72nd Miss World 2025 - Latest News, Updates, Contestants & Winners
Sakshi News home page

Miss World 2025

న్యూస్ Update

Top secrets to follow for weight loss journey1
ఎంత కష్టపడినా వెయిట్‌ తగ్గడం లేదా? ఇవిగో టాప్‌ సీక్రెట్స్‌!

బరువు తగ్గాలంటే తిండిమానేస్తే సరిపోదు? ఫ్యాడ్ డైట్‌,ఉపవాసం అంటూ కడుపుమాడ్చుకుంటే సరిపోదు. ఇంట్లో పని అంతా చేస్తున్నాంగా.. ఏదో కొద్దిగా వాకింగ్‌ చేస్తున్నాంగా అంటే సరిపోదు. ఊపికి సలపని పనులు అసలు టైమే దొరకడం లేదు.. ఇంకెక్కడి ఎక్స్‌ర్‌సైజులు అంటూ నిట్టూరిస్తూ సరిపోదు.. మరి అధిక బరువును తగ్గించుకోవాలంటే ఏం చేయాలి. పదండి..కొన్ని ముఖ్యమైన చిట్కాలతో సహా, ఇంట్రస్టింగ్‌ సీక్రెట్స్‌ తెలుసుకుందాం.ముందు అసలు బరువు ఎందుకు తగ్గాలి దీనిపై అవగాహన ఉంది. మనశరీరం, మన ఆరోగ్యం, దాన్ని ఎలాగైనా కాపాడుకోవాలి? ఫిట్‌గా ఉండాలనే సంకల్పం ఉండాలి. ఎంత బరువు అధికంగా ఉన్నాం, ఎంత తగ్గాలి మన బీఎంస్‌మాస్‌ ఇండెక్స్‌ ఎంత అనే లెక్కలు గమనించుకోవాలి. చివరిగా తగ్గాల్సిన బరువు, సమయం దీనికి సంబంధించి ఒక నిర్దిష్ట ప్లాన్‌ చేసుకోవాలి. ఇది నిపుణుల ద్వారాగానీ, వ్యక్తిగత అవగాహన ద్వారా గానీ చేసుకోవచ్చు.బరువు తగ్గడానికి కారణమైన అలవాట్లను మార్చుకోవాలనే బలమైన కోరిక ఉందాలేదా అనేది నిర్ధారించు కోవాలి. నా శారీరక శ్రమ ,వ్యాయామ అలవాట్లను మార్చడానికి సిద్ధంగా ఉన్నానా? అనేది ప్రశ్నించుకుని, నిర్ణయించుకుని ముందుకు సాగాలి.ఇదీ చదవండి: ఐకానిక్‌ ఆటో: ప్రముఖ ఫ్యాషన్‌ బ్రాండ్‌ లగ్జరీ హ్యాండ్‌ బ్యాగ్‌, ధర తెలిస్తే.!అలాగే ఏదో మంత్రం వేసినట్టు బరువు తగ్గడం అనేది ఎట్టిపరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. మన బరువును బట్టి ఎంత సమయంలో ఎంత బరువు తగ్గవచ్చు అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఓపిగ్గా దీర్ఘకాలం పాటు బరువు తగ్గాలనే నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. దీన్ని యాక్షన్ గోల్, రిజల్ట్ గోల్ అనే రెండు రకాలు డివైడ్‌ చేసుకోవాలి.ప్రతిరోజూ 30 నిమిషాలు నడవాలి ఇది యాక్షన్ గోల్. 4.5 కిలోగ్రాముల తగ్గాలి అనేది రిజల్ట్‌ గోల్‌.టాప్‌ టిప్స్‌జీవనశైలిలో మార్పులు చేసుకోవడం. తీసుకునే ఆహారంపై దృష్టిపెట్టడం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ప్రతీ రోజూ నడకతోపాటు, యోగా, ఏరోబిక్‌ ఎక్సర్‌సైజ్‌ చేయవచ్చు. అవసరమైతే జిమ్‌ ట్రైనర్‌ శిక్షణలో కొన్ని కఠినమైన వ్యాయామాలు కూడా చేయాలి.