
న్యూఢిల్లీ: పాకిస్తాన్ (Pakistan) ఐఎస్‌ఐ (isi)కు దేశానికి చెందిన రహస్య సమాచారాన్ని చేరవేశారనే ఆరోపణలతో అరెస్టయిన జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra) కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత వారం కేంద్ర దర్యాప్తు సంస్థలు జ్యోతి మల్హోత్రాను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నాయి. వీరి విచారణలో జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ ఐఏస్‌ఐ ఏజెంట్ అలీ హసన్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు తేలింది.
అంతేకాదు వీరి ఇద్దరి మధ్య ఎమోషనల్‌గా జరిగిన వాట్సప్ చాటింగ్‌ను గుర్తించారు. ఆ చాటింగ్‌లో ఐఏస్‌ఐ ఏజెంట్ అలీ హసన్ తనని పాకిస్తాన్‌లో పెళ్లి చేసుకోవాలని (Get Me Married) జ్యోతి మల్హోత్రా కోరినట్లు తెలిపారు. ఆ చాట్‌లో భారత సైన్యానికి సంబంధించిన సమాచారం సైతం జ్యోతి షేర్ చేసిందని,కొన్ని సంభాషణలు కోడ్ రూపంలో ఉండగా, అవి గూఢచారి కార్యకలాపాలకు సంబంధించివే అని నిర్ధారించారు.
దుబాయ్ నుంచి డబ్బులు
వాట్సప్ చాట్‌తో పాటు జ్యోతి మల్హోత్రా ఆర్దిక లావాదేవీలపై కన్నేశారు. ఆమెకు నాలుగు బ్యాంక్ అకౌంట్లు ఉండగా..అందులో ఒక అకౌంట్‌కు దుబాయ్ నుండి డబ్బులు వచ్చాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆ ఖాతాలన్నింటినీ అధికారులు పరిశీలిస్తున్నారు.
పోలీసుల అదుపులో పలువురు
భారత్-పాకిస్తాన్‌ల మధ్య యుద్ధవాతావరణం పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత భద్రత వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. జ్యోతి మల్హోత్రా అరెస్టుతో భారత్‌కు చెందిన సైనిక రహస్యాల్ని పాక్‌కు చేరవేస్తున్నారనే ఆరోపణలతో దేశానికి చెందిన 10మందిని భద్రతా సంస్థలు అదుపులోకి తీసుకున్నాయి.వీరు ప్రధానంగా హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారిని తేలింది.