
సాక్షి, న్యూఢిల్లీ: మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు(Nambala Keshava Rao) బుధవారం ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. నంబాల మృతిని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ వివరాలను ఆయన తెలియజేశారు.
నారాయణపూర్‌లో ఇప్పటిదాకా జరిగిన ఎన్‌కౌంటర్‌లో 27 మంది మృతి చెందారు. ఇందులో సీపీఐ మావోయిస్ట్ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు కూడా ఉన్నారు. నక్సల్స్ ఉదమ్యానికి నంబాల వెన్నెముకగా నిలిచారు. నక్సలిజాన్ని అంతమొందించడంలో ఇది కీలక ముందడుగు. ముప్పై ఏళ్ల పోరాటంలో ఇంత పెద్ద నాయకుడ్ని మట్టుబెట్టడం ఇదే తొలిసారి’’ అని ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారాయన. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ తర్వాత 54 మందిని అరెస్ట్ చేశాం. మరో 84 మంది లొంగిపోయారు. 2026 ఏడాది మార్చి చివరికల్లా నక్సలిజాన్ని అంతమొందదిస్తాం’’ అని షా ఎక్స్ వేదికగా ప్రకటించారు.

నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు అలియాస్ గంగన్నగా ఆయన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. 2010లో ఛత్తీస్‌గఢ్‌లో 76 మంది జవాన్ల మృతి ఘటనకు ఈయన ప్రధాన సూత్రధారి. కేంద్ర కమిటీ సభ్యుడైన నంబాలపై కోటిన్నర రివార్డు ఉంది.
కాల్పులు ఇలా..
నారాయణపూర్‌లోని అబూజ్మడ్ అడవుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కీలక సమావేశం ఏర్పాటు చేశారన్న సమాచారంతో భద్రత బలగాలు కూంబింగ్ చేపట్టాయి. దంతెవాడ, బీజాపూర్ జిల్లాలకు చెందిన డీఆర్‌జీ జవాన్లు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో.. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి.
ఇంజనీరింగ్ చదివి..
నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు స్వస్థలం ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా. ఆయన తండ్రి ఉపాధ్యాయుడు. నంబాల వరంగల్(తెలంగాణ) ఆర్‌ఈసీలో ఇంజినీరింగ్ చదివారు. 1984లో ఎంటెక్ చదువుతూ పీపుల్స్ వార్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడు అయ్యారు. 2018లో గణపతి రాజీనామాతో మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బసవరాజు కొనసాగుతూ వచ్చారు.