లోకాలరీ ఫుడ్‌, హై ప్రొటీన్డ్‌, సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి.ఒత్తిడిని నియంత్రించుకోవడానికి అవసరమైతే ఆరోగ్య సంరక్షణ నిపుణుడితో మాట్లాడండి. ఒత్తిడిని తగ్గించడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్యకరమైన జీవనశైలిలో మార్పులు చేసుకోవచ్చు. రోజుకు కనీసం 4 లీటర్ల నీళ్లు. చక్కని నిద్ర చాలా అవసరం.దీర్ఘకాలంలో వారానికి 0.5 -1 కిలోగ్రాము) తగ్గాలని లక్ష్యంగా పెట్టుకోండి. దీని ప్రకారం ప్రతి రోజు తీసుకునే కేలరీలతో పోలిస్తే 500 - 750 కేలరీలు ఎక్కువగా బర్న్ చేయాలి.ఎక్కువగా పండ్లు, కూరగాయలు,తృణధాన్యాలు తినాలి. కేలరీలు తక్కువ, ఫైబర్ అధికంగా ఉండేలా కడుపు నిండా తినవచ్చు. ఆకలితో ఉండాల్సిన అవసరం లేదు.రోజుకు కనీసం నాలుగు సార్లు కూరగాయలు,మూడు సార్లు పండ్లు తినండి. భోజనాల మధ్య మీకు ఆకలిగా అనిపిస్తే పండ్లు ,కూరగాయల సలాడ్‌ తినవచ్చు. (ట్రంప్ పెర్‌ఫ్యూమ్స్‌ : ‘విక్టరీ 45-47’ లాంచ్‌.. సీక్రెట్‌ ఏంటంటే..!)బ్రౌన్ రైస్, బార్లీ , హోల్-వీట్ బ్రెడ్ , మిల్లెట్స్‌తో చేసిన ఆహారం, ఇంకా ఆలివ్ ఆయిల్, వెజిటబుల్ ఆయిల్స్, అవకాడో, నట్స్, నట్స్ బటర్స్ , నట్స్ ఆయిల్స్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులను తీసుకోవాలి.చక్కెర పదార్థాలకు పూర్తిగా నో చెప్పాలి. ఫాస్ట్‌ ఫుడ్‌, కూల్‌ డ్రింక్స్‌ను అసలే ముట్టు కోవద్దు. ప్రతి ఆహారం ముద్దను ఆస్వాదిస్తూ, రుచిని ఎంజాయ్‌ చేస్తూ చక్కగా నమిలి మింగండి. అంతే తప్ప హడావిడిగా అస్సలు ఆహారం తీసుకోకూడదు. మరీ ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు టీవీని ఫోన్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.ఇదీ చదవండి: Today tip : ఒళ్లంత తుళ్లింత.. ఈ టిప్స్‌ తప్పవు మరి!నోట్‌ : నాలుగు రోజులు చేసి ఫలితం రాలేదని నిరాశ పడకూడదు. పట్టుదలగా బరువు తగ్గిన వారిని చూసి ఇన్‌ స్పైర్‌ అవ్వాలి. బరువు తగ్గడం వలన అందం మాత్రమే ఆత్మవిశ్వాసమూ పెరుగుతుంది. అనేక రకాల, ముఖ్యంగా లైఫ్‌ స్టైల్‌ డిజార్స్‌ నుంచి బయటపడవచ్చు. కీళ్ల నొప్పులు,గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ రాకుండా జాగ్రత్తపడవచ్చు. అయితే వెయిట్‌ లాస్‌ జర్నీని ప్రారంభించే ముందు, వైద్యుడిని సంప్రదించి అంతర్లీనంగా ఏవైనా సమస్యలున్నాయా? అనేది తనిఖీ చేసుకొని తగిన సలహాలు, సూచనలు తీసుకోవడం మాత్రం తప్పనిసరి.

