ఇంగ్లండ్‌ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. వైభవ్‌ సూర్యవంశీకి చోటు | India U19 Squad England Tour: Vaibhav Suryavanshi In, Ayush Mhatre To Lead | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా ఆయుశ్‌, వైభవ్‌ సూర్యవంశీకి చోటు

May 22 2025 1:25 PM | Updated on May 22 2025 1:46 PM

India U19 Squad England Tour: Vaibhav Suryavanshi In, Ayush Mhatre To Lead

ఆయుశ్‌ మాత్రే- వైభవ్‌ సూర్యవంశీ (PC: BCCI)

ఇంగ్లండ్‌లో నెల రోజుల పాటు పర్యటించనున్న భారత అండర్‌-19 జట్టు

India U-19 squad Announced for tour of England: ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లే అండర్‌-19 జట్టును భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) జూనియర్‌ సెలక్షన్‌ కమిటీ గురువారం ప్రకటించింది. ఐదు వన్డే, రెండు మల్టీ- డే మ్యాచ్‌లు ఆడేందుకు సెలక్టర్లు పదహారు మందితో కూడిన జట్టును ఎంపిక చేశారు. జూన్‌ 24- జూలై 23 వరకు సుదీర్ఘకాలం పాటు భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించనుంది.

ఇందులో భాగంగా తొలుత 50 ఓవర్ల ఫార్మాట్లో వార్మప్‌ మ్యాచ్‌ జరుగనుంది. అనంతరం ఐదు మ్యాచ్‌ల యూత్‌ వన్డే సిరీస్‌కు ఇంగ్లండ్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. అనంతరం ఇరుజట్ల మధ్య రెండు మల్టీ-డే మ్యాచ్‌లు (Multi Day Matches) జరుగుతాయి.

కెప్టెన్‌గా ఆయుశ్‌, వైభవ్‌ సూర్యవంశీకి చోటు
ఇక ఇంగ్లండ్‌ టూర్‌కు వెళ్లే భారత యువ జట్టుకు ముంబై ఆటగాడు, చెన్నై సూపర్‌ కింగ్స్‌ యువ సంచలనం ఆయుశ్‌ మాత్రే కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అతడికి డిప్యూటీగా అభిజ్ఞాన్‌ కుందును సెలక్ట్‌ చేశారు. అదే విధంగా.. ఐపీఎల్‌-2025లో దుమ్మురేపిన రాజస్తాన్‌ రాయల్స్‌ చిచ్చర పిడుగు వైభవ్‌ సూర్యవంశీకి కూడా ఈ జట్టులో చోటు దక్కింది.

ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఆయుశ్‌, వైభవ్‌ల ఆట తీరుపైనే ఉండనుంది. పొట్టి క్రికెట్‌లో అదరగొట్టిన ఈ ఇద్దరు యంగ్‌ స్టార్లు.. యాభై ఓవర్లు, రెడ్‌ బాల్‌ క్రికెట్‌లో యూకేలో ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కాగా ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు చేసిన పద్నాలుగేళ్ల వైభవ్‌ సూర్యవంశీ.. మొత్తంగా ఏడు మ్యాచ్‌లు ఆడి 252 పరుగులు సాధించాడు.

మరోవైపు.. ఆయుశ్‌ మాత్రే చెన్నై తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగి.. ఆరు మ్యాచ్‌లు ఆడి 206 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఐపీఎల్‌-2025లో తమదైన ముద్ర వేయగలిగారు.

ఇంగ్లండ్‌ పర్యటనకు భారత అండర్‌-19 పురుషుల జట్టు
ఆయుష్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్‌సింగ్ చావ్డా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు (వైస్‌ కెప్టెన్, వికెట్‌ కీపర్‌), హర్‌వన్ష్‌ సింగ్ (వికెట్‌ కీపర్‌), ఆర్‌.ఎస్‌. అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, యుధాజిత్‌ గుహ, ప్రణవ్‌ రాఘవేంద్ర, మొహ్మద్‌ ఇనాన్‌, ఆదిత్య రానా, అన్మోల్‌జీత్‌ సింగ్‌.

స్టాండ్‌ బై ప్లేయర్లు: నమన్‌ పుష్కక్‌, డి. దీపేశ్‌, వేదాంత్‌ త్రివేది, వికల్ప్‌ తివారి, అలంకృత్‌ రాపోలే (వికెట్‌ కీపర్‌).

భారత్‌ అండర్‌-19 వర్సెస్‌ ఇంగ్లండ్‌ అండర్‌-19: 2025 షెడ్యూల్
👉జూన్‌ 24- 50 ఓవర్ల వార్మప్‌ గేమ్‌- లోబోరో యూనివర్సిటీ
👉జూన్‌ 27- తొలి వన్డే- హోవ్‌
👉జూన్‌ 30- రెండో వన్డే- నార్తాంప్టన్‌
👉జూలై 2- మూడో వన్డే- నార్తాంప్టన్‌
👉జూలై 5- నాలుగో వన్డే- వోర్సెస్టర్‌
👉జూలై 7- ఐదో వన్డే- వోర్సెస్టర్‌
👉జూలై 12- తొలి మల్టీ డే మ్యాచ్‌- బెకింగ్‌హామ్‌
👉జూలై 20- రెండో మల్టీ డే మ్యాచ్‌- చెమ్స్‌ఫోర్డ్‌.

చదవండి: వాళ్లిద్దరి వల్లే నా పని సులువు.. అతడొక అద్భుతం: హార్దిక్‌ పాండ్యా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement