War యుద్ధాల్లో ఓడేది శ్రామిక ప్రజలే! | can you imagine who are war victims | Sakshi
Sakshi News home page

War యుద్ధాల్లో ఓడేది శ్రామిక ప్రజలే!

May 20 2025 12:05 PM | Updated on May 20 2025 3:11 PM

can you imagine who are war victims

ఇప్పుడు ప్రపంచంలో, ఏ ఖండంలో చూసినా, విన్నా, యుద్ధాలే యుద్ధాలు: దేశాల మధ్యా, ఒకే దేశంలో వేరు వేరు పక్షాల మధ్యా! యాభై ఏళ్ళ కిందట, చెరబండ రాజు రాసిన ఒక కవిత పేరు, ‘విప్లవాల యుగం మనది! విప్ల విస్తే జయం మనది!’ అని. ప్రస్తుత పరి స్థితి వేరే రకంగా వుంది. ‘యుద్ధాల యుగం మనది! ఆప కుంటే చావు మనది!’ అన్నట్టుగా ఉంది. ప్రస్తుతం ఇజ్రాయెల్‌–పాలస్తీనాల మధ్యా; రష్యా–ఉక్రె యిన్ల మధ్యా జరుగుతున్నవి భీకర యుద్ధాలు! ఈ యుద్ధాలలాగా పత్రికల్లో, టీవీల్లో, ఎక్కు వగా ప్రచారం కాని యుద్ధాలు ఎన్నో  ఆఫ్రికాలో నిరంతరం ఏదో ఒక స్థాయిలో జరుగుతూనే ఉన్నాయి. బుర్కినా ఫాసో, కామెరూన్, కాంగో, ఇథియోపియా, మొజాంబిక్, నైజీరియా, సోమాలియా, సూడాన్‌-ఇలా ఎన్నో దేశాల్లో దాదాపు 35 సాయుధ ఘర్షణలు ఇప్పటికీ కొనసాగుతున్నట్టు వార్తలున్నాయి. 

ఈ యుద్ధాల వల్లా, నిరంతరం జరిగే సాయుధ ఘర్ష ణల వల్లా, కలిగే బీభత్సాల గురించి, అనేక అంతర్జాతీయ నివేదికలు వచ్చాయి. ఆ యా దేశాల తరఫున యుద్ధం చేసే సైనికులూ, ఆ దేశాల శ్రామిక జనాలూ, పెద్దసంఖ్యల్లో చనిపోతున్నారు. బతికి ఉన్నవాళ్ళలో అనేకులు తీవ్ర గాయాలపాలై, కళ్ళూ, కాళ్ళూ, చేతులూ, పోగొట్టు కుంటున్నారు. స్త్రీలు అత్యాచారాలకు గురవుతున్నారు. పిల్లలు ఏ దిక్కూ లేని ‘అనాథలవుతున్నారు. లక్షలాది మంది శరణార్థులుగా తరలిపోతున్నారు. పొలాలూ, నదులూ, చెరు వులూ, నివాసాలూ– అన్నీ ధ్వంసం అవు తున్నాయి. గాలి కాలుష్యం వల్లా, నీటి కాలుష్యం వల్లా, జనాలు భరించలేని, నయంకాని, జబ్బుల పాలవు తున్నారు.

ఇదీ చదవండి: మెట్రోలో ఇన్‌ఫ్లూయెన్సర్‌ సందడి మాములుగా లేదు! వీడియో వైరల్‌

ఐక్యరాజ్యసమితి నివేదికల్లోనూ, ‘ప్రపంచ శాంతి గురించిన పరిశోధనా సంస్థల నివేదికల్లోనూ, యుద్ధ బీభ త్సాల గురించిన వివరాలెన్నో చూడవచ్చు. ఉదాహర ణకు, గాజా యుద్ధంలో 18 నెలల్లో 50 వేల మంది పాల స్తీనా ప్రజలు చనిపోయారు. లక్షా 13 వేలమంది ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో దాదాపు 4 వేల 5 వందల మంది పిల్లలకు, ఆ గాయాలు విషంగా మారడం వల్ల, రెండు కాళ్ళూ తీసేశారు. ఆకలి మరణాలు సరేసరి. ఇజ్రాయెల్‌ దాడిలో, 85 వేల టన్నుల పేలుడు పదార్థాల వల్ల, గాలి కాలుష్యం విపరీతంగా ఉందని తేలింది. అలాగే రష్యా–ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధంలోనూ సైనికులూ, ప్రజలూ పెద్ద ఎత్తున చనిపోయారు. రష్యాలో ఉన్న బీబీసీ వార్తా సంస్థ యూనిట్‌... అక్కడి స్థానిక మీడియా సంస్థలు, వలంటీర్ల సహకారంతో జరిపిన సర్వే ప్రకారం: 1 లక్షా 6 వేల 745 మంది రష్యా సైనికులు ఉక్రెయిన్‌తో జరిగిన యుద్ధంలో చని పోయారని అంచనా వేసింది. గత మూడు సంవత్స రాలలో ఆఫ్రికా దేశాలలో జరిగిన సాయుధ సంఘర్షణల్లో 3 లక్షల 30 వేలమంది చనిపోయారు.

