
ఇటీవల కాలంలో చేతిలో మొబైల్ లేనిదే మన ప్రపంచమే ఆగినంతగా మారిపోయింది జీవితం. అది లేకపోతే మన గమనం లేదు అని చెప్పొచ్చు. అంతలా ప్రతిదానికి ఆ స్మార్ట్‌ఫోన్ పైనే ఆధారపడిపోతున్నారు అందరూ. ఏం కావాలన్న ఠక్కున జేబులోంచి ఫోన్ తీసి చెక్ చేసుకోవడం ఓ అలవాటుగా మారిపోయింది. అలా ఫోన్ చూడనిదే పూట గడవదు అన్నంతగా యువత, పెద్దలు అడిక్ట్ అవుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడే యత్నం చేయాలని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. తాజాగా తమిళ హీరో మాధవన్ కూడా ఫోన్ వాడకం గురించి ఆసక్తికర విషయాలు చెప్పడమే కాదు చక్కటి హెల్త్ టిప్స్‌ని కూడా పంచుకున్నారు.
ఎన్నో వైవిధ్యభరితమైన మూవీలతో కుర్రకారుని ఉర్రూతలూగించిన నటుడు మాధవుడు. అమ్మాయి కలల రాకుమారుడిగా మంచి క్రేజ్‌ని, ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకున్న నటుడు. ప్రతి మూవీ అత్యంత విలక్షణంగా ఉండేలా జాగ్రత్త తీసుకోవడమే గాక, విలన్ పాత్రలతో కూడా మెప్పించి, విమర్శకుల ప్రశంసలందుకున్నాడు.
ఆయన ఎప్పటికప్పుడూ ఫిట్‌నెస్, పోషకాహారం తదితరాల గురించి సోషల్‌మీడియాలో నెటిజన్లతో షేర్ చేసుకుంటూనే ఉంటారు. ఈసారి ఒక సెమినార్‌లో ఫోన్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి మాట్లాడారు మాధవన్. ఈ డిజటల్ పరికరాలకు అలా అంకితమైపోతే..మానసిక ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినడమేగాక మానవ సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఒక్కసారి ఫోన్‌కి బ్రేక్ ఇచ్చి..మనతో మనం మమేకమైతే భావోద్వేగ పరంగా మెరుగవ్వడమే కాకుండా మంచి సంబధాలను నెరపగలుగుతామని అన్నారు. అంతేగాదు ఎప్పుడైనా.. మొబైల్‌ని పట్టుకోని చేతికి..వినియోగించే చేతికి తేడాని గమనించారా...? అని అడిగారు.
సింపుల్‌గా చెప్పాలంటే మీ చేతి వేళ్లను బట్టి మీరెంతలా ఫోన్ వినియోగిస్తున్నారో చెప్పేయొచ్చని అంటున్నారు మాధవన్. వేళ్లల్లో గుంతలు కనిపిస్తున్నాయా..వేళ్ల ఎముకలు పక్కటెముకలు మాదిరిగా వంకర తిరిగి ఉన్నాయా..?.. గమనిస్తున్నారా అని ప్రశ్నించారు. అలా మారిన వేళ్లను మొబైల్ ఫోన్ ఫింగర్స్(mobile phone fingers) అంటారని, అవి మితిమీరిన ఫోన్ వాడకాన్ని చెప్పకనే చెప్పేస్తాయని అంటున్నారు. అంతేగాదు ఆ రక్తసికమైన ఫోన్ మీ శరీరం తీరుని పూర్తిగా మార్చేస్తోందని అన్నారు. అందువల్ల ఫోన్ వాడకాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నిద్దాం అని పిలుపునిచ్చారు నటుడు మాధవన్
మొబైల్ ఫోన్ ఫింగర్స్ అంటే..
చేతి వేళ్లు సహజసిద్ధంగా లేకుండా..మారిపోవడాన్ని మొబైల్ ఫోన్ వేళ్లు అంటారు. అంటే అధికంగా మొబైల్ ఫోన్ వినియోగించే వారి చేతి వేళ్లు తిమ్మిర్లు వచ్చి.. జాయింట్లు తప్పడం లేదా గ్యాప్ రావడం జరగుతుందని చెబుతున్నారు నిపుణులు. వాటినే మొబైల్ ఫింగర్స్ అటారట.
ఎక్కువసేపు పోన్‌ని వినియోగించేవారి చేతిలో కండరాలు దృఢత్వం కోల్పోయి తిమ్మిర్లు, మణికట్టు నొప్పి వంటి సమస్యలు వస్తాయట. ముఖ్యంగా తరుచుగా స్క్రోలింగ్, టైప్ చేయడం, ఎక్కువసేపు పట్టుకోవడం తదితర కదలికలు వల్ల ఉత్ఫన్నమవుతాయని చెబుతున్నారు నిపుణులు. దీన్ని తేలిగ్గా తీసుకుంటే అంతే సంగతులని వార్నింగ్ ఇస్తున్నారు నిపుణులు. ఇది దీర్ఘకాలిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పరిశోధనలు చెబుతున్నాయని అన్నారు.
ఎలా నిరోధించాలంటే..
సాధ్యమైనంతవరకు మొబైల్ వాడకాన్ని పరిమితం చేయాలి. పనిచేయడం, వీడియోలు చూడటం, చదవటం వంటి కార్యకలాపాలకు కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లను ప్రత్యామ్నాయంగా వినియోగించాలి. ఎందుకంటే ఈ పరికరాలు తగిన సెటప్‌ని అందిస్తాయి..పైగా చేతులు, వేళ్లపై తగిన ఒత్తిడి తగ్గుతుంది.
అలాగే వినియోగించక తప్పదు.. అనుకునేవారు..క్రమం తప్పకుండా విరామాలు తీసుకోవడం, చేతులు సాగదీయడం లేదా రెండు చేతులతో ఫోన్ పట్టుకోవడం వంటివి చేస్తే..చేతులపై ఒత్తిడి తగ్గుతుంది.
ఇది ఒకరకంగా మీ కళ్ల ఆరోగ్యానికే కాకుండా మొత్తం ఆరోగ్యానికి మేలే చేకూరుస్తుందని అన్నారు. మెదడుపై కూడా మితిమీరిన స్మార్ట్‌ఫోన్ వినియోగం అధిక ప్రభావం చూపిస్తుందని అన్నారు.
నెమ్మదిగా ఫోన్ వాడకాన్ని తగ్గించడం వల్ల గణనీయమైన ప్రయోజనాలు పొందుతారని చెబుతున్నారు నిపుణులు.
నిర్ణిత వేళలో ఫోన్ రహిత సమయంగా పెట్టుకోవడం వంటివి చేయాలి.
సోషల్ మీడియా వినియోగం తగ్గించడం తోపాటు యాప్‌ల వినియోగాన్ని తగ్గించాలి.
దీనివల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల బారినపడే ప్రమాదం కూడా తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు.
(చదవండి: Joe Biden: సివియర్ కేన్సర్ స్టేజ్..! ఏకంగా ఎముకలకు.. )