
యువతకు స్ఫూర్తిగా నిలవాలనుకున్నా.. పరిస్థితులు అలా లేవు... అందుకే వైదొలిగా
స్పాన్సర్ల పక్కన ఆటాడే కోతుల్లా కూర్చోబెట్టారు
మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ సంచలన ఆరోపణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం తొలిసారి ఆతిథ్యం ఇస్తున్న మిస్ వరల్డ్–2025 అందాల పోటీల చుట్టూ తీవ్ర వివాదం ముసురుకుంది! వ్యక్తిగత కారణాలతో పోటీల నుంచి వైదొలగుతున్నట్లు చెప్పి స్వదేశం వెళ్లిపోయిన మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ తాజాగా ‘ద సన్’కు ఇచి్చన ఇంటర్వ్యూలో పోటీల తీరుపై సంచలన ఆరోపణలు గుప్పించారు. తాను వేశ్యననే భావన కలిగేలా నిర్వాహకులు పరిస్థితులను కలి్పంచారంటూ బాంబు పేల్చారు. నిర్వాహకులు పేర్కొన్నట్లు ఈ పోటీలు బ్యూటీ విత్ పర్పస్‌కు అనుగుణంగా లేవని.. అదంతా డొల్లేనని దుయ్యబట్టారు.
పోటీదారులంతా ఎల్లవేళలా మేకప్ వేసుకోవాలని ఆదేశించారని.. అల్పాహారం సమయంలోనూ బాల్ గౌన్లు ధరించాల్సిందేనని హుకుం జారీ చేశారని విమర్శించారు. ‘పోటీకి ఆర్థిక సహకారం అందిస్తున్న స్పాన్సర్లకు కృతజ్ఞతాపూర్వకంగా ఆరుగురు అతిథులు కూర్చున్న ఒక్కో టేబుల్ వద్ద ఇద్దరేసి పోటీదారులను కూర్చోబెట్టారు. సాయంత్రం మొత్తం వారితో కూర్చొని కృతజ్ఞతలు తెలుపుతూ మేం వినోదం అందించాలని నిర్వాహకులు ఆశించారు.
ఓ సమయంలో పోటీల ఉద్దేశం గురించి అతిథులకు వివరించే ప్రయత్నం చేశా. కానీ ఈ విషయాన్ని వారెవరూ పట్టించుకోలేదు. అది నాకు భరించలేనట్లుగా అనిపించింది. ఇతరుల వినోదం కోసం నేను ఇక్కడికి రాలేదు కదా అనుకున్నా. సంపన్న పురుష స్పాన్సర్ల ముందు కవాతు చేశాక వేశ్యలా భావించా’అని మిల్లా మాగీ చెప్పుకొచ్చింది.
మారాలనుకున్నా... నా వల్ల కాలేదు..
సమాజంలో మార్పు తీసుకురావడానికి, యువతలో స్ఫూర్తినింపి వారి భవితకు దోహదపడాలనే ఉద్దేశంతోనే పోటీలో పాల్గొన్నానని మిల్లా మాగీ పేర్కొంది. కానీ అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితుల్లో ఉంటానని ఏమాత్రం ఊహించలేకపోయానని చెప్పుకొచ్చింది. అతిథులను సంతోషపెట్టేందుకు ఆటాడే కోతుల్లా అక్కడ కూర్చోవాల్సి వచ్చిందని.. దీన్ని ఏమాత్రం తట్టుకోలేకపోయానని వాపోయింది.
‘నేను నిర్వాహకుల నిబంధనలకు అనుగుణంగా మారాలనే ప్రయత్నంలో ఒత్తిడిని అనుభవించా. అలా చేయకపోతే గెలవలేననే విషయం నాకు అర్థమైంది. మిస్ వరల్డ్ పోటీలంటే మనం ఎలా ఉన్నామో అలా కనిపించడం. కానీ 1970ల నుంచి ఆ పోటీల తీరు మారలేదు. అందుకే మేకప్ లేకుండానే బయటకు వెళ్లడం ప్రారంభించా. అల్పాహారం తీసుకోవడానికి నాకు నప్పేవి, తగిన దుస్తులను ధరించడం ప్రారంభించా’అని మిల్లా మాగీ చెప్పింది.
ఆరోపణలన్నీ నిరాధారం: మిస్ వరల్డ్ సీఈఓ
మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ ఆరోపణలను మిస్ వరల్డ్–2025 సీఈఓ జూలియా మోర్లే ఓ ప్రకటనలో ఖండించారు. ఆమె ఆరోపణలను నిరాధార, కల్పితమైనవిగా అభివరి్ణంచారు. తల్లి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నందున పోటీల నుంచి వైదొలగుతానని మిల్లా మాగీ చెప్పడంతో ఆమె స్వదేశం చేరుకొనేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
మాగీ స్థానంలో మిస్ ఇంగ్లాండ్ పోటీల్లో రన్నరప్‌గా నిలిచిన చార్లెట్ గ్రాంట్ పోటీలో పాల్గొనేందుకు హైదరాబాద్ చేరుకుందని.. ఈ పోటీలో ఇంగ్లండ్ ప్రాతినిధ్యం కొనసాగుతోందని పేర్కొన్నారు. మిల్లా మాగీ ఆరోపణల నేపథ్యంలో పోటీలో పాల్గొన్న సందర్భంగా ఆమె నిర్వాహకులను ప్రశంసిస్తూ మాట్లాడిన మాటలు, అనుభూతులను పంచుకున్న వైనాన్ని వీడియోలను విడుదల చేయనున్నట్లు జూలియా మోర్లే వివరించారు. మిస్ వరల్డ్ సంస్థ అంకిత భావంతో ఉందని.. బ్యూటీ విత్ పర్పస్ అనే పంథాకు కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు.