
కొన్ని సంఘటనలు భలే గమ్మత్తుగా జరుగుతాయి. ఆఖరికి ప్రకృతి కూడా మనమంతా ఒక్కటే అని చెప్పేలా ఘటనలు సృష్టిస్తుంది. ఒక్క తొలకరి జల్లుతో ఎలా మతసామరస్యానికి పీట వేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ వరుణుడే సాక్షిగా..రెండు వేర్వేరు మతాలకు చెందిన జంటలను ఒక వేదికపైనే పెళ్లి చేసుకునేలా చేశాడు. ఈ ఘటన పూణేలోని వాన్వోరిలో చోటు చేసుకుంది.
అసలేం జరిగిందంటే..పూణేలోని వాన్వోరిలో మంగళవారం సాయంత్రం ఒక హాలులో ముస్లిం పెళ్లి జరుగుతుండగా.. అక్కడకు సమీపంలోని మైదానంలో హిందూ జంట పెళ్లితంతు జరుగుతోంది. ఇంతలో వర్షం పడటంతో వారి వివాహానికి ఆటంకం ఏర్పడింది. సరిగ్గా ఆ హిందూ జంట సాయంత్రం 6.56 గంటలకు అలంకారన్ లాన్స్‌లో వివాహం చేసుకోవలసి ఉంది.
ముహర్తం మించి పోతుంది వర్షం ఆగేట్టు లేదు. దాంతో ఒక్కసారిగా ఆ హిందూ వివాహ వేడుకలో గందరగోళం ఏర్పడింది. పక్కనే హాలులో వలీమా(ముస్లిం ఆచారంలో జరిగే పెళ్లి) జరగుతోంది. ఇక వాళ్లనే రిక్వస్ట్ చేసి సప్తపది నిర్వహించాలనుకున్నారు కుటుంబ సభ్యులు.
అందుకు ముస్లీం కుటుంబం కూడా అంగీకరించి..వాళ్లు ఖాళీ చేసి వేదికను ఇచ్చారు. అలాగే హిందూ ఆచారాల కోసం చేసే ఏర్పాట్లకు ముస్లీం కుటుంబం సాయం కూడా చేసింది. ఒకరి సంప్రదాయాలనుల ఒకరు గౌరవించుకుంటూ..ఆ జంటలు ఘనంగా వివాహం చేసుకున్నారు. అంతేగాదు రెండు వర్గాల ప్రజలు ఉమ్మడి విందును ఆనందంగా ఆస్వాదించారు.
ఇక కొత్తగా పెళ్లైన ముస్లిం జంట మహీన్, మోమ్సిన్ కాజీలు హిందూ జంట నరేంద్ర, సంకృతిలతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఒకరకంగా ప్రకృతి మతసామరస్యంగా ఉండండిరా.. అని పిలుపునిచ్చినట్లుగా వేర్వేరు మతాలకు చెందిన ఆ జంటలను ఒక వేదికపైకి తీసుకొచ్చింది కాబోలు.
(చదవండి: మూడు నెలలకు మించి బతకడన్నారు.. కట్‌చేస్తే ఏకంగా వందేళ్లకు పైగా..)