యుద్ధ మరణాలు ఎన్ని లక్షలైనా, కోట్లు అయినా, ఉత్త అంకెలుగానే చూస్తున్నాము తప్ప దుఃఖభారంతో కుంగిపోవడం లేదు. ‘నల్ల స్తూపం’ అనే 1956 నాటి ఒక జర్మన్‌ నవలలో, ఆ రచయిత ఇలా అంటాడు: ‘ఒక మనిషి చనిపోతే, అది ఒక మరణం మాత్రమే. అదే 20 లక్షలమంది చనిపోతే, అది ఒక అంకె మాత్రమే!’ ఇదే రకం అభిప్రాయాన్ని, అంతకు చాలా సంవత్సరాలముందే, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కాలంలో చలం గారు, ‘మ్యూజింగ్స్‌’లో ఇలా రాశారు: ‘యుద్ధం ముందు హత్యలు! యుద్ధమంతా హత్యలు! యుద్ధం తర్వాత హత్యలు! పదివేల మందిని హత్య చేశారంటే, అది వినే వారికి ఉత్త అంకెలు. చీమలమల్లే పుట్టుకొచ్చే ఈ ప్రజ లలో పదివేల మంది ఒక సంఖ్య కాదు. మళ్ళీ నిండుకుంటారు అవలీలగా! కానీ, ఒక్క జీవితం, ఒక మనిషిది. ఆలోచించి, మాట్లాడి, ప్రేమించి, కలలు కనే ఒక్క
జీవితం! ఇంక ఎన్నడూ తిరిగిరాని జీవితం! అనేకమైన సజీవమైన లత లతో ఇతరుల్ని పెనవేసుకున్న జీవితం! ఎంత విలువ!’

ఇదీ చదవండి: నిహారికను తీర్చిదిద్దిన శిల్పి ఆమె తల్లే!

ఇంతకీ, ఈ యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? పెట్టుబడిదారీ ప్రపంచంలో యుద్ధాలన్నీ స్వదేశంలోనైనా, విదేశాల్లో అయినా ప్రకృతి వనరుల్నీ, శ్రామికుల శ్రమనీ దోచే లక్ష్యంతో జరుగుతున్నాయి. ఈ విషయాన్ని అనేక పరిశోధనలు రుజువు చేశాయి. ముగ్గురు ఆఫ్రికా ఖండ పరిశోధకులు 54 ఆఫ్రికా దేశాలలో జరుగుతున్న యుద్ధాల గురించి, విస్తారంగా సమాచారం సేకరించి, ‘ఆఫ్రికాలో జరుగుతున్న ఘర్షణలపై, ప్రకృతి వనరుల ప్రభావం ఉందా?’ అన్న వ్యాసంలో (రిసోర్సెస్‌ పాలసీ మాస పత్రిక, డిసెంబర్, 2021) ఇదే సంగతిని నిరూపించారు. ఈ యుద్ధాలకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ... ఫ్రాన్సూ, అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా వంటి పెద్ద దేశాల ప్రోత్సాహం ఉంది. యుద్ధాలు జరిగితే, ఆ దేశాల్లోని ఆయుధ పరిశ్రమల యజమానులకు పండగే పండగ! 

సరే, ఇంతకీ యుద్ధాల సమస్యకు పరిష్కారం ఏమిటి? యుద్ధ వ్యతిరేక మేధావిగా పేరుపొందిన బ్రిటిష్‌ తత్వవేత్త, బెట్రండ్‌ రస్సెల్‌ ప్రకారం: ‘మనుషులన్నా యుద్ధాల్నిరద్దు చేస్తారు. లేదా యుద్ధాలన్నా మనుషుల్ని రద్దు చేస్తాయి!’ అయితే, ఏ రకం మనుషులు యుద్ధాల్ని రద్దు చేస్తారు? లాభాలే లక్ష్యంగా ఉన్న పెట్టుబడిదారీ మనుషులైతే యుద్ధాల్ని రద్దు చెయ్యరు కదా?శ్రామిక వర్గ మానవులు, శ్రమ దోపిడీ అనే దుర్మా ర్గాన్ని తీసిపారేసినప్పుడే, యుద్ధాలను రద్దు చెయ్య గలరు! అది జరిగేలోగా, తాత్కాలిక ఉపశమనం ఏమిటంటే, శ్రామిక జనాలు, తమ దేశాల ప్రభుత్వాలు దేశ రక్షణ పేరుతో చేసే ఆయుధ వ్యాపారాన్ని మాని ఆ వేల, లక్షల కోట్ల రూపాయల్ని విద్య మీదా, వైద్యం మీదా, ఉద్యోగాల మీదా ఖర్చుపెట్టేలా ఒత్తిడి తేవాలి. అది జరగకుండా, యుద్ధాలే కొనసాగితే, ఆ యుద్ధాల్లో ఏ దేశ ప్రభుత్వాలు గెలిచినా, ఓడిపోయేది మాత్రం అన్ని దేశాల శ్రామిక జనాలే!
– బి.ఆర్‌. బాపూజీ, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement