హామీలు గాలికి.. కుట్రలు తెరపైకి..: వైఎస్‌ జగన్‌ | YS Jagan Fires on TDP Govt Over Red Book Politics | Sakshi
Sakshi News home page

హామీలు గాలికి.. కుట్రలు తెరపైకి..: వైఎస్‌ జగన్‌

May 21 2025 5:06 AM | Updated on May 21 2025 11:33 AM

YS Jagan Fires on TDP Govt Over Red Book Politics

బరితెగించి తప్పుడు కేసులతో రాష్ట్రంలో రాక్షస పాలన 

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మండిపాటు

సూపర్‌ సిక్స్‌ లేదు.. ఇతర హామీల అమలూ లేదు 

ప్రజల దృష్టి మళ్లించేందుకే కేసుల మీద కేసులతో అరెస్టుల పర్వం  

నేరంతో సంబంధం లేని వ్యక్తులపై మాను్యఫాక్చర్‌ ఎవిడెన్స్‌ 

వారి వ్యక్తుల్లో ఒకరిని పట్టుకుని అప్రూవర్‌ అంటున్నారు.. ఆ వ్యక్తితో ఇష్టం వచి్చనట్లు మాట్లాడిస్తున్నారు 

వారు లక్ష్యంగా చేసుకున్న మనిషి పేరు చెప్పించి అరెస్ట్‌ చేస్తున్నారు 

రాష్ట్రంలో తొలిసారి ఈ తప్పుడు సంప్రదాయానికి చంద్రబాబు బీజం 

అయినా ఈ కేసులు, జైళ్లకు భయపడాల్సిన పని లేదు.. అప్పుడే రాజకీయాల్లో ఉండగలం.. చేయగలం 

ప్రజలు చంద్రబాబును తీవ్రంగా ద్వేషిస్తున్నారు.. ఏడాదిలోనే కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత 

రేపటి ఎన్నికల్లో ఫుట్‌బాల్‌ను తన్నినట్లు తంతారు.. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారి పేర్లు రాసుకోండి 

రేపు వచ్చేది మన ప్రభుత్వమే.. సినిమా చూపిద్దాం 

వైఎస్సార్‌సీపీ ‘స్థానిక’ ప్రజాప్రతినిధులకు దిశా నిర్దేశం

 సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికలప్పుడు ఇచ్చిన సూపర్‌ సిక్స్, ఇతర హామీలు అమలు చేయకపోగా ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టడంపైనే దృష్టి పెట్టిందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవస్థ­లన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారని, ప్రజాస్వామ్యం మచ్చుకైనా కనిపించడం లేదని.. ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలు పెచ్చుమీరిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వీటన్నింటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రెడ్‌బుక్‌ కుట్రలతో విధ్వంసం సృష్టిస్తున్నారని, బరితెగించి యథేచ్ఛగా కేసుల మీద కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని.. మనం రాక్షస యుగంలో ఉన్నామని, చంద్రబాబు పాలనలో రాజకీయాలు నైతికంగా పతనం అయ్యాయన్నారు. అయితే ఈ అక్రమ కేసులు, అరెస్టుల పర్వానికి భయపడాల్సిన అవసరం లేదని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు తేల్చి చెప్పారు. జైళ్లకు పంపినా సరే.. ‘చంద్ర­బాబూ..  నిన్ను ఎదుర్కొంటాం’ అని ధైర్యంగా, గట్టిగా నిలబ­డగలిగినప్పుడే రాష్ట్రంలో రాజకీయం చేయగలమని స్పష్టం చేశారు.

ఆయన మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీ­పురం మున్సిపాలిటీ, పశ్చిమ గోదా­వరి జిల్లా పాల­కొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం, శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామ­గిరి మండలం, గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొ­రేషన్‌కు చెందిన పార్టీ ప్రజా ప్రతినిధులతో సమావే­శ­మ­య్యారు.

