సింగ‌య్య ఘటనపై ఎల్లో మీడియా క్షుద్ర రాజ‌కీయాలు: అంబటి | Ambati Rambabu Fires On Chandrababu And Yellow Media Over Security In YS Jagan Palnadu Tour, More Details Inside | Sakshi
Sakshi News home page

సింగ‌య్య ఘటనపై ఎల్లో మీడియా క్షుద్ర రాజ‌కీయాలు: అంబటి

Jun 22 2025 11:59 AM | Updated on Jun 22 2025 2:58 PM

Ambati Rambabu Fires On Chandrababu And Yellow Media

సాక్షి, గుంటూరు: ఈ రాష్ట్రంలో ఆంధ్రజ్యోతి, ఈనాడు సంస్థలు ప్రజలకు వాస్తవాలను చెప్పడానికి బదులు చంద్రబాబుకు దాసోహమై నిత్యం తన అబద్దపు రాతలతో వైఎస్‌ జగన్ వ్యక్తిత్వహననమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైయస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో సింగయ్య అనే అభిమాని చనిపోతే, ఆ మరణంపై ఏ మాత్రం మానవత్వం లేకుండా ఎల్లో మీడియా క్షుద్రరాతలతో వైఎస్సార్‌సీపీపై విషం చిమ్ముతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వైఎస్‌ జగన్‌ పర్యటనలకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో వున్న కూటమి ప్రభుత్వ కుట్రలకు ఎల్లో మీడియా కూడా భాగస్వామిగా మారిందని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే. వైఎస్‌ జ‌గ‌న్ స‌త్తెన‌ప‌ల్లి ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా దురదృష్ట‌వ‌శాత్తు వెంగ‌ళాయ‌పాలేనికి చెందిన సింగ‌య్య అనే వ్య‌క్తి యాక్సిడెంట్‌లో చ‌నిపోగా, స‌త్తెన‌ప‌ల్లిలో జ‌య‌వ‌ర్ధ‌న్‌రెడ్డి అనే యువ‌కుడు వ‌డ‌దెబ్బ కార‌ణంగా గుండెపోటుకు గురై మృతిచెందారు.

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌ జ‌గ‌న్ వాహ‌నం కానీ, ఆయ‌న కాన్వాయ్ వాహ‌నాలు కానీ సింగయ్యను ఢీకొట్ట‌లేద‌ని ఎస్పీ స్వ‌యంగా వెల్లడించారు. కాన్వాయ్‌కి ముందు వెళ్తున్న కారు ఢీకొట్ట‌డంతో ఆయ‌న ప్ర‌మాదానికి గురైన‌ట్టు ఎస్పీ ధ్రువీకరించారు. దుర‌దృష్ట‌వ‌శాత్తు జ‌రిగిన ప్ర‌మాదాన్ని కూడా రాజ‌కీయం చేయాల‌ని కూటమి ప్రభుత్వం చూస్తోంది. వైఎస్‌ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న కోసం సింగ‌య్యతో పాటు మ‌రో 40 మందిని మా పార్టీ ప్రత్తిపాడు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జ్‌ బాల‌సాని కిర‌ణ్‌ కుమార్‌ తీసుకొచ్చిన‌ట్టుగా రాసిన స్టేట్‌మెంట్ మీద‌ సంత‌కం పెట్ట‌మ‌ని సింగ‌య్య మృత‌దేహానికి పోస్టుమార్టం సమ‌యంలో ఆయ‌న భార్య‌ను పోలీసులు ఒత్తిడి చేశారు.

పోలీసులు రాసి తీసుకొచ్చిన‌ త‌ప్పుడు స్టేట్‌మెంట్‌పై ఆ స‌మ‌యంలో అక్క‌డే ఉన్న  పార్టీ నాయ‌కులమంతా అడ్డం తిర‌గడంతో పోలీసులు సింగ‌య్య భార్య, ఆమె బంధువులు ఇచ్చిన స్టేట్‌మెంట్ రికార్డు చేసుకుని వెళ్లిపోయారు. లేదంటే దీన్ని హ‌త్య‌కేసుగా చిత్రీక‌రించి ఎవ‌రో ఒక‌ర్ని ఇరికించాల‌న్న కుట్ర అప్పుడే జ‌రిగింది.

