
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వ పాలనలో సూపర్ సిక్స్.. అట్టర్‌ఫ్లాప్ సినిమా అని ఎద్దేవా చేశారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్. సూపర్ సిక్స్ అనే.. అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు బలవంతపు విజయోత్సవాలు జరుపుతున్నారు. అనంతపూర్‌లో ఇవాళ ఇదే చెప్పచోతున్నారు అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అబద్ధాలు, మోసాలు ఒక స్థాయిలోనే ఉంటాయి. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పే వ్యక్తి చంద్రబాబు అని సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు.
సూపర్ సిక్స్ అట్టర్ ప్లాప్ అని ప్రజలకు అర్ధమైంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన అడ్వర్‌టైజ్‌మెంట్.. ఇది ఏ లెవల్ మోసమో.. వాళ్ల అనుకూల మీడియాలో వచ్చిన అడ్వైర్‌టైజ్‌మెంట్లను చూడండి. 50 ఏళ్ల వాళ్లకు పెన్షన్ తీసేశారు. ఆడబిడ్డ నిధి ఎగిరిపోయింది. మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి.. కనిపించడం లేదు. క్యాంటీన్లను ఇప్పుడు కొత్తగా సూపర్‌సిక్స్‌లో చేర్చారు. ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీలతో పాటు అదనంగా ఇస్తానని చంద్రబాబు వాగ్దానం చేశారు.
సూపర్ సిక్స్‌కు పొంతనేది..
ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్‌కు ఈరోజు సూపర్ సిక్స్ పొంతన లేదు. ఇప్పుడు ఇచ్చేది కాకుండా రైతులకు అదనంగా రూ.20వేలు ఇస్తామన్నారు. తల్లికి వందనం కింద ఆంక్షలు లేకుండా ప్రతీ బిడ్డకు రూ.15వేలు ఇస్తామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఏ ఊరికి పోవాలన్నా ఉచితం అని చెప్పారు. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. గతేడాది ఎన్ని ఇచ్చారు. ఇప్పటి వరకు ఎన్ని ఇచ్చారు. ఆడబిడ్డ ధి పేరుతో నెలకు రూ.1500 ఇస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్లలో ప్రతీ మహిళకు 36వేలు ఇచ్చారా?.

నిరుద్యోగ భృతి కింద రెండేళ్లలో ఒక్కో నిరుద్యోగికి రూ.72వేలు బాకీ పడ్డారు. 50 ఏళ్లు దాటిన మహిళలకు గతేడాది 48వేలు, ఈ ఏడాది 48 వేలు పెన్షన్లకు ఎగనామం పెట్టారు. మేము దిగిపోయే నాటికి 66,34,742 మంది పెన్షన్‌దారులు ఉన్నారు. ఇప్పుడు 61,91,864 మంది పెన్షన్‌దారులు ఉన్నారు. ఇది మోసం కాదా? చంద్రబాబు అని అడుగుతున్నాను. పీఎం కిసాన్ కాకుండా అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.20వేలు ఇస్తామన్నారు. గతేడాది, ఈ ఏడాది కలిపి రైతులకు రూ.40వేలు బాకీపడ్డారు. తల్లికివందనం కింద 15వేలు ఇస్తామన్నారు. రూ.8వేలు, 9వేలు, 13వేలు ఇచ్చిన మాట వాస్తవం కాదా?.

ఉచితం పేరిట..
ఇసుక దోపిడీ నడుస్తోంది. లిక్కర్ మాఫియా నడుస్తోంది. అమరావతి పేరిట మాపియా జరుగుతోంది. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గుతోంది. చంద్రబాబు, ఆయన మాఫియాకు ఆదాయం పెరుగుతోంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తోంది. ప్రజల జీవితాలు తగలబడుతుంటే.. రోమన్ చక్రవర్తి నీరోలా చంద్రబాబు ఫిడేల్ వాయిస్తున్నారు. సూపర్‌సిక్స్ పేరిట బలవంతపు సంబురాలు చేయిస్తున్నాడు. రాష్ట్ర చరిత్రలో కనివినీ ఎరుగని అధ్యయం ఇది. చంద్రబాబు హయాంలో అప్పులు ఎగబాకాయి అని చెప్పుకొచ్చారు.