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలపై చర్చించి.. పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. వైఎస్సార్‌సీపీకి కార్యకర్తే నంబర్‌ వన్‌ అని, వచ్చేది మన ప్రభుత్వమే­నని, జగన్‌ 2.0లో కార్యకర్తలకే అత్యధిక ప్రాధా­న్యం ఇస్తామని పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌లు, వైస్‌ చైర్‌పర్సన్‌లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, ఆయా జిల్లాల పార్టీ ముఖ్య నాయకులను ఉద్దేశించి వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత 
ఈ రోజు మనం ఎలాంటి పరిస్థితుల మధ్య ప్రయాణం చేస్తున్నామో నా కంటే మీకే బాగా తెలుసు. మనం రాక్షస యుగంలో ఉన్నాం. కలియుగంలో అంటే చంద్రబాబు యుగంలో రాజకీయాలు చేయాలంటే.. కేసులు వేసినా భయపడకూడదు. జైళ్లకు పంపినా, చంద్ర­బాబూ.. నిన్ను ఎదుర్కొంటాం అని గట్టిగా అంటేనే రాజకీయాల్లో ఉండగలం. రాజకీయాలు చేయగలం. అదే ఈ కలియుగంలో మనం నేర్చుకుంటున్న పాఠం. ఈరోజు రాజకీయాలు అలా తయారయ్యాయి. 

⇒ మామూలుగా ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఏడాది తర్వాత కొంత వస్తుంది. కానీ, చంద్రబాబు ప్రభుత్వానికి ఏడాదిలోనే ప్రజా వ్యతిరేకత చాలా తీవ్ర స్థాయిలో ఉంది. ప్రజలు ఆయన్ను తీవ్రంగా ద్వేషిస్తున్నారు. ఎన్నికల ముందు అడ్డగోలు హామీలు ఇచ్చాడు. జగన్‌ ఇచ్చినవన్నీ ఇవ్వడమే కాకుండా, ఇంకా మూడు ఎక్కువ ఇస్తానన్నాడు. కానీ, ఏదీ నిలబెట్టుకోలేదు. ఇప్పటికే సంవత్సరం అయిపోయింది. అందుకే ఆయన ప్రభుత్వంపై అంత వ్యతిరేకత వచ్చింది.

రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది: వైఎస్ జగన్

⇒ చంద్రబాబు, ఆయన పార్టీ కార్యకర్తలు ఏ ఒక్క ఇంటికీ ధైర్యంగా పోలేరు. వారు ఏ ఇంటి తలుపు తట్టినా.. పిల్లవాడి స్థాయి నుంచి ప్రశ్నించడం మొదలు పెడతారు. ఎన్నికలప్పుడు ఇంటింటికి పోయి ఏం చెప్పారు? బాండ్లు అన్నాడు. ఇంకా ఏమేం చెప్పారు? ఇంటింటికీ వెళ్లి, చిన్న పిల్లాడు కనబడితే నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అని, అదే ఇంట్లో ఆ పిల్లల అమ్మ కనబడితే నీకు రూ.18 వేలు అని, ఆ ఇంట్లోనే అమ్మమ్మలు కనబడితే నీకు రూ.48 వేలు అని, 20 ఏళ్ల యువకుడు కనబడితే నీకు రూ.36 వేలు అని, రైతు కనబడితే నీకు రూ.26 వేలు ఇస్తామని చెప్పారు. ఆ మాటలు ఇంకా వారిని వెంటాడు­తాయి. మాట మీద నిలబడని రాజకీయ నాయకుడు సీఎం హోదాలో ఉన్నాడు. మాట ఇస్తే, దాన్ని అమలు చేయని వ్యక్తి సీఎంగా ఉన్నాడు.

వ్యవస్థలన్నీ నిర్వీర్యం 
⇒  రాష్రంలో విద్యా రంగం నిర్వీర్యం అయింది. ఇంగ్లిష్‌ మీడియం లేదు. గోరుముద్ద నామమాత్రం అయింది. నాడు–నేడు లేదు. పిల్లలకు ట్యాబ్‌లు లేవు. మనం అమ్మ ఒడి కింద రూ.15 వేల చొప్పున ఇచ్చాం. ఇవాళ అది లేదు. నిరుపేదల ఆరోగ్యం గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని వదిలేసింది. 
ఆ బిల్లులు దాదాపు రూ.3,600 కోట్లు ఇవ్వడం లేదు. ఆరోగ్య ఆసరా అమలులోనే లేదు. ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వక పోవడంతో వైద్యానికి ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయి. 

⇒ ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. దళారులు వచ్చారు. ఆర్బీకే వ్యవస్థను నాశనం చేశారు. ఉచిత ఇన్సూ్యరెన్స్‌ లేదు. పంటనష్ట పరిహారం ఇవ్వడం లేదు.
మనం బాగు చేస్తే.. 

బాబు చెడగొడుతున్నాడు 
⇒ మనం 17 మెడికల్‌ కాలేజీలు కడితే, ఈరోజు వాటిని అమ్మేస్తున్నారు. ఏదైనా జిల్లాలో మెడికల్‌ కాలేజీ ఉంటే, అక్కడ అన్ని వైద్య సదుపాయాలు, ఒక మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఉన్నట్లు. దానివల్ల ఆ జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రులు రోగులను మోసం చేయలేవు.