Telugu beauties at Miss Universe2
మిస్‌ యూనివర్స్‌లో.. తెలుగు అందాలు

మరో ప్రతిష్టాత్మక గ్లోబల్‌ ఫ్యాషన్‌ ఈవెంట్‌కు రెండు తెలుగు రాష్ట్రాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ సారి నిర్వహించనున్న మిస్‌ యూనివర్స్‌ పోటీలకు సంబంధించి మిస్‌ ఇండియా ఎంపికకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా ప్రతి రాష్ట్రం నుంచి మిస్‌ యూనివర్స్‌ స్టేట్‌గా ఎంపిక చేసి, మిస్‌ యూనివర్స్‌ ఇండియా పోటీకి పంపిస్తారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి మిస్‌ యూనివర్స్‌ తెలంగాణగా కశ్వి, మిస్‌ యూనివర్స్‌ ఆంధ్రప్రదేశ్‌గా ప్రకృతి ఎంపిక అయ్యారు. హైదరాబాద్‌ అజీజ్‌ నగర్‌లోని ధారా రిసార్ట్‌లో నిర్వహించిన మిస్‌ యూనివర్స్‌ గ్రాండ్‌ ఫినాలేలో ఈ అందాల ముద్దుగుమ్మలను ఎంపిక చేశారు. – సాక్షి, సిటీ బ్యూరోమిస్‌ యూనివర్స్‌ ఎంపికలో భాగంగా నిర్వహించిన గ్రాండ్‌ ఫినాలే కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి 30 మంది పోటీదారులు పాల్గొని ర్యాంప్‌ వాక్‌ చేసి అహూతులను అలరించారు. డిజైనర్‌ చారు పరాశర్, గత ఏడాది మిస్‌ యూనివర్స్‌ రన్నర్‌ అప్‌ రూపూజనే విసో, మిస్‌ ఇండియా యూనివర్స్‌ ఫ్రాంచైజ్‌ హెడ్‌ అంజద్‌ ఈ షోకి జడ్జిలుగా వ్యవహరించారు. ఈ గ్రాండ్‌ ఫినాలేలో తెలంగాణ రన్నరప్‌లుగా సృష్టి, రితిక నిలువగా.. సలోని, తనుశ్రీ ఆంధ్రప్రదేశ్‌ పేజెంట్‌ రన్నరప్‌లుగా నిలిచారు. ఈ ఫ్యాషన్‌ ఈవెంట్‌కు సినీ, రాజకీయ ప్రముఖులు, పలువురు వ్యాపారవేత్తలు హాజరయ్యారు. వనరుల వల్లే.. హైదరాబాద్‌లో ఉన్న వనరులు సమయానుకూలంగా ఉన్నందుకే ఈ షోను కేవలం రోజుల వ్యవధిలో సూపర్‌ సక్సెస్‌ చేయగలిగామని తెలంగాణ ఎడిషన్‌ డైరెక్టర్‌ ప్రసాద్‌ గారపాటి తెలిపారు. రేస్‌లో తెలుగు అమ్మాయిలు.. మిస్‌ వరల్డ్‌ పోటీల తర్వాత అతి తక్కువ సమయం ఉన్నప్పటికీ కూడా మిస్‌ యూనివర్స్‌ పేజెంట్‌కి హైదరాబాద్‌ నగరం అన్ని విధాలుగా సహకరించిందని ఈవెంట్‌ నిర్వాహకురాలు, ఆంధ్రప్రదేశ్‌ ఎడిషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సునీత తెలిపారు. చాలా తక్కువ సమయమే ఉన్నా.. పోటీదారులు అందరూ చాలా శ్రమించి అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలను చూపారని కొనియాడారు. వారం రోజుల పాటు జరిగిన ఫ్యాషన్, టాలెంట్, డ్రెస్సింగ్‌ వంటి విభిన్న రౌండ్స్‌లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 30 మంది పాల్గొని తమ నైపుణ్యాలను గ్లామర్‌ ఇమేజ్‌ను అద్భుతంగా ప్రదర్శించారని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే తెలుగు అమ్మాయిలు మోడలింగ్‌లో రాణిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి పేజెంట్‌లో తమ సత్తా చాటుతున్నారు. ఈసారి మిస్‌ యూనివర్స్‌ ఇండియా ఎంపికలో తెలుగు మోడల్స్‌ టాప్‌లో ఉన్నారు. ఈ గ్లోబల్‌ పేజెంట్‌కు పోటీనిచ్చేలా మన అమ్మాయిలకు ప్రత్యేక శిక్షణ అందించాం. ఇందులో భాగంగా విదేశాల్లో మోడట్స్‌కు ట్రైనింగ్‌ ఇచ్చే ప్రముఖ బ్యూటీ పేజెంట్స్‌ ట్రైనర్, కొరియోగ్రాఫర్‌ ఆంటోనీ గుంజ్వాలెస్‌తో శిక్షణ అందించాం.విజేతగా నిలవడమే లక్ష్యం.. మిస్‌ యూనివర్స్‌ ఇండియాతో పాటు, మిస్‌ యూనివర్స్‌లోనూ విజేతగా నిలవడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. వారం రోజుల పాటు జరిగిన రౌండ్స్‌ మరింత అవగాహన కల్పించాయి. – కశ్వి, మిస్‌ యూనివర్స్‌ తెలంగాణమన గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేస్తాం.. ఈసారి మిస్‌ యూనివర్స్‌లో తెలుగు అమ్మాయిల సౌందర్యాన్ని, విజ్ఞానాన్ని ప్రపంచానికి తెలియజేస్తాం. ఈ గ్లోబల్‌ పేజెంట్‌కు తగినట్టుగా అన్ని అంశాల్లో శిక్షణ తీసుకున్నాను. నా చిరకాల కోరికకు కొద్ది దూరంలో ఉన్నాను. తెలుగు ప్రజలందరికీ ధన్యవాదాలు. – ప్రకృతి, మిస్‌ యూనివర్స్‌ ఆంధ్రప్రదేశ్‌

Poland Second Runner-Up Maja Klajda interview3
అందమైన అనుభవాలు.. అద్భుతమైన జ్ఞాపకాలు

