సాక్షి,తిరుపతి: ఎస్వీ యూనివర్సిటీ లేడీస్ హాస్టల్‌లో విద్యార్థినులు నిరసన బాట పట్టారు. హాస్టల్‌లో అందిస్తున్న ఆహారం నాణ్యతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. చపాతీలతో హాస్టల్ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.
తాము తినే ఆహారంలో పురుగులు వస్తున్నాయని, ఈ సమస్యను పలుమార్లు హాస్టల్ చీఫ్ వార్డెన్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హాస్టల్ సమస్యలను పరిష్కరించేందుకు యూనివర్సిటీ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. నిరసన సమయంలో మీడియాపై దురుసుగా ప్రవర్తించిన ఎస్వీ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌పై కూడా విద్యార్థి సంఘాలు,విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎస్వీ యూనివర్సిటీ లేడీస్ హాస్టల్‌లో ఆహార నాణ్యత సమస్యలు కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థి సంఘాలు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి. విద్యార్థినుల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత విశ్వవిద్యాలయ పరిపాలనదని, సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.


