
సాక్షి, తాడేపల్లి: సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. నదుల అనుసంధానంపై కూడా అసత్యాలే మాట్లాడారంటూ దుయ్యబట్టారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు స్థాపనలు చేయడం తర్వాత మరిచిపోవడం చంద్రబాబుకు అలవాటు అంటూ చురకలు అంటించారు.
‘‘పోలవరాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబే. తన పచ్చి అబద్దాల కోసం చనిపోయిన వాజపేయిని కూడా వాడుకున్నారు. చంద్రబాబు శిలా ఫలకాలు వేసిన చోట దివంగత మహానేత వైఎస్సార్ మొక్కలు కూడా నాటారు. చంద్రబాబు జీవితంలో శంకుస్థాపన చేసి పూర్తి చేసింది కేవలం పట్టిసీమ మాత్రమే. పోలవరానికి శంకుస్థాపన చేసింది వైఎస్సార్. కానీ తానే చేసినట్టు నిస్సిగ్గుగా చంద్రబాబు అబద్దాలు చెప్తున్నారు. నిజంగా పోలవరం మీద ప్రేమ ఉంటే ప్రాజెక్టు సందర్శనకు ఎందుకు వెళ్లటం లేదు?’’ అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు.
‘‘గతంలో కమీషన్ల కోసం ప్రతి సోమవారం పోలవరం వెళ్లారు. కాఫర్ డ్యాం, డయాఫ్రం వాల్ ఇలా ప్రతి దానికీ శంకుస్థాపన పేరుతో శిలా ఫలకాలు వేశారు. స్పిల్ వే పూర్తి చేయకుండానే గేటులు పెట్టునట్టు భజన చేయించుకున్నారు. చంద్రబాబు అసమర్థ నిర్ణయాల వలనే పోలవరం ఆలస్యం అవుతోంది. విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని కేంద్రమే కట్టాల్సి ఉంది. కానీ కమీషన్ల కోసమే చంద్రబాబు పోలవరాన్ని తీసుకున్నారు. పోలవరాన్ని పేటిఎంలాగా వాడుకుంటున్నారని ప్రధాని మోదీనే చెప్పారు’’ అని అంబటి గుర్తు చేశారు.
‘‘స్పిల్ వే నిర్మాణం చేసి నదిని డైవర్ట్ చేసిన ఘనత జగన్‌ది. 41.15 మీటర్లకే నీటిని నిలిపేందుకు చంద్రబాబు అంగీకరించారు. దీని వలన ఉత్తరాంధ్రకు నీరు అందని పరిస్థితి ఏర్పడింది. పోలవరం నిర్మాణంలో తప్పులు జరిగాయని సాక్షాత్తు అంతర్జాతీయ నిపుణుల కమిటీనే తేల్చి చెప్పింది. డయాఫ్రం వాల్ నిర్మాణం కూడా చంద్రబాబు హయాంలోనే డ్యామేజీ అయిందని కమిటీ చెప్పింది. మా హయాంలో వచ్చిన వరదల సమయంలో అద్భుతంగా పని చేశామని అదే నిపుణుల కమిటీ మా ప్రభుత్వాన్ని మెచ్చుకుంది. పోలవరానికి కావాల్సిన అన్ని అనుమతులు తెచ్చిన ఘనత వైఎస్సార్‌ది. ఆయన కృషిని జగన్ కొనసాగిస్తూ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లారు
..కరోనా సమయంలో సైతం పోలవరాన్ని వేగంగా నిర్మాణం చేయించారు. పోలవరాన్ని పూర్తి చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు లేదు. అది ఆయన కలలు కన్న ప్రాజెక్టు కాదు. అసెంబ్లీలో మాత్రమే పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉంటున్నారు. కనీసం కేబినెట్ మీటింగ్‌లకు కూడా హాజరు కావటం లేదు. దీని వెనుక మర్మం ఏంటో పవన్‌కే తెలియాలి. డిప్యూటీ సీఎం సినిమాలో నటిస్తే టికెట్ ధర వెయ్యి చేస్తారా?. అధికారం ఉందని మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా?. ఈ దోపిడీ కరెక్టు కాదు. జనాన్ని పీక్కుతింటామంటే కుదరదు. ఎక్కువ మంది జనం చూస్తే డబ్బులు రావాలని కోరుకోవాలే గానీ ఇలా దోపిడీ చేయడం కరెక్టు కాదు. పరకామణిని వైఎస్సార్‌సీపీ వారు దోచుకున్నారంటూ లోకేష్ ట్వీట్ చేయటం అవివేకం. ప్రతిదానిలోనూ మేము ఉంటామని చెప్పటం లోకేష్‌కు అలవాటే. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇంకా మూడేళ్లు కొనసాగిస్తారు. ఆ తర్వాత సంగతేంటో కూడా లోకేష్ గుర్తిస్తే మంచిది’’ అంటూ అంబటి వ్యాఖ్యానించారు.