2024లో మిస్‌ పోలోనియా కిరీటాన్ని గెలుచుకున్న మాజా క్లాజ్డా ఈ ఏడాది మిస్‌ వరల్డ్‌ ఫైనల్‌లో సెకండ్‌ రన్నరప్‌గా నిలిచింది. అందం, తెలివితేటలు, సమతుల్యతతో న్యాయనిర్ణేతలను, ప్రేక్షకులను ఆకర్షించింది. ఆమె బ్యూటీ విత్‌ ఎ పర్పస్‌ చొరవ, నేటి అత్యంత ముఖ్యమైన సమస్యలలో ఒకటైన పిల్లలు, యుక్తవయస్కుల మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. మానసిక అనారోగ్య నివారణ, భావోద్వేగ సంఘర్షణలపై దృష్టి సారించి, 40 కి పైగా వర్క్‌షాప్‌లను నిర్వహించింది. మానసిక శ్రేయస్సు గురించి యువత తమను తాము, తమతో ఉన్న వారిని ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి ఈ వర్క్‌షాపులు ఉపకరిస్తున్నాయి. మనస్తత్వశాస్త్ర విద్యార్థిగా, మాజా టీనేజర్లతో వారి స్వంత భాషలో కనెక్ట్‌ అవుతుంది. సామాజిక బహిష్కరణ ప్రమాదంలో ఉన్న పిల్లలకు మద్దతు ఇచ్చే గ్రోయింగ్‌ అప్‌ జోన్‌ ఫౌండేషన్ కు చెందిన 12 ఏళ్ల బాలుడి కలను మాజా ఇటీవల నెరవేర్చింది. ఆమె అతన్ని బార్సిలోనాలో జరిగే లైవ్‌ మ్యాచ్‌కు హాజరు కావడానికి బార్సిలోనాకు తీసుకువెళ్లింది. అతని జీవితకాల కోరికను నెరవేర్చింది.సంతృప్తికరమైన అనుభవాలునేను పొందిన గొప్ప విజయాల్లో ఒకటి చిన్నచూపును అధిగమించడం. మొదట్లో న లుగురితో కలవాలంటే చాలా సిగ్గుపడేదాన్ని. దానిని దాటి ఈ దశకు వచ్చాను. ప్రజలతో కలిసి పోవడం, వారితో మాట్లాడుతూ ఉండటం అంటే నాకు ఇష్టం. కిరీటం దక్కక పోయినా అంతకు మించిన అనుభవాలు నాకు అద్భుతమైన జ్ఞాపకాన్ని ఇచ్చాయి. ఇక్కడి ఆతిథ్యం నాకు మా ఇంటిని గుర్తు చేసింది. ఇది నా రెండో కుటుంబంలా అనిపించింది. మెడికల్‌ టూరిజంలో భాగంగా ఏఐజీ హాస్పిటల్‌కి వెళ్లినప్పుడు వారి ఆ΄్యాయత నన్ను ఆకట్టుకుంది. వారు ఎంతో బాధలో ఉండి కూడా చిరునవ్వుతో మాకు ఆహ్వానం పలికారు. ముచ్చటించారు. అది నా జీవితంలో మరచి పోలేను. ఇక్కడ ప్రతి ఒకరికి మరొకరితో ఉన్న కనెక్టివిటీ, రిలేషన్స్ చాలా బాగున్నాయి’’ అంటూ తెలంగాణలో మిస్‌ వరల్డ్‌ పాజెంట్‌ జరిగిన తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది మాజా క్లాజ్డా– నిర్మలారెడ్డి

Miss World 2025 1st Runner-Up Hassett Dereje Interview 4
సమానత్వం..  సాధికారత సాధిస్తా!

హాసెట్‌ డెరెజె అడ్మస్సు రెండవ స్థానంలో నిలిచి మిస్‌ వరల్డ్‌ చరిత్రలో అత్యున్నత ర్యాంకింగ్‌ సాధించింది. ఇథియోపియా దేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన ఈ అందాలభామ, ఫస్ట్‌ రన్నర్‌–అప్‌గా , మిస్‌ వరల్డ్‌ ఆఫ్రికా టైటిల్‌ను గెలుచుకున్నారు. కెమికల్‌ ఇంజినీరింగ్‌ చేస్తున్న పంతొమ్మిదేళ్ల హాసెట్‌ దక్షిణాఫ్రికాలో జరిగిన మిస్‌ టీన్‌ ఇథియోపియా, కిందటేడాది మిస్‌ వరల్డ్‌ ఇథియోపియా పోటీలో విజేతగా నిలిచారు. ఇథియోపియాలోని మహిళల విద్య, ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా ఆమె సమాజంలో సానుకూల మార్పులు తీసుకు రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రామీణ సమాజాలలో తల్లీబిడ్డల ఆరోగ్యం, బాలికల విద్యపై దృష్టి సారించిన ఆమె ‘‘బ్యూటీ విత్‌ ఎ పర్పస్‌’’ ప్రాజెక్ట్‌ న్యాయమూర్తులను, ప్రేక్షకులను ఆకట్టుకుంది.నా పనే నా కిరీటంకిరీటం మరొకరికి వెళ్లచ్చు. కానీ, నా అంతర్గత అందం నేను చేసే పనిపైనే ఉంటుంది. అదే నాకు కిరీటం. స్థానికంగా, అంతర్జాతీయంగా ఆరోగ్య సమానత్వం, లింగ సాధికారత కోసం ఒక గొంతుకగా పనిచేస్తాను. ఈ పోటీలలో పాల్గొనడం ద్వారా భారతీయ సంప్రదాయ, సాంస్కృతిక పరిమళాన్ని అర్థం చేసుకున్నాను. ఆస్వాదించాను. ఈ ఫీలింగ్‌ చాలా సంతోషంగా ఉంది. ఓ పా గురించి చె ప్పాలంటే తను చాలా హార్డ్‌ వర్కర్‌. నేను తనకు చాలా పెద్ద అభిమానిని. తనకు కిరీటం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. తనలో భిన్నమైన క్వాలిటీస్‌ ఉన్నాయి. నిజానికి అందం అంటే అందరూ అనుకుంటున్నట్టు చర్మం, జుట్టు, గోళ్లు, డ్రెస్సింగ్‌.. ఇవి కావు. మన చుట్టూ ఉన్న సమాజం కోసం పనిచేయడమే. మా పేరెంట్స్‌ నా ఎదుగుదల కోసం ఎంతో కృషి చేశారు. నా ఈ విజయానికి నా కుటుంబ మద్దతు ఎంతో ఉంది.మానసిక ఆరోగ్యంపై అవగాహన కోసం...ఇథియోపియాలో మానసిక ఆరోగ్యంపై ప్రజలలో అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నాను. మాయా చారిటబుల్‌ ఆర్గనైజేషన్‌ కు అంబాసిడర్‌గా ఉంటూ ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పిస్తున్నాను. మిస్‌ వరల్డ్‌ అనేది కేవలం అందానికి సంబంధించినది మాత్రమే కాదు. నా దేశం నుంచి ఈ స్థాయికి చేరిన తొలి ఇథియోపియన్‌ నేనే. మిస్‌ వరల్డ్‌ ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం, ఇది ప్రపంచవ్యాప్తంగా తల్లులు, వారి పిల్లల జీవితాలలోనూ స్ఫూర్తి నింపేది’’ అని చె ప్పారు.

