సాక్షి, విజయవాడ: మంత్రి నాదెండ్ల మనోహర్‌కు రైతులు, టీడీపీ నేతలు షాక్ ఇచ్చారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే రైతులకు మేలు జరిగిందన్న టీడీపీ నేతలు.. గత ప్రభుత్వంలో రైతు భరోసా సక్రమంగా అందిందన్నారు. కూటమి పాలనలో రైతు భరోసా అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
శనివారం(డిసెంబర్ 20) తోట్లవల్లూరు మండలంలో పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్‌ను మిల్లర్లు తమ కష్టాన్ని దోచేస్తున్నారంటూ రైతులు నిలదీశారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో రైతులు.. చంద్రబాబు సర్కార్ గాలితీసేశారు. ధాన్యం కొనుగోళ్లలో దోపిడీని ఆధారాలతో సహా రైతులు బయటపెట్టారు.
రైతులకు మేమే మేలు చేశామని డబ్బాలు కొట్టిన చంద్రబాబు సర్కార్.. ధాన్యం కొనుగోళ్లపై గొప్పలు చెప్పుకుంటుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ సాక్షిగా ప్రభుత్వం డొల్లతనం బయటపడింది. వైఎస్సార్‌సీపీ హయాంలోనే రైతులకు మేలు జరిగిందన్న టీడీపీ నేత తోట సాయిబాబు.. గత ప్రభుత్వంలో రైతు భరోసా సక్రమంగా ఇచ్చారన్నారు. కూటమి ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ అరకొరగానే ఇచ్చారన్నారు. దీంతో టీడీపీ నేతలు సైతం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని మెచ్చుకోవడంతో మంత్రి నాదెండ్ల మనోహర్, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా కంగుతిన్నారు.


