
చంద్రబాబు ప్రభుత్వ తీరుపై వైఎస్ జగన్ ఆగ్రహం
స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో బరితెగించి అనైతికంగా గెలుపు
కోరం లేకుండా చేసి.. గెలిచినట్లు ప్రకటించుకుంటున్న వైనం
ఎక్కడా మెజారిటీ లేకపోయినా బరిలోకి దిగి బెదిరింపులు, ప్రలోభాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఖూనీ చేస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల్లో మెజారిటీ లేకపోయినా పదవి కోసం దిగజారిపోతున్నారని మండిపడ్డారు. కోరం లేకుండా చేసి.. గెలిచినట్లు ప్రకటించుకున్నారని తప్పును ఎత్తి చూపారు. ఈ రోజు తిరువూరు.. నిన్న, మొన్న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో.. ఎక్కడైనా అదే రాజకీయం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన స్థానిక సంస్థల పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ఈ రోజు చేస్తున్న రాజకీయంలో కనీసం ఒక శాతం కూడా మనం చేయలేదు. ఏ ఒక్కరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలేదు. నాడు స్థానిక ఎన్నికల్లో అన్నీ మనం గెలిచాం. కేవలం రెండు మున్సిపాలిటీల్లో ఓడిపోయాం. తాడిపత్రి మున్సిపాలిటీలో మనకు 16 మంది కౌన్సిలర్లు ఉంటే, టీడీపీకి 18 మంది ఉన్నారు. ఇద్దరిని లాగుదామని, మన ఎమ్మెల్యే అంటే, నేను వద్దన్నాను. ఎమ్మెల్యేను హౌజ్ అరెస్టు చేయించి, చైర్మన్ ఎన్నిక నిర్వహించాను. అదీ మనం చేసిన విలువలతో కూడిన రాజకీయం. ‘నాడు జగనన్నకు చెబుదాం’, ‘స్పందన’ అనే కార్యక్రమాల ద్వారా ఎవరికి ఏ సమస్య వచ్చినా, నేరుగా సీఎంఓ ఫాలోఅప్ చేసేది. అప్పుడు ఎక్కువ సమస్యలు టీడీపీ వారివే పరిష్కారమయ్యాయి’ అని చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
కోరం లేకపోయినా గెలిచినట్లు ప్రకటిస్తారా?
⇒ ఆ రోజు కులం, మతం, రాజకీయం చూడకుండా మనం పాలించాం. అదే ఈరోజు పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. అయినా ఎవరూ మాట్లాడలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో మనం రాజకీయం చేస్తున్నాం.
⇒ తిరువూరులో 20 మంది కౌన్సిలర్లలో 17 మంది వైఎస్సార్‌సీపీ, మిగతా ముగ్గురు టీడీపీ. అయితే బలవంతంగా ఐదుగురిని లాగారు. అయినా ఆ ఎన్నికలో మనమే గెలవాలి. ఎందుకంటే మన బలం 12. టీడీపీకి కేవలం ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు. టీడీపీకి బలం లేకపోయినా, పదవి కోసం దారుణంగా వ్యవహరిస్తున్నారు. లేదంటే పోలీసుల సహాయంతో ఎన్నిక జరగకుండా చూస్తున్నారు. మన నాయకులను హౌజ్ అరెస్టు చేశారు. టీడీపీ వారందరినీ రోడ్ల మీదకు వదిలారు. ఈరోజు హైకోర్టులో హౌజ్ మోషన్ మూవ్ చేశాం. పోలీసు బందోబస్తు కోరాం.
⇒ నరసరావుపేటలో మొత్తం 17 గెలిచాం. కానీ వారిలో కొందరిని లాక్కున్నారు. దీంతో మనకు 13 మంది సభ్యులు ఉండగా, టీడీపీకి కేవలం ముగ్గురే ఉన్నారు. ఒకరు చనిపోయారు. కోరం లేకపోయినా గెలిచామని ప్రకటించుకున్నారు.
⇒ కారంపూడిలో మొత్తం 14 వైఎస్సార్‌సీపీ గెలిస్తే, ఆరుగురిని లాగారు. అయినా అక్కడ మన బలం ఎనిమిది కాగా, టీడీపీకి ఆరుగురు మాత్రమే ఉన్నారు. అయినా కోరం లేకపోయినా గెలిచినట్లు ప్రకటించారు. చివరకు కుప్పం మున్సిపాలిటీ, రామకుప్పంలోనూ అదే పరిస్థితి.
⇒ రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరిలో వైఎస్సార్‌సీపీ 9 గెలిస్తే, టీడీపీ 1 గెలిచింది. అయినా ఎంపీపీ ఎన్నికలో అక్రమాలు. ఒక పార్టీ మీద గెలిచినప్పుడు, వారిని లాక్కోవడం ఏమిటి? సీఎంగా ఉన్న వ్యక్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడకుండా పోలీసులను పెట్టి భయపెట్టడం ఏమిటి? మన పార్టీ నుంచి ముగ్గురిని లాక్కున్నారు. అయినా మనకు ఇంకా ఆరుగురు ఉన్నారు. మనదే మెజారిటీ. ఎన్నిక పెడితే మనమే గెలుస్తాం. అయినా దౌర్జన్యం చేసి, కోరం లేదని చెప్పి, ఎన్నిక గెల్చే ప్రయత్నం చేస్తున్నారు.
⇒ పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ 14, టీడీపీ నాలుగు స్థానాల్లో నెగ్గింది. ఒకరిని లాక్కున్నారు. మిగతా వారు గట్టిగా నిలబడడంతో ఏం చేయలేక వదిలేశారు. ఇలా ప్రజాస్వామ్యం ఖూనీ అయిన పరిస్థితుల్లో మనం ఏకం అవుతున్నాం.

వైఎస్సార్‌సీపీలో చేరిన విశాఖ టీడీపీ కార్పొరేటర్ పూర్ణిమ శ్రీధర్
సాక్షి, అమరావతి: విశాఖపట్నం 41వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ మంగళవారం వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి ఆమెను సాదరంగా వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వనించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వాసుపల్లి గణేశ్ పాల్గొన్నారు.