ఎన్నికల కమిషన్‌ ఆదేశాలన్నా లెక్క లేదా? | High Court slams Andhra Pradesh Police | Sakshi
Sakshi News home page

ఎన్నికల కమిషన్‌ ఆదేశాలన్నా లెక్క లేదా?

May 21 2025 5:28 AM | Updated on May 21 2025 5:28 AM

High Court slams Andhra Pradesh Police

అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది?

పోలీసులపై మండిపడిన హైకోర్టు

ఏపీ పోలీసుల సమర్థత ఏమిటో మాకు బాగా తెలుసు

వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

పౌరుల రక్షణ బాధ్యత పోలీసులదే.. తప్పించుకోజాలరు

పరిధి దాటి వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం

డీజీపీ నుంచి కానిస్టేబుల్‌ వరకు ఎవరినీ విడిచిపెట్టం

తిరువూరు వైఎస్సార్‌సీపీ వార్డు సభ్యులకు భద్రత కల్పించండి

విజయవాడ పోలీస్‌ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశం

తమకు నివేదిక సమర్పించాలని స్పష్టీకరణ

విచారణ ఈ నెల 29కి వాయిదా

వైఎస్సార్‌సీపీ వార్డు సభ్యులకు భద్రత కల్పించాలన్న ఆదేశాలను పట్టించుకోరా?

ఎవరినీ వదలం.. పౌరుల రక్షణ పోలీసుల బాధ్యత. దీనినుంచి వారు తప్పిం­చుకోలేరు. సంక్షేమ రాజ్యంలో పోలీసుల బాధ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ వ్యవహారంలో పోలీసులు పరిధి దాటి వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. డీజీపీ నుంచి కానిస్టేబుల్‌ వరకు ఎవరినీ విడిచిపెట్టం.- హైకోర్టు ఆగ్రహం

సాక్షి, అమరావతి: రాష్ట్ర పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్రంగా మండిపడింది. ‘ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశాలన్నా లెక్క లేదా..? వాటిని కూడా అమలు చేయరా? ఎన్నికలో పాల్గొనే వైఎస్సార్‌సీపీ వార్డు సభ్యులకు తగిన భద్రత కల్పించాలని ఆదేశించినా పట్టించుకోరా? అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాలను అమలు చేయకపోవడంలో ఔచి­త్యం ఏమిటని నిలదీసింది. 

పోలీసుల సమర్థత ము­ఖ్యంగా ఏపీ పోలీసుల సమర్థత గురించి తమకు బాగా తెలుసునని వ్యాఖ్యానించింది. వారు ఎంత సమర్థులో అందరికీ తెలుసని.. వారి గురించి ప్రత్యేకంగా తమకు చెప్పాల్సిన అవసరం లేదంది.  ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు నగర పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు వీలుగా హైకోర్టును ఆశ్రయించిన ఇద్దరితో పాటు 11 మంది కౌన్సిలర్లకు తగిన భద్రత కల్పించాలని విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ను ఆదేశించింది. 

కౌన్సిలర్లు ఉన్న ప్రదేశం నుంచి పోలింగ్‌ కేంద్రం వరకు వారికి భద్రత కల్పించాలని సూచించింది. తమ ఆదేశాల అమలు విషయమై నివేదిక సమర్పించాలని కమిషనర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్‌ జస్టిస్‌ యడవల్లి లక్ష్మణరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

భద్రత కోసం కోర్టుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ వార్డు సభ్యులు
తిరువూరు నగర పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే వారందరికీ తగిన భద్ర­త కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ వార్డు సభ్యులు మోదుగు ప్రసాద్, గుమ్మా వెంకటేశ్వరి హైకోర్టులో సోమవారం అత్యవసరంగా హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై  జస్టిస్‌ లక్ష్మణరావు మంగళవారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది పాపుడిప్పు శశిధర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. తిరువూరులో చైర్మన్‌ ఎన్నిక ఈ నెల 19న ఎన్నిక జరగాల్సి ఉందన్నారు. 

కౌన్సిలర్లు ఓటు వేసేందుకు వెళ్తుండగా, అధికార టీడీపీ నేతలు అడ్డుకున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. చైర్మన్‌గా పోటీ చేస్తున్న వ్యక్తిని సీఐ, డీఎస్పీ తీసుకెళ్లడంతో ఎన్నిక మంగళవారానికి వాయిదా పడిందన్నారు. వార్డు సభ్యులకు భద్రత కల్పించేలా చూడాలంటూ తాము ఎన్నికల కమిషన్‌కు వినతిపత్రం ఇచ్చామన్నారు. శాంతిభద్రతల సమస్యతో వార్డు సభ్యులు వారి నివాసాల్లో ఉండలేని పరిస్థితి వచ్చిందని.. చాలామంది హోటళ్లలో తలదాచుకుంటున్నారని చెప్పారు. తమ వార్డు సభ్యులు ఎక్కడ ఉన్నారో చెప్పి వారికి భద్రత కల్పించాలని కోరామన్నారు. 

