
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్ట్‌పై సీఎం చంద్రబాబు పచ్చి అబద్దాలు చెబుతున్నారని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యం కావడానికి ప్రధాన కారకుడు చంద్రబాబు అని మండిపడ్డారు. కుప్పానికి నీళ్లు ఇచ్చానంటూ చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ను చంద్రబాబు ధ్వంసం చేశారని ఘాటు విమర్శలు చేశారు.
మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘పోలవరంపై చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే. కాఫర్ డ్యామ్ పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్ ఎలా కట్టారు?. కుప్పానికి నీళ్లు ఇచ్చానంటూ చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. పోలవరానికి శంకుస్థాపన చేసి, అన్ని అనుమతులు తీసుకువచ్చింది వైఎస్సార్. కుడి కాల్వకు భూసేకరణ 10628 ఎకరాలు 2004 నుంచి 2014 మధ్య జరిగింది. ఎడమ కాలువకు 10343 ఎకరాల భూ సేకరణ కూడా ఇదే సమయంలో జరిగింది. పోలవరం ప్రాజెక్ట్‌ను చంద్రబాబు ధ్వంసం చేశారు.
పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ కేంద్రం బాధ్యత. పోలవరం ప్రాజెక్ట్‌ను చేతుల్లోకి తీసుకుని చంద్రబాబు చారిత్రక తప్పిదం చేశారు. సెప్టెంబర్ 8, 2016లో అరుణ్ జైట్లీతో చంద్రబాబు ఒప్పందం కారణంగా చాలా నష్టపోయాం. రూ.50వేల కోట్ల ప్రాజెక్ట్‌ను చంద్రబాబు రూ.20వేల కోట్లకు ఒప్పుకున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక కేంద్రానికి చెప్పి రూ.48వేల కోట్లకు ఒప్పించాం. పోలవరంపై చంద్రబాబు తప్పుడు విధానాలు వల్ల చాలా నష్టం జరిగింది. పోలవరం కోసం వైఎస్ జగన్ అనేక సార్లు ఢిల్లీకి వెళ్లారు. మూసేసిన పోలవరం ఫైల్‌ను వైఎస్ జగన్ ఓపెన్ చేయించారు.
పోలవరంపై కనీసం అడిగే పరిస్థితుల్లో కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం లేదు. మేం సాధించిన డబ్బులే పోలవరం ప్రాజెక్ట్‌పై కూటమి ప్రభుత్వానికి ఇస్తున్నారు. పోలవరం డబ్బులు అక్టోబర్ 2024లో వస్తే జనవరి 2025లో ఖర్చు చేస్తారు. జలయజ్ఞంలో భాగంగా వైఎస్సార్ 83 ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేశారు. వైఎస్సార్ చనిపోయే నాటికి 43 ప్రాజెక్ట్‌లు పూర్తి అయ్యాయి. ఆయన హయాంలో 32 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లు ఇచ్చారు. హంద్రీ-నీవాపై చంద్రబాబు చాలా దారుణంగా అబద్ధాలు చెబుతున్నారు. హంద్రీ-నీవాపై సింహభాగం పనులు వైఎస్సార్ పూర్తి చేశారు. జల యజ్ఞంలో మిగిలిన పనులను వైఎస్ జగన్ పరుగులు పెట్టించారు’ అని తెలిపారు.