
సాక్షి, బాపట్ల: రేపల్లె ఆసుపత్రిలో వైఎస్సార్‌సీపీ నేత వరికూటి అశోక్‌బాబు దీక్ష కొనసాగుతోంది. ఆయన్ను ఆదివారం.. వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. అనంతరం అంబటి మీడియాతో మాట్లాడుతూ.. అశోక్ బాబు ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా మారిందన్నారు. ‘‘రైతుల సమస్య పరిష్కారం అయ్యే వరకు నిరాహార దీక్ష విరమించనని అశోక్ బాబు అంటున్నారు. మూడు రోజుల నుంచి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా దీక్ష చేస్తున్నారు’’ అని అంబటి రాంబాబు చెప్పారు.
‘‘వేమూరు నియోజకవర్గంలో రైతులంతా కలిసి కాలువలో గుర్రపు డెక్కతో తమ పడుతున్న ఇబ్బందిని అశోక్ బాబు దృష్టికి తీసుకువచ్చారు. ఆయన కాలువలో గుర్రపు డెక్క తొలగించాలంటూ రెండు రోజులు పాటు అక్కడే దీక్ష చేశారు. అధికారులు స్పందించట్లేదు. కనీసం కాలువల్లో గుర్రపు డెక్క కూడా తీయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. కాలువలో గుర్రపు డెక్క ప్రభుత్వం తొలగించాలి. ప్రభుత్వానికి చేతకాకపోతే గుర్రపు డెక్క తొలగించడానికి రైతులకు అవకాశం ఇవ్వాలి’’ అని అంబటి రాంబాబు అన్నారు.
రేపల్లె టౌన్ సీఐ మల్లికార్జునరావు.. అశోక్‌బాబు పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. అశోక్‌బాబు పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించాడు. అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడిన అధికారులను కచ్చితంగా మేము గుర్తుపెట్టుకుంటాం’’ అని అంబటి రాంబాబు హెచ్చరించారు.