
సాధారణంగా కన్ను ఎర్రబారిన, దురదపుడుతున్నా..డాక్టర్‌ని సంప్రదించకుండానే ఐడ్రాప్స్ తెచ్చుకుని వేసేసుకుంటాం. అలాగే కాస్త ముక్కుదిబ్బడగా ఉన్న వెంటనే నాసల్ ఇన్హేలర్లను వాడేస్తాం. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తక్షణ రిలీఫ్ కోసం తరుచుగా వీటిని వాడేస్తుంటాం. ఇలా అస్సలు చేయొద్దని వైద్యులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. అలా చేస్తే ఆ సమస్య తప్పదని చెబుతున్నారు.
ఢిల్లీలోని ఎయిమ్స్‌లో పదేళ్ల వయసున్న పిల్లలు గ్లాకోమా( Glaucoma)తో బాధపడుతున్న కేసులు అధికంగా నమోదయ్యాయి. ఇలా ఎందుకు జరగుతుందని వైద్యులు క్షణ్ణంగా పరిశీలించగా..విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొద్దిపాటి అలెర్జీలకైనా వెంటనే స్టెరాయిడ్ ఆధారిత కంటి చుక్కలను వాడుస్తుండటమే దీనికి కారణమని పరిశోధనలో తేలింది. ఎయిమ్స్‌లో నమోదైన దాదాపు చాలా కేసులు ఇలాంటి కోవకు చెందినవేనని వైద్యులు చెబుతున్నారు.
ఇలా వైద్యుడిని సంప్రదించకుండా పదేపదే ఐ డ్రాప్స్ ఉపయోగిస్తే గ్లాకోమా బారినపడి అంధత్వంతో బాధపడతారని చెబుతున్నారు. ఇలా స్టైరాయిడ్ ఆధారిత కంటి చుక్కలు, ఇన్హేలర్లు లేదా స్టెరాయిడ్‌లను మాత్రలు లేదా ఇంజెక్షన్ రూపంలో ఉపయోగిస్తే..అవి కంటిలోపల ఒత్తిడిని పెంచుతాయని చెబుతున్నారు. ఫలితంగా కంటి లోపలి ఆప్టిక్ నరాలు దెబ్బతినడానికి దారితీస్తుందని చెబుతున్నారు.
ముఖ్యంగా కండ్లకలక కోసం ఈ ఐడ్రాప్స్ వినియోగించి గ్లాకోమా బారిన పడిన కేసులు రాజస్థాన్, హర్యానా వంటి గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా నమోదయ్యాయని తెలిపారు వైద్యులు. అదీగాక ఈ గ్లాకోమా లక్షణాలను ప్రారంభంలో గుర్తించకుండా చివరిదశలో రావడంతో చాలామంది పిల్లలు అంధత్వం బారినపడుతున్నట్లు వెల్లడించారు. అలాగే చాలామంది గ్లాకోమా రోగుల్లో ఇన్హేలర్ వాడకం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. పిల్లల్లో అంతగా కనబడని ఈవ్యాధి..స్టెరాయిడ్ ఆధారిత ఐడ్రాప్స్, ఇన్హేలర్లు వాడటం వల్లనే అని పరిశోధనలో తేలింది.
సాధారణంగా వయోజన గ్లాకోమా 40 సంవత్సరాల తర్వాత అభివృద్ధి చెందుతుందట. ముఖ్యంగా కుటుంబంలో ఎవరైనా ఈ వ్యాధి బారినపడిన చరిత్ర, డయాబెటిస్, రక్తపోటు, గుండె జబ్బులు, కంటి గాయం తదితరాల వల్ల ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే అథ్లెట్లు చర్మ సంబంధమైన స్టెరాయిడ్ క్రీమ్‌లు, కండరాల నిర్మాణానికి స్టెరాయిడ్ ఇంజెక్షన్లను వాడొద్దని హెచ్చరిస్తున్నారు వైద్యులు.
ఇవి గ్లాకోమాకు దారితీస్తాయని అంటున్నారు. అంతేగాదు ముఖం మీద, కళ్ల చుట్టూ స్టెరాయిడ్లు ఉన్న క్రీములు వినియోగిస్తే..గ్లాకోమాకు దారితీయవచ్చని, అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా స్టెరాయిడ్ ఆధారిత కంటి చుక్కలు, క్రీమ్‌లు వినియోగిచొద్దని నొక్కి చెప్పారు. ఇక కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ పెరుగుదల కూడా కంటిలోపలి ఒత్తిడిని పెంచుతుందని, ఇది కంటిలోపలి రక్తపోటుకు దారితీస్తుందని అన్నారు. ఏదైనా కారణం చేత ఆరు వారాలకు పైగా స్టెరాయిడ్లు తీసుకునే రోగులు తప్పనిసరిగా వైద్యులు చేత గ్లాకోమా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
గ్లాకోమా అనేది లక్షణాలు లేకుండా మన కను దృష్టిని అదృశ్యం చేసే వ్యాధి. అందువల్ల క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం అత్యంత కీలకం. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన వారికి లేదా మధుమేహం, అధిక రక్తపోటు లేదా గ్లాకోమా వ్యాది వచ్చిన చరిత్ర ఉన్న వారికి ఈ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువని వెల్లడించారు. అంతేగాదు చాలామందికి తమకు గ్లాకోమా ఉందని తెలియదట. ప్రాథమిక స్థాయిలోనే దీన్ని గుర్తించేలా.. కంటి స్క్రీనింగ్‌పరీక్షలు అందరికీ అందుబాటులో ఉండటం అత్యంత ముఖ్యమని అన్నారు. దీన్ని ముందుగానే గుర్తిస్తేనే అంధత్వం బారినపడకుండా ఉండగలమని చెబుతున్నారు నిపుణులు.
(చదవండి: 'అంధురాలైన అమ్మమ్మ సాధించిన విజయం'..! పోస్ట్ వైరల్ )