
ఐపీఎల్‌లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఇండియన్స్ కీలక పోరు
ముంబై గెలిస్తే అధికారికంగా ‘ప్లే ఆఫ్స్’కు అర్హత
ఢిల్లీ ఓడితే ‘ప్లే ఆఫ్స్’ ఆశలకు తెర
రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ 18వ సీజన్‌లో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో ఉన్న గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు ఇప్పటికే ‘ప్లే ఆఫ్స్’కు చేరగా... ఇక మిగిలిన ఒక్క స్థానం కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ అమీతుమీకి సిద్ధమయ్యాయి. వాంఖడే స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు గెలిస్తే ‘ప్లే ఆఫ్స్ బెర్త్’ను ఖరారు చేసుకోనుంది. దీంతో ఈ మ్యాచ్‌ను అభిమానులు క్వార్టర్ ఫైనల్‌గా అభివర్ణిస్తున్నారు.
తాజా సీజన్‌లో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లాడిన ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ 7 విజయాలు, 5 పరాజయాలతో 14 పాయింట్లు ఖాతాలో వేసుకొని నాలుగో స్థానంలో ఉండగా... ఢిల్లీ క్యాపిటల్స్ 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 5 పరాజయాలు, ఒక మ్యాచ్ రద్దుతో 13 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఇరు జట్ల మధ్య గత నెలలో జరిగిన పోరులో ముంబైనే విజయం వరించింది.
అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్‌లో సమతూకంగా ఉన్న ముంబై ఇండియన్స్ జట్టు సొంతగడ్డపై జరగనున్న పోరులో ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ సాధించలేకపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఎలాంటి పోరాటం కనబరుస్తుందో చూడాలి!
అన్ని రంగాల్లో పటిష్టంగా...
సీజన్ ఆరంభంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా... ఆ తర్వాత రాకెట్‌లా దూసుకొచ్చిన ముంబై ఇండియన్స్ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. గత ఏడు మ్యాచ్‌ల్లో ఆరింట నెగ్గిన హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై జట్టు ఆల్‌రౌండర్లతో దట్టంగా ఉంది. సీజన్‌లో 63.75 సగటుతో 510 పరుగులు చేసిన సూర్యకుమార్ జట్టు తరఫున టాప్ స్కోరర్ కాగా... రికెల్టన్ 336, రోహిత్ శర్మ 300, తిలక్ వర్మ 246 పరుగులు చేశారు.
గత మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో ఓడిన ముంబై... తిరిగి పుంజుకుని సమష్టిగా సత్తాచాటాలని చూస్తోంది. రోహిత్ శర్మతో కలిసి రికెల్టన్ ఇన్నింగ్స్‌ను ఆరంభించనున్నాడు. వీరిద్దరూ కలిసికట్టుగా కదంతొక్కితే ఢిల్లీ బౌలర్లకు చిక్కులు ఖాయమే. ఇక సూర్యకుమార్, తిలక్ వర్మ, విల్ జాక్స్, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, కార్బిన్ బాష్‌తో మిడిలార్డర్ బలంగా ఉంది.
లీగ్ దశ ముగియగానే రికెల్టన్, జాక్స్, బాష్ జట్టును వీడనున్నారు. బౌలింగ్‌లోనూ ముంబైకి మంచి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. బుమ్రా, బౌల్ట్, దీపక్ చహర్, హార్దిక్ పాండ్యా పేస్ భారం మోయనుండగా... కరణ్ శర్మ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నాడు. ఈ మ్యాచ్‌లో ఓడినా... ముంబై జట్టుకు ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు ఉన్నప్పటికీ అవి ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడి ఉంటాయి.
స్టార్క్ లోటుతో!
అక్షర్ పటేల్ సారథ్యంలో ఈ సీజన్ ఆరంభంలో ఆశలు రేపిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆ తర్వాత లయ కోల్పోయింది. ఆరంభంలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట నెగ్గిన క్యాపిటల్స్... ఆ తర్వాత ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఒక్క దాంట్లో మాత్రమే విజయం సాధించింది. 11 మ్యాచ్‌లు ఆడిన కేఎల్ రాహుల్ 61.63 సగటుతో 493 పరుగులు చేసి జట్టు తరఫున టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.
అభిషేక్ పొరెల్ 295, ట్రిస్టన్ స్టబ్స్ 280, అక్షర్ పటేల్ 263 పరుగులు చేశారు. ఆరంభంలో మెరిపించిన అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్ ప్రభావం చూపలేకపోతుండగా... బౌలింగ్‌లో ఆ జట్టు స్టార్క్‌పై అతిగా ఆధారపడుతోంది. చావో రేవో మ్యాచ్‌లో అతడు లేకపోవడం జట్టుకు పెద్ద లోటుగా మారనుంది. గత మ్యాచ్‌లో చూసుకుంటే వికెట్లు చేతిలో ఉన్నా... ఆశించిన వేగంతో ఆడలేకపోయిన ఢిల్లీ జట్టు కేఎల్ రాహుల్ సెంచరీ సాయంతో 199 పరుగులు చేసింది.
అయితే బౌలింగ్‌లో ఢిల్లీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో గుజరాత్ జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే లక్ష్యాన్ని ఛేదించింది. స్పిన్ త్రయం అక్షర్, కుల్దీప్, విప్రాజ్ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారనే దానిపైనే ఢిల్లీ ‘ప్లే ఆఫ్స్’ భవితవ్యం ఆధారపడి ఉంది.
తుది జట్లు (అంచనా)
ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్ ), రోహిత్, రికెల్టన్, సూర్యకుమార్, తిలక్ వర్మ, విల్ జాక్స్, నమన్ ధీర్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, కరణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా, అశ్వని కుమార్.
ఢిల్లీ క్యాపిటల్స్: అక్షర్ పటేల్ (కెప్టెన్ ), కేఎల్ రాహుల్, డు ప్లెసిస్, అభిషేక్ పొరెల్, స్టబ్స్, సమీర్ రిజ్వి, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, నటరాజన్, కుల్దీప్ యాదవ్, ముస్తఫిజుర్, చమీరా.