Ensuring women have access to healthcare is my mission, says Opal Suchata Chuangsri5
Opal Suchata: 72 ఏళ్ళ కల ఇది..! ఆ కాంక్షతోనే గెలిచా..

ఓపల్‌ సుచాతా.. మోడల్, థాయ్‌లాండ్‌.. తొలి మిస్‌ వరల్డ్‌... ఇప్పుడు 72వ మిస్‌ వరల్డ్‌! థాయ్‌లాండ్‌కి చెందిన ఆమె కేన్సర్‌ ఫ్రీ ప్రపంచం కోసం పాటుపడుతోంది! దానికో కారణం ఉంది. పదహారవ ఏట ఆమెకు బ్రెస్ట్‌ ట్యూమర్‌ సర్జరీ అయింది. అది తన జీవనోద్దేశాన్ని, లక్ష్యాన్నే మార్చింది అంటున్న ఓపెల్‌ సుచాతా గురించి మరిన్ని విషయాలు ఆమె మాటల్లోనే..‘‘నేను పుట్టి పెరిగింది థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌లో. మా ఊరూ హైదరాబాద్‌లాగే పర్ల్‌ సిటీ! హైస్కూల్‌ కోసం బ్యాంకాక్‌కి మూవ్‌ అయ్యాను. సైకాలజీ, ఆంత్రోపాలజీ నాకు ఇష్టమైన సబ్జెక్ట్స్‌. ప్రస్తుతం నేను అంబాసిడర్‌ కావాలనే ధ్యేయంతో ఇంటర్నేషనల్‌ రిలేషన్స్ చదువుతున్నాను.. మా కుటుంబ విషయానికి వస్తే అమ్మ, పెద్దమ్మలు, అత్తలు .. అందరూ స్ట్రాంగ్‌ పర్సన్సే. ఒకరకంగా చెప్పాలంటే నేను స్ట్రాంగ్‌ విమెన్ మధ్యలో పెరిగాను. ఆ వాతావరణమే నాకు స్ఫూర్తి. ఆ స్ట్రెంతే నా పదహారవ ఏట బ్రెస్ట్‌లో డిటెక్ట్‌ అయిన ట్యూమర్‌తో ఫైట్‌ చేసేలా చేసింది. అది క్యాన్సర్‌ ట్యూమర్‌ కాదు. అయినా చాలా భయపడ్డాను. ఆ భయాన్నుంచి ఓ ఉద్దేశం కోసం ప్రయాణించేలా చేసింది నా చుట్టూ ఉన్న మహిళల స్ట్రెంతే! సర్జరీ తర్వాత ఈ హర్డిల్‌ని గనుక దాటగలిగితే నా జీవితాన్ని బ్రెస్ట్‌ క్యాన్సర్‌ అవేర్నెస్‌ కార్యక్రమాలకు అంకితం చేయాలనుకున్నాను. లక్కీగా దాటాను. దాంతో అనుకున్నట్టుగానే ‘ఓపల్‌ ఫర్‌ హర్‌’ప్రాజెక్ట్‌తో బ్రెస్ట్‌క్యాన్సర్‌ అవేర్‌నెస్‌ క్యాంపెయిన్ ను స్టార్ట్‌ చేశాను. మహిళా సాధికారతకూ పాటుపడుతున్నాను. ఈ బ్యూటీ పాజెంట్‌లో నేను పాల్గొనడానికి ప్రేరణ కూడా అదే. బ్యూటీ విత్‌ ఎ పర్పస్‌ అనే రౌండ్‌తో ఈ మిస్‌ వరల్డ్‌ బ్యూటీ పాజెంట్‌ మన కథను ప్రపంచానికి వినిపించే అవకాశాన్ని కల్పిస్తోంది. అందుకే ఈ పాజెంట్‌లో పాల్గొన్నాను. నా కథను షేర్‌ చేసుకుని, నాప్రాజెక్ట్‌ ద్వారా నేను చేస్తున్న కార్యక్రమాలను వివరించి బ్రెస్ట్‌ క్యాన్సర్‌ మీద మహిళలకే కాదు జెండర్స్‌కి అతీతంగా అందరికీ అవగాహన కల్పించాలనుకున్నాను.