సారూ.. మా ఊరు పేరు మార్చండి | Dongala Dharmaram People Request to Change Village Name | Sakshi
Sakshi News home page

సారూ.. మా ఊరు పేరు చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది..!

May 19 2025 12:09 PM | Updated on May 19 2025 6:09 PM

Dongala Dharmaram People Request to Change Village Name

ప్రభుత్వ రికార్డుల నుంచి

దొంగల ధర్మారం పేరును తొలగించండి

పేరు చెప్పుకోవాలంటేనే బాధగా ఉంది 

ధర్మారం పేరుగా మార్చాలంటూ గ్రామస్తుల విన్నపాలు

హుస్నాబాద్‌(సిద్దిపేట): కొన్ని ఊర్ల పేర్లు వింటేనే వినసొంపుగా ఉంటాయి. ఊరు పేరు చెప్పగానే అక్కడి ప్రజల జీవన విధానం, కట్టుబాట్లు, ఆచారాలు ఇట్టే తెలిసిపోతాయి. అయితే ఈ గ్రామం పేరు చెప్పగానే చెప్పుకోలేని బాధగా ఉంటోంది. ఆ గ్రామమే అక్కన్నపేట మండలం దొంగల ధర్మారం. గ్రామానికి సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులన్నీ దొంగల ధర్మారం పేరిటనే జారీ అవుతున్నాయి. ఏదైన శుభకార్యాలకు వెళ్లినప్పుడు మీది ఏ ఊరు అని అడిగితే ఊరు చెప్పుకునేందుకు అవమానకరంగా ఉంటోందని స్థానికులు వాపోతున్నారు. పాలకులు గ్రామం పేరు మార్చేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోతున్నారు.   

కరవు కాటకాలతో.. 
అదొక మారుమూల గ్రామం. ఒకప్పుడు కరువుకు నిలయంగా ఉండేది. రవాణా సౌకర్యం ఉండేది కాదు. సైకిళ్లు, ఎండ్లబండ్లు వెళ్లేందుకు కనీసం రహదారులు లేని దుస్థితి. పేదరికంలో జీవనం గడిపేవారు. సౌడు భూముల్లో వ్యవసాయం చేయలేక రైతులు ఆకలితో అలమటించే వారు. తినటానికి తిండి లేక కుటుంబాలు చిన్నాభిన్నం అయిన పరిస్థితి. కరువు కాటకాలు ఇక్కడి ప్రజలను మానసికంగా కుంగదీశాయి. వేరే మార్గం లేక తిండి కోసం ఇక్కడి ప్రజలు పరిసర గ్రామాల్లో చిన్న చిన్న దొంగతనాలు చేయడం మొదలు పెట్టారు. ఇలా ఆ ఊరుకు దొంగల ధర్మారం పేరు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. ఆ రోజుల్లో ఎక్కడ దొంగతనాలు జరిగినా దొంగల ధర్మారం గ్రామం వారే చేసినట్లుగా నానుడి ప్రచారంలో ఉంది.

ప్రభుత్వానికి వినతులు
గతంలో గ్రామ సర్పంచ్‌ సర్పంచ్‌ మాశెట్టి కనకమ్మ, ఎంపీటీసీ మాలోతు నాను నాయక్‌లు  ప్రభుత్వ రికార్డుల నుంచి దొంగల ధర్మారం పేరును తొలగించాలని  తీర్మానం చేశారు.  రికార్డుల్లో ధర్మారం పేరు ఉండేలా చర్యలు తీసుకోవాలని అప్పటి పెద్దపెల్లి ఎంపీ సుగుణ కుమారి, అప్పటి  ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు, అధికారులకు మొరపెట్టుకున్నారు. అయినా నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.  

పేరు మార్చి గౌరవం కల్పించండి 
మా ఊరు పేరును గౌరవంగా చెప్పుకునేలా ధర్మారంగా మార్చాలి. మేము ఎక్కడికి వెళ్లినా గ్రామం పేరు చెప్పాలంటే ఇబ్బంది పడుతున్నాం. రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ దొంగల ధర్మారం గానే ఉంది. మంత్రి పొన్నం ప్రభాకర్‌ చొరవ తీసుకొని గ్రామం పేరును మార్చాలి. 
– మాలోతు బీలు నాయక్, మాజీ జెడ్పీటీసీ, అక్కన్నపేట  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement