
ఇప్పడంతా ఆన్‌లైన్ పుణ్యామా అని డోర్‌డెలివరీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆహారం, షాపింగ్, కిరాణ సరుకులు వరకు అన్ని ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ పెట్టుకోవడం..నేరుగా ఇంటికే డెలివరీ అవ్వడం టకటక జరిగిపోతోంది. చెప్పాంలటే..పెద్దపెద్ద బడా కంపెనీలన్నీ ఇంటివద్దకే వచ్చి సేవలందించే బాటలోకి వచ్చేశాయి. ఆ కోవలోకి టైలరింగ్ వంటి సేవలు కూడా వస్తే..ఇక పని మరింత సులవు కదూ..!. అలాంటి వినూత్న ఆలోచనకు కార్యరూపం ఇచ్చి..హాయిగా జీవనం సాగిస్తూ..అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు ఆంద్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లాకు చెందిన 58 ఏళ్ల దర్జీ ఎస్.కె. కలీషా. అతడికి ఈ ఆలోచన ఎలా వచ్చింది..?. ఈ ఆలోచనతో పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యాడా అంటే..
ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెనమలూరు మండలం వణుకూరు గ్రామంలో నివాసం ఉండే ఎస్.కె. కలీషా తొలుత గ్రామంలో ఓ దుకాణాన్ని అద్దెకు తీసుకుని టైలరింగ్ చేసేవారు. దశాబ్ద కాలం వరకూ కుటుంబ పోషణకు ఏ మాత్రం ఇబ్బంది పడేవారు కాదు. ఇద్దరు పిల్లలతో హాయిగా జీవించారు. అలాగే అక్కడ గ్రామస్థులు కూడా కాలేషా దుకాణం వద్దకు వచ్చి బట్టలు కుట్టించుకునేవారు.
అయితే కాలం మారి రెడీమేడ్ ట్రెండ్ కావడం, యువత ఆ దుస్తులకే ప్రాధాన్యం ఇవ్వడంతో కలిషాకి బతుకుదెరువు భారంగా మారింది. ఇలా లాభం లేదనుకుని ఎలాగైనా తనకు తెలిసిన ఈ వృత్తి ద్వారానే అధిక ఆధాయం ఆర్జించాలని స్ట్రాంగ్‌గా డిసైడయ్యారు కలిషా. అలా పుట్టుకొచ్చింది ఇంటివద్దకే టైలరింగ్ సేవలందించాలనే ఆలోచన.
ఎందుకంటే ప్రస్తుతం పలు రకాల సేవలూ ఇంటి వద్దకే వస్తున్నాయి. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండటం తోపాటు కొన్ని సంస్థలు ఈ తరహాలో లాభాలను ఆర్జిస్తున్న విధానాన్ని తెలుసుకుని ఆ పంథాలోకే తన వృత్తిని పట్టాలెక్కించారు కలీషా. ఇక తాను కూడా ఇంటి వద్దకే సేవలందించి ఆదాయాన్ని మరింతగా పెంచుకోవాలనుకున్నారు.
అందుకు నాలుగు చక్రాల వాహనం అవసరమవుతుంది. కానీ అదికొనే స్థోమత లేకపోవడంతో ఓ రిక్షాను కొని దానికి కుట్టుమిషన్‌ను అనుసంధానించారు. ఎక్కడికైనా తీసుకుని వెళ్లేందుకు అనుగుణంగా మార్పులు చేశారు. తొలుత తన గ్రామంలోని కాలనీల్లో తిరిగి ఇంటివద్దకే వెళ్లి పాత, చిరిగిన బట్టలు కుట్టడం ప్రారంభించారు. దీంతో అతని ఆదాయం కూడా పెరిగింది, కుటుంబ పోషణ కూడా హాయిగా సాగిపోయింది.
అయితే రానురాను ఆ రిక్షా తొక్కుకుంటూ వెళ్లడం కష్టమైపోవడంతో..కుటుంబ సన్నిహితులు, స్నేహితుల సాయంతో టీవీఎస్ కస్టమ్ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసి, దానికి మొబైల్ టైలరింగ్ దుకాణంగా సవరించి సేవలందించడం ప్రారంభించానని చెప్పుకొచ్చారు. పెనమలూరు మండలంలో రోజుకో గ్రామం చొప్పున తిరుగుతూ ఉపాధి పొందుతున్నట్లు తెలిపారు. అవసరం ఉన్న వాళ్లు నేరుగా కాలేషాకు ఫోన్ చేసి మరీ పిలింపించుకుని బట్టలు కుట్టించుకుంటారట.
అలా రోజుకు నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు సంపాదిస్తున్నట్లు తెలిపారు. ఈ మొబైల్ టైలరింగ్ వల్ల అప్పులు బాధలు ఉండవని, ఆదాయం నేరుగా జేబులోకి వస్తోందని అంటున్నారు షేక్ కాలేషా. ప్రస్తుతం ఆయన పెనమలూరు, పోరంకి, వనకూరు ప్రాంతాల వరకే తన టైలరింగ్ సేవలు పరిమితం చేశానని అన్నారు. ఎందుకంటే ఈ వయసులో ఈ ప్రాంతాలను దాటి వెళ్లడం తనకు కష్టంగా ఉందని చెప్పుకొచ్చారు. చివరగా ఆయన.. ఎవ్వరూ కూడా తాము చేపట్టిన వృత్తిని ఆదరించడం లేదని ఆందోళన చెందకూడదని, వినూత్నంగా ఆలోచించి సేవలందిస్తే.. సత్ఫలితాలు వస్తాయని యువతకు చక్కటి సందేశాన్ని ఇచ్చారు కలేషా.
అదే బాటలో మరో జంట..
తిరువనంతపురంకు చెందిన అనిష్ ఉన్నికృష్ణన్ గాయత్రి కృష్ణ దంపతులు తమ "సీవ్ ఆన్ వీల్జ్" అనే వెంచర్‌తో మొబైల్ టైలరింగ్ సేవలందిస్తున్నారు. ఆ దంపతులు దీన్ని టెంపో ట్రావెలర్ సాయంతో నిర్వహిస్తున్నారు. వాళ్లు పెళ్లికూతురు దుస్తుల నుంచి అల్టరేషన్ వరకు అన్ని రకాల సేవలందిస్తారు. సాధారణంగా టైలర్లు ఆల్టరేషన్ పనులు చేపట్టడానికి ఇష్టపడరు , అయితే ఈ దంపతులు ఆల్టరేషన్ పనే ప్రధానంగా.. సేవలందించి కస్టమర్ల మన్ననలను అందుకుంటున్నారు.
ఇదంతా చూస్తుంటే ముందు ముందు..ఇంటి వద్ద టైలరింగ్ సేవలు పొందొచ్చన్నమాట. అటు వారికి ఆదాయం, మనకు సమయం ఆదా అవ్వడమేగాక, నచ్చిన విధానంగా కుట్టించుకునే వెసులబాటు దొరుకుతుందన్న మాట. అంతేగాదు పరిస్థితులు సవాలుగా మారినప్పుడూ.. అవకాశాలను దొరకబుచ్చుకోవటం అంటే ఈ కలీషా, ఉన్ని కృష్ణన్ దంపతుల సక్సెస్‌ని చూస్తుంటో తెలుస్తోంది కదూ..!.
(చదవండి: ఆధ్యాత్మికత నుంచి.. ఏకంగా కంపెనీ సీఈవోగా ప్రస్థానం..)