తోటి కంటెస్టంట్లందరి ఆలోచనలూ పంచుకుంటానుమిస్‌ వరల్డ్‌ హోదాలో నేను ప్రపంచమంతా పర్యటించగలిగే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ప్రపంచమంతటా నా ప్రాజెక్టుల గురించి చెప్పుకోగలను. అయితే నాకు నా తోటి కంటెస్టంట్లందరి ఆలోచనలూ,ప్రాజెక్టులూ కూడా చాలా నచ్చాయి. నాకు వీలున్నంతవరకు నేను అందరి ఆలోచనలూ,ప్రాజెక్టులనూ కూడా అన్ని వేదికలమీదా పంచుకుంటాను.క్రౌన్‌తో మా దేశానికి వెళుతున్నందుకు సంతోషంగా ఉందినా బ్యూటీ పాజెంట్‌ జర్నీ నా పద్దెనిమిదవ ఏట మొదలైంది. మొదటిసారి నేను గెలవలేదు. తర్వాత రెండేళ్లకు మళ్లీ నేషనల్‌ బ్యూటీ పాజెంట్‌లో పాల్గొన్నాను. గెలిచాను. మిస్‌ వరల్డ్‌కి ఎంపికయ్యాను. బ్యూటీ విత్‌ ఎ పర్పస్‌తో విన్ అయ్యి.. మిస్‌ వరల్డ్‌ క్రౌన్ తో మీ ముందుకు వచ్చాను. నిజానికి ఇది మా దేశం 72 ఏళ్లుగా కంటున్న కల. ఆ కల నా ద్వారా సాకారం అయినందుకు, నేను మిస్‌ వరల్డ్‌ క్రౌన్‌తో మా దేశానికి వెళ్లగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ పాజెంట్‌ నా లెర్నింగ్‌ అన్ లెర్నింగ్‌ప్రాసెస్‌కు ఓ వేదికైంది. భిన్నదేశాలు, విభిన్నమైన సంస్కృతి, సంప్రదాయాలకు చెందిన నా తోటి కంటెస్టెంట్స్‌ నుంచి చాలా నేర్చుకున్నాను. ఎక్సే్చంజ్‌ ఆఫ్‌ వ్యూస్, ఒపీనియన్స్, నాలెడ్జ్‌ షేరింగ్‌తో కొత్త విషయాలను తెలుసుకోగలిగాను. నా ఆలోచనా తీరూ మారింది. నా పర్సెప్షన్ బ్రాడ్‌ అయింది.అన్నీ అద్భుతంతెలంగాణ రావడం ఇదే మొదటిసారి. ఇక్కడి మహిళలు చాలా వైబ్రెంట్‌గా ఉన్నారు. వాళ్ల కట్టుబొట్టు తీరు, ఇక్కడి ఫుడ్, కల్చర్, ఆతిథ్యం అన్నీ అద్భుతం. నేను జ్యూయలరీ ఫ్యాన్ ని. అందుకే నాకు హైదరాబాద్‌ బాగా నచ్చింది. ముత్యాలే కాదు సంప్రదాయ, ఫ్యాషన్ జ్యుయలరీకి ఫ్యూజన్ లా ఉందీప్రాంతం. నేను చూసిన ఈ అద్భుతాన్ని మా వాళ్లకు చెప్పాలనుకుంటున్నాను. అంతేకాదు, ఇక్కడ నన్ను ఇన్ స్పైర్‌ చేసిన కథలు చాలా ఉన్నాయి. వాటినీ మావాళ్లకు షేర్‌ చేసుకోవాలనుకుంటున్నాను. మాటల కన్నా చేతలతోనే అవతలి వాళ్లకు ప్రేరణగా నిలవాలనుకుంటాను. మన పక్కనున్న వాళ్లకు ఓ భరోసాగా నిలవాలనుకుంటాను. నన్ను నేను అలా మలచుకోవడానికే ప్రయత్నిస్తాను’’ అని చెప్పింది ఈ మిస్‌ వరల్డ్‌.– సరస్వతి రమఫొటోలు: ఎస్‌.ఎస్‌. ఠాకూర్‌