వైఎస్‌ జ‌గ‌న్‌ని ఇబ్బంది పెట్టాలన్నదే వారి లక్ష్యం
రాష్ట్రంలో ఏ మూల‌న ఏ సంఘ‌ట‌న జ‌రిగినా పోలీసుల క‌న్నా ముందే ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి ద‌ర్యాప్తు చేసి రిపోర్టును ప్రింట్ చేస్తున్నాయి. వైఎస్‌ జ‌గ‌న్ వ్య‌క్తిత్వ హ‌న‌న‌మే ఎజెండాగా ఈ రెండు ప‌త్రిక‌లు ఏ చిన్న సంఘ‌ట‌న జ‌రిగినా దానిని చిలువ‌లు వ‌ల‌వులుగా చేసి మా నాయకునికి నేరాన్ని ఆపాదించే కుట్రలు చేస్తున్నారు. సింగ‌య్య మ‌ర‌ణం ప్ర‌మాదవ‌శాత్తు జ‌రిగింద‌ని అంద‌రికీ తెలిసిన స‌త్యం. చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌ల్లోనూ చాలాసార్లు ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి. తొక్కిస‌లాట‌ల్లో కూడా అమాయ‌కులు బ‌ల‌య్యారు. ఈ వాస్త‌వాల‌ను ప‌క్క‌న‌పెట్టి ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి వ‌క్రీక‌రించి త‌ప్పుడు క‌థ‌నాలు రాస్తున్నారు.

'జ‌గ‌న్ వాహ‌నానికి సింగ‌య్య బ‌లి', 'సింగయ్య‌ను బ‌లి తీసుకున్న జ‌గ‌న్ వాహ‌నం' అంటూ ఈ రెండు ప‌త్రిక‌లు ప్రమాదాన్ని హ‌త్య‌గా చూపించాల‌ని క్షుద్ర రాజ‌కీయాలు చేస్తున్నారు. త‌న వాహ‌నమే కాదు, ఆయ‌న కళ్ల‌ముందు ఏదైనా ప్రమాదం జ‌రిగినా వారిని ఆస్ప‌త్రి చేర్చేవర‌కు ఆయ‌న ఊరుకోరు. అలాంటిది జ‌గ‌నే స్వ‌యంగా కారేసుకెళ్లి సింగ‌య్య‌ను గుద్ది చంపాడు అన్నంత‌లా దుష్ప్ర‌చారం చేస్తున్నారు. ఎవ‌రికో ప్ర‌మాదం జ‌రిగితేనే త‌ట్టుకోలేని జ‌గ‌న్‌, మా కార్య‌క‌ర్త సింగ‌య్య చ‌నిపోతే ఎలా వ‌దిలేస్తార‌నుకున్నారు? ఆయ‌న కుటుంబానికి వైఎస్సార్సీపీ అండ‌గా నిలిచింది. ఇప్ప‌టికే వారి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించి రూ. 10 ల‌క్ష‌ల చెక్కును పార్టీ త‌ర‌ఫున వారి కుటుంబానికి అంద‌జేయ‌డం కూడా జ‌రిగింది.

చ‌నిపోయిన వ్యక్తుల గురించి నీచంగా రాస్తున్నారు
వైయ‌స్ జ‌గన్ ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతం కావ‌డంతో ఓర్వ‌లేక క్షుద్ర రాజ‌కీయాలు చేస్తున్నారు. వైఎస్‌ జ‌గ‌న్ ఎప్ప‌టికీ బ‌య‌ట‌కు రావొద్ద‌నే ల‌క్ష్యంతో ప్ర‌భుత్వం త‌ప్పుడు క‌థ‌నాలు రాయించి, త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. స‌త్తెన‌ప‌ల్లి ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతం కావ‌డంతో దాని మీద ఇప్ప‌టికే మా నాయ‌కులు గ‌జ్జ‌ల సుధీర్ భార్గ‌వ్‌రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస‌రెడ్డి మీద కేసులు పెట్టారు. నాకు కూడా నిన్న రాత్రి నోటీసులు ఇచ్చి వెళ్లారు. చంద్రబాబుని జైల్లో పెట్టామ‌నే క‌క్ష‌తో ఇప్పుడు వైఎస్సార్సీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులంద‌ర్నీ లోకేష్ జైళ్ల‌కు పంపుతున్నాడు. ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కోవ‌డానికి మేం సిద్ధంగా ఉన్నాం. వెన‌క‌డుగు వేసే ప్ర‌స‌క్తే ఉండ‌దు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement