షాద్, ఇస్ఫహాన్ అణుకేంద్రాల భద్రత కోసం మరో రెండు యూ నిట్లు పని చేస్తున్నట్టు సమా చారం. ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో పాల్గొనడం, బందీ లను విడిపించడం, ప్రభుత్వ భవనాలతోపాటు వ్యూహాత్మక ప్రదేశాలకు రక్షణ కలి్పంచడం వంటి విధులను కూడా నోపో చూస్తుందని యుద్ధ రంగ నిపుణులు చెబుతున్నారు.
కఠిన శిక్షణ
యుక్త వయసులో ఉండి శరవేగంగా స్పందించగల నైపుణ్యం, తెలివితేటలు, దేహదారుఢ్యం, సాంకేతికతపై పట్టు, గురిపెట్టి కాల్చే నైపుణ్యం... ఇలా పలు అర్హతలున్న వారిని అన్నిరకాలుగా వడపోసిన అనంతరం నోపోలోకి తీసుకుంటారు. సాధారణ పోలీస్ శిక్షణలో అత్యంత ప్రతిభ కనబర్చిన వాళ్లను నోపో కోసం ఎంపిక చేస్తారు. వారికి మళ్లీ కఠినమైన కమెండో శిక్షణ ఇస్తారు. నోపో మాజీ కమెండో హొస్సేన్ అమ్జాదియాన్ గతంలో ఒక ఇంటర్వ్యూలో ఈ వివరాలను వెల్లడించారు. ‘‘అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లోనూ అవలీలగా పని ముగించే తెగువ, నైపుణ్యం నోపో కమెండోల సొంతం. కఠినమైన కమెండో శిక్షణ పూర్తయ్యాక కూడా సభ్యుని ప్రవర్తనపై అనుమానముంటే తక్షణం విధుల నుంచి తప్పిస్తారు.
స్వీయరక్షణ విద్యతో పాటు మార్షల్ ఆర్ట్స్ సైతం వచ్చి ఉండాలి. స్నైపర్ షూటింగ్‌లో నైపుణ్యముండాలి. పరిసరాలను డేగ కళ్లలో గమనిస్తుండాలి. అగ్ర నేతల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసే తెగువ కావాలి’’ అని ఆయన చెప్పారు. 1999– 2022 మధ్య ఇరాన్లో సంక్షోభం లేవదీసేందుకు జరిగిన పలు ప్రయత్నాలను వమ్ము చేసేందుకు ఖమేనీ ప్రభుత్వం నోపో కమెండోలను విజయవంతంగా ఉపయో గించినట్టు గతంలో వార్తలొచ్చాయి. ‘‘దేశం పట్ల అత్యంత అంకితభావం చూపడమే నోపో సభ్యుల ప్రాథమిక లక్షణం’’ అని పారిస్ కేంద్రంగా పనిచేసే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఇరాన్ (ఎన్‌సీఆర్‌ఐ) పార్టీ నేత అలీ సఫావీ చెప్పారు. నోపో అరాచకాలకు పాల్పడుతోందని, మానవహక్కులను హరిస్తోందని అమెరికా ఆరోపించింది. 2021లోనే నోపోపై ఆంక్షలు విధించింది. – సాక్షి, నేషనల్ డెస్క్