Miss World 2025: Interesting Facts About 1999 Miss World Winner Yukta Mukhi6
Miss World 2025: ఆరడుగుల బ్యూటీ.. బెడ్‌రూమ్‌లో భర్త చేతిలో నరకం

అందాల సుందరి కిరీటం గెలుచుకోవడం గొప్ప గౌరవం. అంతకు మించి గొప్ప అవకాశాలకు మార్గం. అందులోనూ ప్రపంచ సుందరి కిరీటం అంటే... అంతకు మించి.. అయితే మిస్‌ వరల్డ్‌ కిరీటం దక్కగానే అన్నీ దక్కేసినట్టే అనేది అతి కొద్ది మందికి మాత్రమే సాధ్యం అనేది నిజం. అడ్డంకులెన్నో అధిగమించి.. అందాల రాణి అనే అంతర్జాతీయ కిరీటం అందుకున్నా... అత్తింట్లో అష్టకష్టాలు పడే సాదా సీదా అమ్మాయిలు కూడా ఉంటారు. అలాంటి మహిళే యక్తా ముఖి.ఆమె 1999లో మిస్‌ వరల్డ్‌గా భారతదేశానికి గౌరవం తీసుకువచ్చిన యుక్త ముఖి(Yukta Mukhi)... 5.11 అంటే షుమారు 6 అడుగుల హైట్‌తో కిరీటం దక్కించుకుందే కానీ అందలాలు అందుకోవడంలో మాత్రం విజయం సాధించలేకపోయింది. ఆ ఒక్క గెలుపు తప్ప ఆ తర్వాత ఏ రకమైన సంతృప్తినిచ్చే గమ్యాన్నీ ఆమె చేరుకోలేకపోయింది.మిస్‌ వరల్డ్‌గా టైటిల్‌ సాధించిన తర్వాత, ఎన్నో ఆశలతో, తన ముందున్న ఐశ్వర్య రాయ్‌ వంటివారి విజయాల స్ఫూర్తితో యుక్త ముఖీ వెండితెరపై అడుగుపెట్టింది. తొలిగా 2001లో పూవెల్లమ్‌ ఉన్‌ వాసమ్‌ అనే తమిళ చిత్రంలో ‘యుక్తాముఖి’ అనే పాటలో కనిపించే అతిధి పాత్రతో ఆమె సినీ ప్రయాణం ప్రారంభమైంది. అనంతరం 2002లో అఫ్తాబ్‌ శివ్‌దాసాని పక్కన ’ప్యాసా’ చిత్రంతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసినా.. ఆ సినిమా తీవ్ర నిరాశను మిగిల్చింది. ఆ తర్వాత మార్కెట్‌ అనే సినిమా షూటింగ్‌లో ఉండగా, గాయం వల్ల ఆ సినిమా నుంచి వైదొలగింది. అనంతరం కబ్‌ క్యోం కహా, హమ్‌ తీనోం..సినిమాలకు సంతకం చేసినా, అవి క్లాప్‌ కొట్టకుండానే అటకెక్కాయి. ఆ తర్వాత మరో రెండు ప్రాజెక్టులు కూడా అలాగే జరిగాయి. తర్వాత ’కట్పుత్లీ’, ’లవ్‌ ఇన్‌ జపాన్‌’, ’మెమ్సాహబ్‌’ వంటి చిత్రాల్లో నటించినా, అవి కూడా విజయవంతం కాలేదు. దాదాపు 9 ఏళ్ల తర్వాత 2019లో ’గుడ్‌ న్యూస్‌’ చిత్రంలో ఒక చిన్న పాత్రలో మాత్రమే ఆమె కనిపించింది. విచిత్రంగా వ్యక్తిగత జీవితం కూడా ఆమెకి విషాదాన్నే మిగిల్చింది. న్యూయార్క్‌కు చెందిన వ్యాపారవేత్త ప్రిన్స్‌ తులిని 2008లో యుక్త ముఖీ, వివాహం చేసుకుంది. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు అయితే, కొన్నేళ్ల పాటు భర్త చేతిలో అసహజ లైంగిక వాంఛలతో, చిత్రహింసలకు గురైన యుక్తా ముఖి 2013లో భర్త , అత్తింటి వారిపై సదరు సెక్షన్ల ప్రకారం క్రిమినల్‌ కేసు పెట్టింది. చివరికి 2014లో ఈ దంపతులు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. సినీ రంగం నుంచి దూరమైన తర్వాత, ప్రస్తుతం 48 ఏళ్ల వయసులో యుక్త ముఖీ సామాజిక సేవలో నిమగ్నమైంది. ఎయిడ్స్‌ బాధితులు, థలసీమియా, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ బాధితుల కోసం పనిచేస్తోంది. అలాగే అవయవదానాన్ని ప్రోత్సహిస్తూ, మరోవైపు బాలకార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. మురికివాడల్లోని బాలికలకు ఆరోగ్యం, శారీరక అవగాహన కల్పించే కార్యక్రమాల్లో పాల్గొంటోంది.

Miss world 2025: 72nd miss world beauty pageant ends successfully7
Miss World 2025: ఘనంగా ముగిసిన గ్రాండ్‌ ఫినాలే..

