
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు జ్ఞానం కోల్పోతున్నారంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆధారాలు లేని అభూత కల్పనలతో సిట్ దర్యాప్తు సాగుతుందని దుయ్యబట్టారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. చంద్రబాబు మీద లిక్కర్ స్కామ్ కేసు ఉందని.. ఆ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్‌మీద ఉన్నారని గుర్తు చేశారు.
వైఎస్సార్‌సీపీని అణచాలని చూడటం దుర్మార్గం. చెవిరెడ్డి మీద అక్రమ కేసు పెట్టి వెంటాడుతున్నారు. సిట్ దర్యాప్తును ప్రజలు నమ్మడం లేదు.. నవ్వుతున్నారు. లోకేష్, చంద్రబాబు వాస్తవాలు తెలుసుకోవాలి’’ అని అంబటి హితవు పలికారు.
‘‘లేని లిక్కర్ స్కాంలో సిట్ ఇంకా భేతాళ కథలే అల్లుతోంది. వైఎస్ జగన్ చుట్టూ ఉండే నేతలను అరెస్టు చేయటమే లక్ష్యంగా సిట్ పని చేస్తోంది. ఒక దురుద్దేశంతో నడుపుతున్న కథే లిక్కర్ స్కాం. కట్టుకథల ఛార్జిషీట్‌ను కోర్టు కూడా వెనక్కు పంపినా సిట్‌కు బుద్ధి రాలేదు. జగన్ వెంట ఉంటున్నాడని చెవిరెడ్డి, ఆయన కుమారుడిని వేధిస్తున్నారు. చెవిరెడ్డి కుటుంబం విపరీతమైన దైవభక్తి ఉన్న కుటుంబం. ప్రభుత్వానికి టాక్స్‌లు కడుతూ వ్యాపారాలు చేసినా సిట్ తప్పుపడుతోంది
..భూములు కొన్నా, అమ్మినా కూడా స్కాం అని ఎల్లోమీడియా రాస్తోంది. ఎల్లో మీడియాలో వచ్చిన వార్తలతోనే ఛార్జిషీట్ వేస్తున్నారు తప్ప కొత్తగా ఏమీ ఉండటం లేదు. రూ.11 కోట్ల విషయంలో కోర్టుకు సిట్ దొరికిపోయారు. తప్పుడు కథలు చెప్తే కోర్టు ప్రశ్నించింది. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సిట్ నీళ్లు నమిలింది. ప్రభుత్వమే లిక్కర్ అమ్మినప్పుడు ఇక మధ్యవర్తుల పాత్ర ఎలా ఉంటుంది?. అసలైన లిక్కర్ స్కాం ఇప్పుడు జరుగుతోంది. వైఎస్సార్‌సీపీ నేతలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తట్టుకుంటాం

..ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలపడతాం. ఎంత అణచివేయాలని చూస్తే అంతగా పైకి ఎదుగుతాం. సరైన ఆధారాలు చూపే శక్తి సిట్‌కు లేదు. అసలు స్కామే జరగనప్పుడు ఇక ఆధారాలు ఎలా ఉంటాయి?. ప్రజలను నమ్మించాలనుకుంటే అది జరగదు. చంద్రబాబు అనుకుంటున్న రాజధాని ఎప్పటికీ పూర్తి కాదు. పర్మినెంటు అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్‌ని ఈ మూడేళ్లలో కట్టగలరా?. రాజధాని కోసం లక్ష కోట్లు ఖర్చు పెడతారా?. మెడికల్ కాలేజీలను మాత్రం ప్రైవేటు వారికి అమ్మేస్తారా?. కులాల మధ్య చిచ్చు పెట్టటం జనసేనకే అలవాటు. ప్రజలకు ఉచితంగా ఇసుక అందటం లేదు. ప్రభుత్వానికి ఆదాయం రావటం లేదు. మరి ఇసుక, ఆదాయం ఎవరి చేతిలోకి వెళ్తోంది?’’ అంటూ అంబటి రాంబాబు నిలదీశారు.