
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు నిర్వహించిన ఛలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం విజయవంతం అయిందని మాజీ మంత్రి విడదల రజని అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ ఇచ్చిన జీవోను తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం స్పందించకుంటే దిగొచ్చేదాకా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని రజని హెచ్చరించారు. పోలీసులను ప్రయోగించి నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూసినా పార్టీ శ్రేణులు, విద్యార్థులు, యువత, ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చారని వివరించారు. మెడికల్ కాలేజీలు పూర్తి కాలేదని కూటమి నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఆయా మెడికల్ కాలేజీల వద్దకు వెళ్లి ఫొటోలు, వీడియోలు ప్రదర్శించారని ఆమె మీడియాకు వివరించారు. ఆమె ఇంకా ఏమన్నారంటే..
మెడికల్ కాలేజీల నిర్మాణానికి నిధుల కొరత లేదు
వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో జరిగిన ఛలో మెడికల్ కాలేజీల కార్యక్రమం విజయవంతమైంది. గత ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో రూ.8,500 కోట్ల వ్యయంతో వైఎస్ జగన్ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టి 5 కాలేజీలను పూర్తి చేశారు. వాటిల్లో అడ్మిషన్లు పూర్తయ్యి క్లాసులు జరుగుతున్నాయి. ఎన్నికల నాటికి పూర్తయిన పాడేరు మెడికల్ కాలేజీని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రారంభించింది.
వైఎస్ జగన్ మీద కక్షతో పులివెందుల మెడికల్ కాలేజీని మాత్రం ప్రారంభించకుండా ఎన్ఎంసీ సీట్లు కేటాయించినా వద్దని లేఖరాసిన నీచుడు చంద్రబాబు. వీటితో పాటు రెండో దశలో ప్రారంభంకావాల్సిన మరో 3 మెడికల్ కాలేజీలు 90 శాతం పనులు పూర్తయినా, కూటమి ప్రభుత్వం వచ్చాక 15 నెలలుగా పెండింగ్ పనులను పూర్తి చేయకుండా పక్కనపెట్టేశారు. మూడో దశలో పూర్తి చేయాల్సిన కాలేజీలు సైతం పిల్లర్ల దశలో ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి కూడా పనులన్నీ ప్రణాళిక ప్రకారం శరవేగంగా జరుగుతుండేవి. మెడికల్ కాలేజీలు పూర్తయితే వైఎస్ జగన్‌కి మంచి పేరు వస్తోందన్న కుట్రతో ప్రారంభించకుండా సేఫ్ క్లోజర్ పేరుతో మూసేసిన నీచ చరిత్ర చంద్రబాబుది.
పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలని కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. కాలేజీల నిర్మాణం నిధుల కొరత కారణంగా ఆగిపోకూడదన్న ఉద్దేశంతో సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, నాబార్డు నిధులు వచ్చేలా టైఅప్ చేసుకున్నారు. పేదల వైద్యం ప్రభుత్వ బాధ్యతగా భావించి వైయస్ జగన్ అంత గొప్పగా ఆలోచించి ముందుచూపుతో వ్యవహరిస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు వాటిని పీపీపీ పేరుతో పప్పు బెల్లాలకు తన వారికి కట్టబెట్టేందుకు సిద్దమయ్యారు.
10 మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీలు, ప్రభుత్వ ఆస్తులను దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ప్రజారోగ్యం గురించి ఆలోచించకుండా, మెడిసిన్ చదివి డాక్టర్ కావాలని కలలు కంటున్న పేద విద్యార్థుల ఆశలను చిదిమేస్తూ దోపిడీయే ధ్యేయంగా సీఎం చంద్రబాబు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నాడు.
పోలీసుల వేధింపులకు లెక్క చేయకుండా వచ్చారు
ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మరీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది. వైఎస్సార్‌సీపీ వాదనకు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలపై సమాధానం చెప్పుకోలేని కూటమి ప్రభుత్వం, కాలేజీల నిర్మాణమే జరగలేదని విష ప్రచారం మొదలు పెట్టింది. కాలేజీల నిర్మాణం పూర్తయి క్లాసులు జరుగుతున్నప్పటికీ పిల్లర్ల దశలో ఉన్న భవనాల పొటోలు చూపించి ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్రకు తెరలేపారు.
ఈ నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని విద్యార్థులు, యువజన విభాగాల ఆధ్వర్యంలో `ఛలో మెడికల్ కాలేజీ`ల కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ నిర్వహించింది. కేసులు పెడతామని బెదిరించినా ఎక్కడా వెనక్కి తగ్గకుండా 17 కొత్త మెడికల్ కాలేజీల వద్దకు వెళ్లి కాలేజీ నిర్మాణాల పరిస్థితిని ప్రజలకు వివరించాం. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి కూడా విశేషమైన స్పందన లభించింది. ఏ కాలేజీ ఏయే స్థితిలో ఉందో మా కార్యకర్తలు నేరుగా ఆయా భవనాల వద్దకు వెళ్లి వీడియోలు, ఫొటోల ద్వారా వివరించడం జరిగింది.
హౌస్ అరెస్టులు, అక్రమ కేసులతో అడ్డుకోవాలని ఎంత ప్రయత్నించినా అడ్డంకులన్నీ దాటుకుని వైయస్సార్సీపీ నాయకులతో పాటు విద్యార్థులు, సామాన్య ప్రజలు ఈ ఆందోళన కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపైనే చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వ నిర్ణయంపై యవతలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. సోషల్ మీడియాలో సైతం స్వచ్ఛందంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని వైయస్సార్సీపీ చేస్తున్న ఆందోళనలకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది.
ప్రైవేటీకరణ జీవోను వెనక్కి తీసుకోవాలి
వైఎస్సార్‌సీపీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తారనే భయంతో ఎక్కడికక్కడ నాయకులను హౌస్ అరెస్టులు చేసినా, అరెస్టులు, కేసుల పేరుతో భయపెట్టినా వైఎస్సార్‌సీపీ శ్రేణులు వెనకడుగు వేయలేదు. పల్నాడు జిల్లా పరిధిలో నిరసన కార్యక్రమాన్ని ఎలాగైనా అడ్డుకుని తీరాలన్న లక్ష్యంతో ప్రత్యేక దృష్టి పెట్టారు. నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా నన్ను హౌస్ అరెస్టు చేశారు.
మా నాయకులు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డిని పక్క రాష్ట్రం మిర్యాలగూడలో అడ్డుకుని కార్యక్రమంలో పాల్గొనకుండా చూశారు. పోలీసులను ప్రయోగించి అక్కడక్కడా వైయస్సార్సీపీ నాయకులను అడ్డుకుని ఉండొచ్చేమో కానీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేదాకా వైఎస్సార్‌సీపీ పోరాటం ఆపడం జరగదని స్పష్టంగా చెబుతున్నాము. ఎంత ఆపుదామని ప్రయత్నిస్తే అంతగా రెట్టింపు ఉత్సాహంతో వైయస్సార్సీపీ పోరాడుతుంది. ప్రైవేటీకరణ పేరుతో ఇచ్చిన జీవోను తక్షణం వెనక్కి తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం మేల్కొనేదాకా మా పోరాటం ఆగదు.