ప్రపంచ వేదికపై హైదరాబాద్‌ నగర ప్రశస్తి మరోసారి అత్యంత వైభవంగా మారుమోగింది. నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పోటీలు శనివారం ఘనంగా ముగిశాయి. 108 దేశాలకు చెందిన సుందరాంగులు పాల్గొన్న ఈ అందాల పోటీల్లో మిస్‌ థాయిలాండ్‌ ప్రపంచ సుందరిగా నిలిచింది. నగరంలోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌ వేదికగా ఏర్పాటు చేసిన భారీ వేదికపై కళ్లు చెదిరే హంగులతో లైటింగ్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ మిస్‌ వరల్డ్‌ గ్రాండ్‌ ఫినాలే నిర్వహించారు. ఈ వేదిక పై భారతీయ, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా నిర్వహించిన నృత్య కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. మిస్‌ వరల్డ్‌ గ్రాండ్‌ ఫినాలే పోడియంపై తెలుగు సెలబ్రిటీలు సందడి చేశారు. మిస్‌ వరల్డ్‌ కంటెస్టెంట్లు క్యాట్‌ వాక్‌ చేసే పోడియం ప్యానెల్లో టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ రానా దగ్గుబాటి, మరో సినీతార నమ్రత శిరోద్కర్‌ ఆశీనులయ్యారు. ఇదే వరుసలో ప్రముఖ ఫ్యాషన్‌ ఐకాన్, సామాజికవేత్త, మొట్టమొదటిసారిగా మిస్‌ వరల్డ్‌ బ్యూటీ విత్‌ పర్పస్‌ విభాగానికి గ్లోబల్‌ అంబాసిడర్‌గా ఎన్నికైన తెలుగు మహిళ సుధారెడ్డి ఉన్నారు. మెగా హంగామా.. ఈ పోటీలను వీక్షించడానికి మెగాస్టార్‌ చిరంజీవి తన భార్యతో కలిసి వచ్చారు. ఈ మెగా వేదికపై ప్రముఖ సెలబ్రిటీ ఇషాన్‌ కట్టర్‌ చేసిన డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్‌ విశేషంగా అలరించింది. ఇందులో భాగంగా తను ఆస్కార్‌ విన్నింగ్‌ పాట నాటు నాటు సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులేస్తుంటే.. చిరంజీవి సంతోషంగా చప్పట్లు కొట్టారు. స్టేజ్‌ పైన వదల బొమ్మాళీ డైలాగ్‌ చెప్పి ప్రేక్షకులను ఉత్సాహపరిచిన సోనూసూద్‌ తెలుగు సినిమాలతో తనకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తుచేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి కృతజ్ఞతలు తెలిపారు.ఆతిథ్యం అద్భుతం.. ఈ పోటీల నేపథ్యంలో తెలంగాణ అందించిన ఆతిథ్యం అద్భుతమని టాప్‌ 4లో నిలిచిన పోలండ్‌ కాంటెస్టెంట్‌ కొనియాడారు. ఇక్కడి మర్యాదలు ఆత్మీయత తనను కట్టిపడేశాయని.. భాగ్యనగరాన్ని తన రెండో ఇంటిగా అనుభూతి చెందానని సంతోషం వ్యక్తం చేశారు. ప్యానలిస్టుల్లో రానా, నమ్రత.. అంతే కాకుండా ఈ గ్రాండ్‌ ఫినాలేలో టాప్‌ 4 మార్టినిక్, ఇథియోఫియా, పోలెండ్, థాయిలాండ్‌ కాంటెస్టెంట్‌ లను చివరి ప్రశ్నలు అడిగిన నలుగురు ప్యానలిస్టుల్లో రానా, నమ్రత ఇద్దరూ తెలుగు వారే కావడం గమనార్హం. మరో రెండు ప్రశ్నలు అడిగిన ఇద్దరిలో సోనూ సూద్‌ కూడా హైదరాబాద్‌కు సుపరిచితుడే. ( చదవండి: ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా)

72nd Miss World beauty pageant ends successfully in telangana8
ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచస్థాయి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించగల సత్తా ఉందని తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి ఘనంగా చాటిచెప్పింది. 72వ మిస్‌ వరల్డ్‌ అందాల పోటీల నిర్వహణ అవకాశాన్ని అనూహ్యంగా దక్కించుకోవడమే కాకుండా అట్టహాసంగా నిర్వహించి యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. మే 2 నుంచి నిర్వాహకులు, పోటీదారులు నగరానికి చేరుకోవడం మొదలు శనివారం హైటెక్స్‌లో గ్రాండ్‌ ఫినాలే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా లోపాలు లేకుండా మిస్‌ వరల్డ్‌ సంస్థతో కలిసి పోటీలను సంయుక్తంగా నిర్వహించింది. పోటీల నిర్వహణలో ఆద్యంతం తెలంగాణ సాంస్కృతిక కళా వైభవం ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేసింది. పోటీల నిర్వహణకు రూ. 60 కోట్ల వరకు ఖర్చవగా ప్రపంచ సుందరీమణులు పర్యటించిన ప్రాంతాలతోపాటు నగరంలోని వివిధ ప్రాంతాల సుందరీకరణకు మరో రూ. 200 కోట్ల వరకు ఖర్చు చేసింది. పర్యాటకానికి ఊతం.. జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతంతో మిస్‌ వరల్డ్‌–2025 పోటీలు మే 10న గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఒక్కో స్థానిక సంప్రదాయ కళారూపాన్ని ప్రదర్శిస్తూ ఒక్కో ఖండానికి చెందిన పోటీదారులను పరిచయం చేయడం వీక్షకులను ఆకట్టుకుంది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు, జీవన విధానాన్ని తెలియజెప్పేందుకు పోటీదారులతో ఏర్పాటు చేసిన ప్రముఖ పర్యాటక ప్రాంతాల సందర్శన ప్రపంచ దేశాల సుందరీమణులకు ఎంతగానో నచ్చింది. పోటీల ఇతివృత్త నినాదమైన ‘తెలంగాణ జరూర్‌ ఆనా’ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. ఇవన్నీ తెలంగాణ పర్యాటకానికి ఊతమిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ముసిరిన వివాదం..మిస్‌ ఇంగ్లండ్‌ మిల్లా మాగీ మే 16న అందాల పోటీ నుంచి తప్పుకోవ డం వివాదానికి దారితీసింది. మిస్‌ వరల్డ్‌ నిర్వాహకులపై ఆమె తీవ్ర ఆరోపణలు గుప్పించడం సంచలనం రేపింది. ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన తెలంగాణ ప్రభుత్వం.. ము గ్గురు సీనియర్‌ మహిళా ఐపీఎస్‌లతో విచారణకు ఆదేశించింది. అయితే మి ల్లా మాగీ నిరాధార ఆరోపణలు చేసిందని మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ సీఈవో జూలియా మోర్లీ స్పష్టం చేశారు. పోటీ ల నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వం గొప్పగా సహకరించిందని.. తదుపరి పోటీలను కూడా అవకాశం లభిస్తే హై దరాబాద్‌లోనే నిర్వహించాలని ఉందని ఆమె పేర్కొనడం రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది.

Advertisement