
ఇంగ్లండ్‌లతో టెస్టులకు వసీం జాఫర్ ఎంచుకున్న జట్టు ఇదే
భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్ ఎవరు?.. ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడే జట్టు ప్రకటన ఎప్పుడు?.. భారత క్రికెట్ వర్గాల్లో ఇప్పుడిదే చర్చనీయాంశం. మాజీ క్రికెటర్లలో దిగ్గజం సునిల్ గావస్కర్ సహా వసీం జాఫర్, క్రిష్ణమాచారి శ్రీకాంత్ తదితరులు జస్‌ప్రీత్ బుమ్రాకే పగ్గాలు అప్పగించాలని సూచిస్తున్నారు.
మరోవైపు.. రవిశాస్త్రి వంటి మరికొంత మంది మాజీలు యువకుడైన శుబ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా నియమించాలని, పేస్ దళాన్ని ముందుకు నడిపిస్తున్న బుమ్రాపై అదనపు భారం వద్దని అభిప్రాయపడుతున్నారు.
కాగా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. ఈ సిరీస్‌తో టీమిండియా టెస్టు చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. ఇద్దరు స్టార్ల నిష్క్రమణ తర్వాత తొలిసారి విదేశీ గడ్డపై రెడ్‌బాల్ క్రికెట్‌లో భారత జట్టు ఎలా రాణిస్తుందనే అంశంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.
వసీం జాఫర్ ఎంచుకున్న జట్టు ఇదే
ఇక మే 24న బీసీసీఐ ఇంగ్లండ్ టూర్‌కు జట్టును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈలోపే భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ పదహారు మంది సభ్యులతో కూడిన తన జట్టును ప్రకటించాడు. ఈ జట్టుకు బుమ్రాను కెప్టెన్‌గా ఎంపిక చేసిన వసీం.. శుబ్‌మన్‌ను అతడికి డిప్యూటీగా నియమించాడు.
సాయి సుదర్శన్, నితీశ్‌లకు మొండిచేయి
అయితే, మొదటి నుంచి రేసులో ఉన్న సాయి సుదర్శన్ పేరును మాత్రం వసీం జాఫర్ పరిగణనలోకి తీసుకోలేదు. ఐపీఎల్-2025లో అదరగొడుతున్న ఈ గుజరాత్ టైటాన్స్ బ్యాటర్‌ను కాదని.. టెస్టు స్పెషలిస్టు, ఇంగ్లండ్ లయన్స్‌తో తలపడే భారత్-ఎ జట్టు కెప్టెన్ అయిన అభిమన్యు ఈశ్వరన్‌కు పెద్దపీట వేశాడు.
అంతేకాదు.. ఆస్ట్రేలియా పర్యటనలో సెంచరీతో ఆకట్టుకున్న ఆంధ్ర పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి కూడా వసీం జాఫర్ మొండిచేయి చూపాడు. అతడికి బదులు సీనియర్ శార్దూల్ ఠాకూర్‌వైపే మొగ్గుచూపాడు.
శ్రేయస్ అయ్యర్ లేదంటే కరుణ్ నాయర్
ఇక వికెట్ కీపర్ల కోటాలో రిషభ్ పంత్‌తో పాటు ధ్రువ్ జురెల్‌కు స్థానమిచ్చిన వసీం జాఫర్.. మిడిలార్డర్‌లో శ్రేయస్ అయ్యర్ లేదంటే కరుణ్ నాయర్‌లకు ప్రాధాన్యం ఇస్తానని తెలిపాడు. ఇక స్పిన్ దళంలో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌తో పాటు.. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజాతో పాటు వాషింగ్టన్ సుందర్‌కు చోటిచ్చాడు ఈ మాజీ క్రికెటర్.
అదే విధంగా.. ఫాస్ట్ బౌలర్ల బృందంలో బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీలకు చోటిచ్చిన వసీం జాఫర్.. నాలుగో ఆప్షన్‌గా అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, ఆకాశ్ దీప్‌లలో ఒకరిని ఎంచుకుంటానని తెలిపాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఇంగ్లండ్‌తో టెస్టులకు తన జట్టును ప్రకటించిన వసీం జాఫర్.. మరి మీ ఎంపిక ఏమిటంటూ క్రికెట్ ప్రేమికులను అడగ్గా.. మెజారిటీ మంది అతడి జట్టుతోనే ఏకీభవిస్తున్నారు. కాగా జూన్ 20 నుంచి ఇంగ్లండ్- టీమిండియా మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.
ఇంగ్లండ్‌తో టెస్టులకు వసీం జాఫర్ ఎంచుకున్న భారత జట్టు
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), శ్రేయస్ అయ్యర్/కరుణ్ నాయర్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా (కెప్టెన్), మహ్మద్ సిరాజ్, అభిమన్యు ఈశ్వరన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్/ప్రసిద్ కృష్ణ/ అకాశ్‌దీప్, వాషింగ్టన్ సుందర్.
చదవండి: ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా ఆయుశ్, వైభవ్ సూర్యవంశీకి చోటు