⇒ మనం మూలపేట (శ్రీకాకుళం జిల్లా)తోపాటు మూడు పోర్టులు కట్టడం మొదలు పెట్టాం. వాటిలో 30 శాతం పనులు పూర్తి చేస్తే, కమీషన్ల కోసం చంద్రబాబు వాటిని అమ్మేస్తున్నాడు.
⇒ ఉత్తరాంధ్రలో ట్రైబల్‌ ఇంజినీరింగ్, మెడికల్‌ కాలేజ్, ఐటీడీఏ పరిధిలో ఐదు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం మొదలు పెడితే, ఈ పెద్దమనిషి మొత్తం వదిలేశాడు. భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు కోసం మనం భూసేకరణ చేశాం. 30 శాతం పనులు చేశాం. రాష్ట్రంలో ఎక్కడైనా, ఏ ప్రాంతంలో అయినా, ఏ అభివృద్ధి అయినా జరిగింది అంటే కేవలం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే.

⇒ చంద్రబాబు అన్ని వ్యవస్థలను నాశనం చేశాడు. ఆయన ఎక్కడా మాట నిలబెట్టుకోలేదు. అలా ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు. అందుకే తనను ఎవరూ ప్రశ్నించకూడదని భయానక పాలన సాగిస్తున్నాడు. అందులో భాగంగా రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుపుతున్నారు. ఎవరు మాట్లాడినా, వారి గొంతు నొక్కుతున్నారు. నిలదీస్తున్న గొంతులను నలిపేస్తున్నారు.

రాష్ట్రంలో తొలిసారిగా మాన్యుఫ్యాక్చర్‌ విట్నెస్‌ సృష్టిస్తుండటాన్ని చూస్తున్నాం. అంటే నేరంతో ఒక మనిషికి సంబంధం లేకపోయినా, వారికి సంబంధించిన ఒక వ్యక్తిని పట్టుకుని అప్రూవర్‌ అంటున్నారు. ఆయనతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడిస్తున్నారు. ఆ మనిషితో, ఈ మనిషి పేరు చెప్పిస్తున్నారు. ఈ మనిషిని అరెస్టు చేస్తున్నారు. అలా ఒక మాన్యుఫ్యాక్చర్‌ ఎవిడెన్స్‌ క్రియేట్‌ చేస్తున్నారు. చరిత్రలో గతంలో ఏనాడూ ఇలాంటివి జరగలేదు. ఒక తప్పుడు సంప్రదాయానికి ఈ పెద్దమనిషి చంద్రబాబు ఈరోజు బీజం వేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో పాత కేసులు తిరగ తోడుతున్నారు. మన ఎమ్మెల్యే అభ్యర్థులు, చురుగ్గా పని చేస్తున్న ప్రజా ప్రతినిధులు, నాయకులను ఇరికిస్తున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు.   - వైఎస్‌ జగన్‌

మన ప్రభుత్వ హయాంలో ప్రతి కార్యకర్త కూడా ధైర్యంగా ఇంటింటికీ వెళ్లగలిగాడు. మేనిఫెస్టో చూపి, జగన్‌ ఏం చేశాడో చూపి టిక్‌ పెట్టమని అడిగాడు. అలా ఒకటి కాదు, రెండు కాదు.. మూడు సార్లు ప్రతి ఇంటికీ వెళ్లి, ఎన్నికల ముందు ఏమేం చేశామో చెప్పాం. వాటిని చూపాం. ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం పూర్తి చేసిన పార్టీ దేశంలో ఎక్కడా లేదు. అయినా మనం ప్రతిపక్షంలో ఉన్నాం. కారణం కేవలం 10 శాతం మంది వారి మాటలు నమ్మి, మనకు వ్యతిరేకంగా ఓటేశారు. ఇంత మంచి చేసిన మనమే ప్రతిపక్షంలో కూర్చున్నామంటే.. చంద్రబాబు పరిస్థితి ఏమిటి? ఎన్నికలు ఎప్పుడొచ్చినా, ప్రజలు ఫుట్‌బాల్‌ను తన్నినట్లు తంతారు.  - వైఎస్‌ జగన్‌