ఈ వినతిపత్రాన్ని ఎన్నికల సంఘం విజయవాడ పోలీస్‌ కమిషనర్, ఎన్నికల అధికారి, కలెక్టర్, డీజీపీ తదితరులందరికీ పంపిందని శశిధర్‌రెడ్డి తెలిపారు. వైఎస్సార్‌సీపీ వార్డు సభ్యులకు భ­ద్రత కల్పించాలని ఆదేశించిందన్నారు. కానీ, వీటి­ని పోలీసులు అమలు చేయలేదని.. వార్డు సభ్యులు ఇళ్లకు తిరిగి వస్తేనే భద్రత కల్పిస్తామని సీఐ, డీఎస్పీ చెబుతున్నారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది (హోం) అడుసుమల్లి జయంతిని న్యాయమూర్తి వివరణ కోరారు. భద్రత కోసం ఎన్నికల సంఘానికి వినతిపత్రం ఇస్తే సరిపోదని, పోలీసులకు కూడా ఇవ్వాలని ఆమె తెలిపారు. 

పోలీసులకు ఎందుకు వినతిపత్రం ఇవ్వలేదని శశిధర్‌రెడ్డిని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీ చేసే వార్డు సభ్యుడిని తిరువూరు సీఐ తీసుకెళ్లారని, అందుకే ఆయనకు వినతిపత్రం ఇవ్వలేదని శశిధర్‌ సమాధానం ఇచ్చారు. ‘‘సీఐ పేరు ఏమిటి?’’ అని న్యాయమూర్తి ప్రశ్నించగా, సీఐ గిరిబాబు, డీఎస్పీ ప్రసాదరావు అని శశిధర్‌ తెలిపారు. ఈ సమయంలో న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. ఇరుపక్షాలు కోర్టులతో ఆడుకోవద్దని స్పష్టం చేశారు. పోలీసులు తప్పు చేస్తే కోర్టు ధిక్కారం కింద తీవ్రంగా శిక్షిస్తామని, వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. న్యాయస్థానాల్లో షోలు చేయవద్దని హితవు పలికారు.

వార్డు సభ్యులు ఎక్కడున్నారో స్పష్టంగా చెప్పాం
ఈ సమయంలో శశిధర్‌రెడ్డి స్పందిస్తూ, తాము అవాస్తవాలు చెప్పడం లేదన్నారు. వైఎస్సార్‌సీపీ వార్డు సభ్యులు ఎక్కడ ఉన్నారో ఎన్నికల సంఘానికి ఇచ్చిన వినతిపత్రంలో స్పష్టంగా చెప్పామని, వాటిని పరిగణనలోకి తీసుకుని హోటల్‌లో ఉన్న కౌన్సిలర్లు, ఇంటి వద్ద ఉన్న వార్డు  సభ్యులకు పోలింగ్‌ కేంద్రం వరకు భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించిందని తెలిపారు. (ఈసీ ఆదేశాలను చదివి వినిపించారు).

పోలీసులకు తెలియదంటేమేం నమ్మాలా?
వైఎస్సార్‌సీపీ వార్డు సభ్యులు ఎక్కడ ఉన్నారో పోలీసులకు తెలియదని జయంతి చె­ప్పారు. దీనిపై న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మాట ఓ సామాన్యుడు చెబితే నమ్ముతామని, తమకు తెలియదని పోలీసులు చెబితే ఎలాగని ప్రశ్నించారు. పోలీసులు తెలియదంటే నమ్మేస్తామని అనుకుంటున్నారా? అంటూ నిలదీశారు. వైఎస్సార్‌సీపీ వార్డు సభ్యులు ఎక్కడ ఉంటే అక్కడినుంచి పోలింగ్‌ కేంద్రం వరకు భద్రత కల్పించాలని ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు సరిపోవా? అంటూ ప్రశ్నించారు.

భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించాంఎన్నికల సంఘం తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ, వైఎస్సార్‌సీపీ వినతిపత్రాన్ని పోలీసు కమిషనర్, ఎన్నికల అధికారి, కలెక్టర్, డీజీపీ తదితరులందరికీ పంపి భద్రతపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి... ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా వైఎస్సార్‌సీపీ వార్డు సభ్యులు ఎక్కడ ఉంటే అక్కడినుంచి పోలింగ్‌ కేంద్రం వరకు వారికి భద్రత కల్పించాలని విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ సమయంలో పోలీసులు ఏవైనా అక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement