
వైఎస్ జగన్‌కు వరి కంకులను బహూకరించిన రైతు మెర్ల సత్యనారాయణ
మాజీ సీఎం జగన్‌తో కోనసీమ రైతు మెర్ల సత్యనారాయణ
రైతులంతా ఆందోళనలు చేసినా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన
అన్నదాతకు వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా
రైతుల తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హామీ
సాక్షి, అమరావతి: ‘మీ పాలనలో రైతులందరికీ మేలు జరిగిందయ్యా. మీ హయాంలో రైతుల కష్టాలు తెలుసుకుని అన్నదాతకు అండగా నిలిచి.. మద్దతు ధర కల్పించి ధాన్యం కొనుగోలు చేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు ఎలాంటి సాయం అందకపోగా ఆరుగాలం కష్టించి పండించిన పంటను కొనుగోలు చేయడం లేదు. రైతులు రోడ్డెక్కి నిరసనలు, ఆందోళనలు చేయాల్సి వస్తోంది. అయినా పట్టించుకోవడం లేదయ్యా’ అని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పొడగట్లపల్లికి చెందిన రైతు మెర్ల సత్యనారాయణ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఎదుట వాపోయారు.
మంగళవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రైతు మెర్ల సత్యనారాయణ మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. కూటమి ప్రభుత్వం నుంచి ఎలాంటి చేయూత లేకపోయినా తమ ప్రాంత రైతులు ఎకరాకు 55–60 బస్తాల ధాన్యం పండించారని ఆ రైతు వివరించారు. ధాన్యం కొనుగోళ్లు నిలిపివేయడంతో రైతులంతా నిరసనలు, ఆందోళనలు చేసినా ప్రభుత్వంలో చలనం లేదని వాపోయారు.
ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో ఇటీవల కురుస్తున్న వర్షాలకు కళ్లాల్లోనే ధాన్యం తడిసిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. దీనికి వైఎస్ జగన్ బదులిస్తూ.. అన్నదాతకు వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతుల తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ హామీతో రైతు సత్యనారాయణ సంతోషంతో తాను పండించిన వరి కంకులను ఆయనకు బహూకరించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ను మాజీ మంత్రి కురసాల కన్నబాబు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, రామచంద్రాపురం వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి పిల్లి సూర్యప్రకాష్ కలిశారు.