
సాక్షి, తాడేపల్లి: ఎల్లో మీడియా, చంద్రబాబు.. రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పోలవరం, బనకచర్ల మీదనే రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశమంటూ ఎల్లో మీడియా చాలా రోజులుగా హడావుడి చేశాయి.. తీరా చూస్తే అసలు దీనిమీద చర్చే జరగలేదని అంబటి రాంబాబు అన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎవరిని మోసం చేయాలని ఇలాంటి పనులు చేస్తున్నారు చంద్రబాబూ? అంటూ ప్రశ్నించారు.
‘‘చంద్రబాబు శాలువాలు కప్పి బయటకు వచ్చారు. రెండు రాష్ట్రాలూ నాకు సమానమంటూ బడాయి మాటలు చెప్పి వచ్చేశారు. మంత్రి రామానాయుడు మాత్రం కమిటీ వేస్తున్నట్టు చెప్పి మళ్లీ మోసం చేయాలని చూశారు. విభజన సమస్యల పరిష్కారం కోసం అంటూ గతంలో ఇద్దరు సీఎంలు కలిశారు. ఆ రోజు కూడా తెగ బడాయి మాటలు చెప్పారు. తీరా చూస్తే ఏమీ జరగలేదు. కానీ వారి ఎల్లో మీడియా మాత్రం ఆహాఓహో అంటూ జాకీలు లేపింది
..రాయలసీమకు నీరు అందించే ఆలోచనే చంద్రబాబు కు లేదు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ఇంతకాలంలో రాయలసీమ కోసం ఒక్క పనైనా ఎందుకు చేయలేదు?. పోలవరంలో 42 మీటర్ల ఎత్తు ఉంటేనే బనకచర్లకు నీరు తీసుకెళ్లటానికి వీలవుతుంది. కానీ పోలవరాన్ని 41 మీటర్ల ఎత్తుకే ఆపేస్తే ఇక బనకచర్ల ఎలా సాధ్యం?. 2027కు పోలవరాన్ని పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. కానీ ఆ స్థాయిలో పనులు జరగటం లేదని ఎల్లో మీడియానే రాసింది
..డయాఫ్రం వాల్ నిర్మాణం1.6 మీటర్ల వెడల్పుతో వేయాల్సి ఉండగా కేవలం 0.9 మీటర్లకే వేస్తున్నారు. ఇది పోలవరం ప్రాజెక్టుకే అత్యంత ప్రమాదకరం. ప్రాజెక్టు నిర్మాణ సంస్థతో కుమ్మక్కై చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పోలవరాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారు. సీడబ్ల్యుసీ, పోలవరం అథారిటీ వారు బనకచర్లకు అనుమతులు లేవని తేల్చిచెప్పింది. ఇది చంద్రబాబుకు సిగ్గుచేటు కాదా?
..హంద్రీనీవా ప్రాజెక్టుకు నీరు వదలటానికి చంద్రబాబు వెళ్లటం ఏంటి?. మంత్రులో, అధికారులే చేసే చేసే పనిని చంద్రబాబు చేయటం సిగ్గుచేటు. హంద్రీనీవా కొత్త ప్రాజెక్టు కాదు. పోలవరం, అమరావతి విషయాలలో చంద్రబాబు దుర్మార్గపు పనులు చేస్తున్నారు. రాయలసీమకు చంద్రబాబు ఏనాడూ ఏమీ చేయలేదు. తప్పు ఒప్పో చూడకుండా పోలీసులు ఎలా కేసు పెడతారు?.

జర్నలిస్టు కొమ్మినేని మీద ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు ఎలా పెడతారు?. జగన్ మీద కేసు ఎలా పెట్టారు?. పిన్నెళ్లి సోదరుల మీద హత్య కేసులు ఎలా పెడతారు?. పోలీసు అధికారుల సంఘం ముందు సమాధానం చెప్పాలి. ఇష్టానుసారం కేసులు పెడతామంటే చూస్తూ ఊరుకోం. జగన్ సమావేశానికి రైతులు వెళ్తే రౌడీషీట్లు ఓపెన్ చేస్తారా?. సోషల్ మీడియా కార్యకర్తలపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్టు కోర్టులు కూడా గుర్తించాయి. టీడీపీ నేతలు చెప్పినట్టు చేస్తూ కొందరు పోలీసు అధికారులు మాఫియా డాన్ లాగా వ్యవహరిస్తున్నారు’’ అని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.