
దౌత్య బృందాలను పంపుతున్న పాక్
ప్రతిదాన్నీ కాపీ కొడుతున్న దాయాది
ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్, పరస్పర సైనిక చర్యల తర్వాత ప్రతి అంశంలో భారత్‌ను పాకిస్తాన్ అనుసరిస్తోంది. పాక్ వైఖరిని అంతర్జాతీయంగా ఎండగట్టేందుకు అన్ని పార్టీల ఎంపీలు తదితరులతో ఏడు బృందాలను పలు దేశాలకు పంపుతుండటం తెలిసిందే. పాక్ కూడా అదే తరహాలో పలు దేశాలకు ఎంపీల బృందాలను పంపుతున్నట్టు హడావిడిగా ప్రకటించింది.
పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో, పలువురు మంత్రులు, మాజీ మంత్రులు వాటికి సారథ్యం వహిస్తారని చెప్పుకొచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. ‘‘సొంత ఆలోచనే లేకుండా భారత్ ఏం చేస్తే పాక్ అదే చేస్తోంది. మక్కికి మక్కి పాలసీని అలవర్చుకుంది. ‘కాపీక్యాట్ పాక్’’ అంటూ నెటిజన్లు ఎగతాళి చేస్తున్నారు. ఇందుకు పలు ఉదంతాలను ఉదాహరణలుగా చూపిస్తున్నారు.
బహిష్కరణల నుంచి బృందాల దాకా..
పహల్గాం ఉదంతం తర్వాత భారత్ వెంటనే భారత్‌లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయంలోని సిబ్బందిని భారీగా కుదించింది. వాళ్లను తక్షణం భారత్‌ను వీడాలని ఆదేశించింది. పాకిస్తాన్‌లోని భారతీయ హైకమిషన్‌లోనూ కొంత సిబ్బందిని వెనక్కివచ్చేయాలని సూచించింది. పాక్ కూడా అచ్చం అవే చర్యలకు దిగింది. మనం ఆపరేషన్ సిందూర్ అని పేరు పెడితే తానూ ‘ఆపరేషన్ బున్యాన్ మో§అల్ మర్సూస్’ అని నామకరణం చేసింది.
మోదీ బాటలో షహబాజ్...
ఆపరేషన్ సిందూర్‌లో కీలక పాత్ర పోషించిన ఎయిర్‌ఫోర్స్ బలగాలను మెచ్చుకునేందుకు ప్రధాని మోదీ పంజాబ్‌లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. సుదర్శన చక్ర(ఎస్–400) గగనతల రక్షణ వ్యవస్థ ఎదుట ఎయిర్‌ఫోర్స్ క్యాప్ ధరించి జవాన్లనుద్దేశిస్తూ ప్రసంగించారు. మర్నాడే పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా అచ్చం ఇలాగే చేశారు. సియాల్‌కోట్‌లోని పస్రూర్ కంటోన్మెంట్‌లో యుద్ధట్యాంక్‌పై నిలబడి సైనిక యూనిఫామ్‌లో జవాన్లనుద్దేశించి ప్రసంగించారు. గూఢచర్యం ఆరోపణలపై ఢిల్లీలోని పాక్ హై కమిషన్ ఉద్యోగిని బహిష్కరిస్తే మర్నాడే పాక్ కూడా అదే పనిచేసింది. నిజానికి ఆ భారత ఉద్యోగిని కేంద్రం అప్పటికే వెనక్కి రప్పించడం ఇందులో కొసమెరుపు!