
ఏపీలోని విద్యాసంస్థల్లో నాన్‌లోకల్ కోటా 15శాతం సీట్ల భర్తీపై గందరగోళం
రాజ్యాంగ సవరణ చేయకుండా నాన్ లోకల్ కోటా మార్పు చెల్లదంటున్న నిపుణులు
కూటమి ప్రభుత్వం మాత్రం జీవోలతో కోటాలో మార్పులు
కేవలం ఉన్నత విద్యలోని 8 రకాల ప్రవేశ పరీక్షలకు నాన్‌లోకల్ కోటా నిర్ధారణ
వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ, ఆరోగ్య విశ్వవిద్యాలయాల పరిధిలో తేల్చని స్థానికత
విశాఖలోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలోనూ సీట్ల భర్తీపై సందిగ్ధత?
ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో విద్యార్థులకు తీవ్ర అన్యాయం.. ప్రవేశాల్లోనూ జాప్యం
కూటమి ప్రభుత్వం రాజ్యాంగ మౌలిక సూత్రాలను బేఖాతరు చేస్తూ ఇష్టారీతిన నిబంధనలు సవరిస్తోంది. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం, రాజ్యాంగంలోని అంశాలను సైతం జీవోలతో మార్చేస్తోంది. విద్యార్థుల భవిష్యత్‌ను గందరగోళంలోకి నెట్టివేస్తోంది. ఇటీవల ఉన్నత విద్యలోని 8 సెట్ల ద్వారా భర్తీ చేసే వృత్తివిద్య, డిగ్రీ, ఇంజనీరింగ్ వంటి కోర్సుల్లో ఇప్పటి వరకు అమలవుతున్న 15శాతం అన్ రిజర్వ్‌డ్ (నాన్ లోకల్), జనరల్ కోటా సీట్ల విషయంలో స్థానికతను సవరిస్తూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక నుంచి నాన్‌లోకల్ కోటా ఉండదని, 100శాతం సీట్లు మన రాష్ట్ర విద్యార్థులకే కేటాయిస్తామని వెల్లడించింది. దీంతో రాష్ట్రపతి ఉత్తర్వుల(ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్)ను సాధారణ జీవోలతో ఎలా సవరిస్తారన్న ప్రశ్న వినిపిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో తెలంగాణ నుంచి ఎవరైనా న్యాయ స్థానాలను ఆశ్రయిస్తే ఇక్కడ 15 శాతం నాన్ లోకల్ కోటా సీట్లు ఇవ్వాల్సిందేనని విద్యావేత్తలు చెబుతున్నారు. -సాక్షి, అమరావతి
కూటమి ప్రభుత్వ కాలయాపన..
భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికన ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 371డీ ప్రకారం ప్రత్యేక నిబంధనలను పొందుపరిచారు. కోస్తా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల ప్రజల హక్కులను కాపాడటానికి, ముఖ్యంగా ఉపాధి, విద్యలో సమాన అవకాశాలు కల్పించడానికి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా విద్యాసంస్థల్లో 85 శాతం సీట్లు లోకల్, 15శాతం సీట్లు అన్‌రిజర్వ్‌డ్(నాన్‌లోకల్) విద్యార్థులతో భర్తీ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఉస్మానియా, ఆంధ్ర(ఏయూ), శ్రీ వెంకటేశ్వర(ఎస్వీయూ) రీజియన్ల వారీగా స్థానికతను ప్రామాణికంగా తీసుకుని సీట్లు భర్తీ చేసేవారు.
ఉస్మానియా పరిధిలో నాన్ లోకల్ కింద 15శాతం ఏయూ, ఎస్వీయూ విద్యార్థులకు, ఏయూ, ఎస్వీయూ పరిధిలో 15శాతం తెలంగాణ విద్యార్థులకు సీట్లు కేటాయించేవారు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రపతి ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా దీనిని పదేళ్లు పొడిగించారు. గతేడాది జూన్ 2వ తేదీతో పదేళ్ల గడువు ముగిసింది. తెలంగాణ ప్రభుత్వం నాన్‌లోకల్ 15శాతం సీట్లను ఇకపై ఏపీ విద్యార్థులకు కేటాయించేది లేదని ఇప్పటికే స్పష్టం చేసింది.గత జూన్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాదిపాటు ఐఏఎస్ అధికారుల కమిటీ పేరుతో కాలయాపన చేసింది.
తీరా ప్రవేశాలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఇప్పుడు చట్టం ముందు నిలవలేని జీవోలు ఇచ్చి చేతులు దులిపేసుకుంది. పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పదేళ్లు గడువు ముగియడంతో అందులోని అంశాలన్నీ ఆటోమెటిక్‌గా సీజ్ అవుతాయని ప్రభుత్వ అధికారులు వాదిస్తున్నారు. కానీ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 371డీలో సవరణ చేయకుండా స్థానికత మార్పునకు చట్టంలో ఎటువంటి విలువ ఉండదని విద్యావేత్తలు చెబుతున్నారు. రాజ్యాంగ సవరణతోనే స్థానికతకు రక్షణ ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.
కొన్ని కోర్సులకేనా స్థానికత..
కూటమి ప్రభుత్వం స్థానికత అంశం ఉన్నత విద్యకు, అందులోనూ కొన్ని కోర్సులకే పరిమితం చేస్తున్నట్టు కనిపిస్తోంది. 2025–26 విద్యా సంవత్సరంలో కేవలం సంప్రదాయ, సాంకేతిక వర్సిటీల్లో వృత్తి విద్య, డిగ్రీ, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి మాత్రమే నాన్‌లోకల్ కోటాను మార్పు చేస్తూ జీవోలు ఇచ్చింది. మిగిలిన ఆరోగ్య, వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ, మత్స్య యూనివర్సిటీలతో పాటు ప్రత్యేక విశ్వవిద్యాలయాలుగా రూపాంతరం చెందిన పద్మావతి, ద్రవిడియన్, ఆర్కిటెక్చర్, కస్లర్, ఉర్దూ, ఆర్జీయూకేటీ, వేదిక్ వంటి వాటిల్లో ప్రవేశాలకు నాన్‌లోకల్ కోటాను ఎలా సర్దుబాటు చేస్తారనేది వెల్లడించలేదు.
దీంతో ఆయా వర్సిటీల అధికారులు అడ్మిషన్ల నిర్వహణకు తలలు పట్టుకుంటున్నారు. వీటితోపాటు విశాఖలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో నాన్‌లోకల్ కోటా నిర్ణయించకుండా ప్రవేశాలు చేపట్టడం అసాధ్యమని నిపుణులు చెబతున్నారు. ఫలితంగా ఈ విద్యా సంవత్సరంలో అనేక కోర్సుల్లో ప్రవేశాలు జాప్యమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.