ఉధృతంగా పోరాడుదాం.. రాబోయేది మన ప్రభుత్వమే
⇒ ఈ రోజు చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంది. మంగళగిరికి చెందిన సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ పాలేటి కృష్ణవేణిని హైదరాబాద్‌ నుంచి తీసుకొచ్చి, పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిప్పారు. అలాగే సుధారాణిని నెలల తరబడి శ్రీకాకుళం నుంచి అన్ని స్టేషన్లు తిప్పారు. బెయిల్‌ రాకుండా చూశారు. మాజీ ఎమ్మెల్యే వంశీపై 11 కేసులు పెట్టారు. ఒకదాంట్లో బెయిల్‌ వస్తే.. మరో కేసు.. రెండు నెలలుగా జైల్లోనే ఉంచారు. ఒక దాని తర్వాత మరో కేసు పెడుతున్నారు.

⇒  ఇంకొకరు మాజీ ఎంపీ నందిగం సురేష్‌. దళితుడు. నెలల తరబడి జైల్లో పెట్టారు. బెయిల్‌ మీద బయటకు వస్తే, మరో కేసులో ఇరికించి, జైలుకు పంపారు. వాళ్ల ఇంటి దగ్గరకొచ్చి ఒక మనిషి తిట్టాడు. ఎందుకు తిడుతున్నావని ప్రశ్నిస్తే, మరో కేసు పెట్టి, జైలుకు పంపారు.

⇒  ఈ రోజు ఒక తప్పుడు సంప్రదాయం మొదలు పెట్టారు. అది ఒక వృక్షమై, రెండింతలు పెరిగి, వాళ్లనే తన్నే పరిస్థితి వస్తుంది. రాబోయే రోజుల్లో గట్టిగా పోరాడుదాం. చూస్తుండగానే ఏడాది గడిచింది. ఇంకా చూస్తుండగానే మూడేళ్లు గడుస్తాయి. ఆ తర్వాత మన ప్రభుత్వం వస్తుంది. చీకటి తర్వాత వెలుగు తప్పదు. మనం తప్పకుండా గెలుస్తాం. అందుకే రాబోయే రోజుల్లో ఉధృతంగా పోరాడాలి. ఈలోగా గ్రామ స్థాయి నుంచి బూత్‌ కమిటీలు, మండల, జిల్లా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఉద్యమబాట పట్టి, ప్రభుత్వ తప్పులను ప్రజల్లో ఎండగట్టాలి. అందుకే ఈ సమావేశాల నిర్వహణ. ఈ ప్రక్రియలో పార్టీ నాయకులు, కార్యకర్తలది చాలా గొప్ప పాత్ర.

వైఎస్సార్‌సీపీకి కార్యకర్తే నంబర్‌ వన్‌ 
⇒ ప్రతి కార్యకర్తకు చెబుతున్నా. మీకు ఎవరు అన్యాయం చేసినా, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా, వారి పేరు రాసుకోండి. అది ఏ బుక్‌ అయినా సరే. వారి పేరు మాత్రం కచ్చితంగా రాసి పెట్టుకోండి. ఆ తర్వాత మనం వచ్చాక, ఈరోజు మీకు అన్యాయం చేసిన వారికి సినిమా చూపిస్తాం. ఆ మనిషి రిటైర్‌ అయినా, దేశం వదిలి పోయినా లాక్కొస్తాం. ఎవ్వరినీ వదిలి పెట్టం. సినిమా ఎలా చూపాలో వారికి చూపిస్తాం. మిమ్మల్ని ఎవరైనా కొట్టినా కొట్టించుకోండి. ఫరవా­లేదు. నీ టైమ్‌ బాగుంది.. కొట్టు అనండి. ఆ తర్వాత మన టైమ్‌ వస్తుంది. అప్పుడు మనం కొడతాం. ఇవాళ వారు నాటుతున్న విత్తనం రేపు రెండింతలు అవుతుంది.

⇒ ఈరోజు నేను మీ అన్నగా, మీ బిడ్డగా ఒకటే చెబుతున్నా. జగన్‌ 2.0లో పరిస్థితి ఇలా ఉండదు. పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ రోజు కార్యకర్తల కష్టాలు చూశాను. స్వయంగా చెబుతున్నాను. గతంలో మన ప్రభుత్వ హయాంలో రెండేళ్లు కోవిడ్‌. దాంతో మనం యుద్ధం చేశాం. అందువల్ల అనుకున్న మేరకు కార్యకర్తలకు చేయలేకపోయాను. ఇప్పుడు చెబుతున్నాను. రేపు ఈ పరిస్థితి ఉండదు. వైఎస్సార్‌సీపీకి కార్యకర్తనే నంబర్‌ వన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement