
‘‘ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రజల కంచాల్లోని కూడు లాగేశారు.. ప్రతి ఇంటికీ బాబు మోసం" ఇది వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శ. ఈ వార్త ప్రజలకు అందిన రోజే మరో సమాచారం వచ్చింది. జీఎస్టీ ఆదాయం వసూళ్లు దేశమంతటా పైపైకి వెళుతుంటే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం నేల చూపులు చూస్తున్నట్లు ఆ కథనం చెప్పింది. జగన్ వ్యాఖ్యలకు, జీఎస్టీకి ఏమి సంబంధం? అంటే.. జగన్ ప్రభుత్వం ప్రజలకు వివిధ స్కీముల కింద ఆర్థిక సాయం చేసేది. లబ్దిదారుడికి నేరుగా నగదు అందేలా ఆ పథకాలుండేవి.
ఆ డబ్బుతో ప్రజలు ముఖ్యంగా పేదలు, దిగువ మధ్య తరగతి వారు వస్తు, సేవల కొనుగోళ్లు చేసేవారు. ఫలితంగా వ్యాపార కార్యకలాపాలు సాగి ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో ఆదాయం సమకూరేది. అందువల్లే ఆ రోజుల్లో ఒకవైపు పేదరికం తగ్గినట్లు గణాంకాలు తెలిపాయి. ఇప్పుడు పరిస్థితి మారింది. వ్యాపారాలు సరిగా సాగడం లేదని వ్యాపారస్తులు వాపోతున్నారు. ఇల్లు గడవడమే కష్టమవుతోందని పేదలు గగ్గోలు పెడుతున్నారు. ఫలితంగా దేశం అంతటా 12 శాతం వరకు జీఎస్టీ వృద్దిరేటు ఉంటే, ఏపీలో మాత్రం ఏప్రిల్ లో మైనస్ 3.4 శాతంగా మాత్రమే ఉంది. అందువల్లే జగన్ ఈ వ్యాఖ్య చేశారు.
పేదల తింటున్న కడును కూటమి పెద్దలు లాగేశారని ఆయన అన్నారు. నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు ఎన్నికల ప్రచారంలో ఆకాశమే హద్దుగా వాగ్దానాలు చేశారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నిటిని కొనసాగించడమే కాకుండా, సూపర్ సిక్స్ హామీలను కూడా ప్రజలకు అందిస్తామని పదే, పదే ప్రకటించారు. ఈ సూపర్ సిక్స్‌ను తొలుత మహానాడులో ప్రకటించినప్పుడు తమ్ముళ్లూ అదిరిందా? అంటూ చంద్రబాబు ప్రశ్నించే వారు. అందుకు వారంతా ఔను, ఔనని చప్పట్లు కొట్టారు. జనం కూడా ఆశపడ్డారు. తీరా అధికారం వచ్చాక టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు నాలుక మడత వేయడం ఆరంభించారు. అదిరిపోవడం జనం వంతైంది.
ఇదేమి ఖర్మ.. పాలిచ్చే గేదెను వదలుకుని తన్నే దున్నపోతు ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామా అని ప్రజలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ తాను పలావు పెడుతుంటే, చంద్రబాబు బిర్యానీ పెడతానని ప్రచారం చేశారని, అది నమ్మి జనం ఓట్లు వేశాక, పలావు, బిర్యానీ రెండూ లేకుండా పోయాయని పలుమార్లు వ్యాఖ్యానించారు. చంద్రబాబు సీఎం కాకముందు ప్రతి ఇంటిలో నాలుగువేళ్లు ఆనందంగా నోట్లోకి వెళ్లేవని, కూటమి వచ్చి కంచం లాగేసిందని కొద్ది రోజుల క్రితం పార్టీ సమావవేశంలో ధ్వజమెత్తారు. ఇందులో చాలా వరకు వాస్తవం ఉంది.
జగన్ అమ్మ ఒడి స్కీమ్ కింద రూ.15 వేలు ఇస్తే వారికి ఆర్ధిక వెసులుబాటు వచ్చేది. చేయూత, ఆసరా, విద్యా దీవెన, రైతు భరోసా, వాహన మిత్ర తదితర స్కీముల కింద వచ్చే డబ్బు వేడినీళ్లకు చన్నీళ్ల మాదిరి ఉపయోగపడేవి. ఇప్పుడు అవేవీ రాలేదు. చంద్రబాబు తాను ప్రతి బిడ్డకు రూ.15 వేలు చొప్పున ఎందరు పిల్లలు ఉంటే అందరికి తల్లికి వందనం పేరుతో ఇస్తానని నమ్మబలికారు. రైతులకు రూ.20 వేలు, నిరుద్యోగులకు నెలకు రూ.మూడు వేలు లారీ డ్రైవర్లకు రూ.15 వేలు.. ఇలా ఎడాపెడా వాగ్దానాలు చేశారు. కాని అధికారంలోకి వచ్చాక ఒక ఏడాది పూర్తిగా ఎగవేశారు. దాంతో జనం కూడా జగన్ చెప్పినట్లు చంద్రబాబు తమ నోటికాడ కూటిని తమ నోటికాడ కూటిని లాగేశారని అనుకుంటున్నారు.
జగన్ కాని, వైసీపీ నేతలు కాని చేస్తున్న ఈ విమర్శలను కూటమి పెద్దలు ఎవరూ ఖండించలేకపోతున్నారు. కాకపోతే జగన్ పాలనలో రాష్ట్రం ఆర్థిక విధ్వంసం జరిగిందని ఏవో పడికట్టు పదాలతో పిచ్చి ఆరోపణలు చేసి ప్రజలను డైవర్ట్ చేయడానికి యత్నిస్తుంటారు. ఈ విషయంలో కూడా వారిలో ఒక స్పష్టత, కనిపించదు. జగన్ ప్రభుత్వం రూ. ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిందని ఒకసారి, రూ.పది లక్షల కోట్లు అని మరోసారి, రూ.13 లక్షల కోట్లు అని వేరొకసారి, అది రూ.14 లక్షల కోట్లు అని ఇంకోసారి చంద్రబాబు, పవన్ లు చెప్పిన వీడియోలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి.
కూటమి ప్రభుత్వం వచ్చాక పెట్టిన బడ్జెట్‌లో మాత్రం అప్పు అంతా కలిపి రూ.ఆరు లక్షల కోట్టేనని తేలింది. అందులో సగం 2014 టర్మ్‌లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు కూడా ఉంది. 2024లో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు అప్పులు చేయరు కాబోలు.. కొత్తగా సంపద సృష్టిస్తారేమోలే అనుకున్న వారందరికి మతిపోయేలా చేశారు. ఏకంగా రికార్డు స్థాయిలో అన్నీ కలిపి రూ.లక్షన్నర కోట్ల అప్పు చేశారు. స్కీములు అమలు చేయకుండా, పెద్దగా అభివృద్ది పనులు చేపట్టకుండా ఈ అప్పు ఏమి చేశారన్నది మిస్టరీ. దానిపై ప్రభుత్వం ఇంతవరకు వివరణ పత్రం ఇవ్వలేదు. దాంతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసం చేసిన సర్కార్‌గా గుర్తింపు పొందుతోంది.
ఇంత అప్పు చేసి కూడా చంద్రబాబు తరచు తమకు అప్పులు పుట్టడం లేదని, సంపద సృష్టించడం ఎలాగో చెవిలో చెప్పండని కామెంట్లు చేస్తుంటే ప్రజలు నిశ్చేష్టులవుతున్నారు. తన పార్టీ సమావేశంలో జగన్ మాట్లాడుతూ ఎపిలో ప్రతి ఇంటిని బాబు మోసం చేశారని అన్నారు.అది కూడా నిజమే అనుకోవాలి. జగన్ టైమ్ లో ఏదో రకంగా 87 శాతం కుటుంబాలకు ఆర్థిక సాయం అందేది. ప్రస్తుతం పెరిగిన పెన్షన్ వెయ్యి రూపాయలు తప్ప మరేమీ అందడం లేదు. ప్రజలకు సూపర్ సిక్స్ అందకపోగా, రాక్షస రాజ్యం నడుపుతున్నారని, ప్రశ్నించేవారిపై కేసులు పెడుతున్నారని, తమకు బలం లేకపోయినా మున్సిపాల్టీ, మండల పరిషత్‌లను దౌర్జన్యంగా కైవసం చేసుకుంటున్నారని జగన్ అన్నారు. ఇందులో కూడా వాస్తవం ఉంది.
సీఎం తన సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాల్టీలో టీడీపీకి బలం లేకపోయినా, భయపెట్టో, ప్రలోభపెట్టో తమ ఖాతాలో వేసుకున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి వెనుపోటే. కొన్నిచోట్ల మాత్రం వైసీపీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు ధైర్యంగా అధికార కూటమి అరాచకాలను అడ్డుకున్నారు. అలాంటి వారితో జగన్ ప్రత్యేకంగా సమావేశమై వారిని అభినందించారు. జీఎస్టీ వసూళ్ల గురించి వచ్చిన డేటా విశ్లేషిస్తే, కూటమి సర్కార్ వచ్చిన ఈ పదినెలల్లో రెండు నెలలు తప్ప, మిగిలిన అన్ని నెలలు మైనస్ గ్రోత్ రేట్ నమోదైనట్లు స్పష్టమవుతోంది. ఇది ఏపీకి మంచి పరిణామం కాదు.
గత ఏప్రిల్‌లో తమిళనాడులో 13 శాతం, తెలంగాణలో 12 శాతం, కర్ణాటకలో 11 శాతం, కేరళలో ఐదు శాతం, చివరికి ఒడిశాలో కూడా ఐదు శాతం వృద్ది రేటు చూపితే ఆంధ్ర ప్రదేశ్ మాత్రం మైనస్ 3.4 శాతంగానే ఉంది. అయినా దీన్ని కనిపించకుండా చేసేందుకు ఎల్లో మీడియా పాట్లు పడింది. కొద్ది రోజుల క్రితం జీఎస్డీపీలో నెంబర్ 2 వచ్చేశామంట ఒక అంకెను ప్రచారం చేశారు. ఆ తర్వాత కేంద్రం విడుదల చేసిన ఈ జీఎస్టీ లెక్కలతో ఏపీ ప్రభుత్వం చెప్పేవి బూటకపు లెక్కలని తేటతెల్లమవుతోంది!
- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.