
Photo Courtesy: BCCI
ఢిల్లీ క్యాపిటల్స్ (MI vs DC)తో కీలక పోరులో విజయం సాధించడం పట్ల ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) హర్షం వ్యక్తం చేశాడు. జట్టు ప్రదర్శన పట్ల తాను సంతృప్తిగా ఉన్నట్లు తెలిపాడు. కాగా గతేడాది హార్దిక్ సేన.. పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన విషయం తెలిసిందే.
టాప్-4లో అడుగు
ఇక ఐపీఎల్-2025 (IPL 2025) ఆరంభంలోనూ వరుస ఓటములతో చతికిలపడ్డ ముంబై.. ఆ తర్వాత అనూహ్య రీతిలో పుంజుకుని డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించింది. తద్వారా ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు దూసుకువచ్చిన హార్దిక్ సేన.. బుధవారం ఢిల్లీపై గెలిచి టాప్-4లో అడుగుపెట్టింది.
సూర్య, నమన్ ఫటాఫట్
సొంత మైదానం వాంఖడేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు సాధించింది. సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 73 నాటౌట్), నమన్ ధీర్ (8 బంతుల్లో 24 నాటౌట్) వల్లే ఈ మేర స్కోరు సాధ్యమైంది.
ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే ముంబై బౌలర్లు ఢిల్లీ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. పవర్ ప్లేలో వరుస విరామాల్లో వికెట్లు తీసి ఫాఫ్ బృందాన్ని కోలుకోనివ్వకుండా చేశారు. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(6)ను అవుట్ చేసి దీపక్ చహర్ శుభారంభం అందించగా.. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (11)ను బౌల్డ్ పెవిలియన్‌కు పంపాడు.
సాంట్నర్, బుమ్రా అదరగొట్టారు
ఆ తర్వాత మిచెల్ సాంట్నర్, జస్‌ప్రీత్ బుమ్రా ఆకాశమే హద్దుగా చెలరేగి ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. క్రీజులో పాతుకుపోవాలని చూసిన సమీర్ రిజ్వీ (39), విప్రాజ్ నిగమ్ (20)ల రూపంలో కీలక వికెట్లు తీసిన సాంట్నర్.. మరో హిట్టర్ అశుతోష్ శర్మ (18) వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక బుమ్రా ట్రిస్టన్ స్టబ్స్ (2) రూపంలో ప్రమాదకర బ్యాటర్‌ను వెనక్కి పంపడంతో పాటు.. మాధవ్ తివారి (3), ముస్తాఫిజుర్ రహ్మమాన్ (0)లను బౌల్డ్ చేసి.. ముంబైని విజయతీరాలకు చేర్చాడు. ముంబై బౌలర్ల ధాటికి ఢిల్లీ క్యాపిటల్స్ 18.2 ఓవర్లలో 121 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ కాగా.. హార్దిక్ సేన 59 పరుగుల తేడాతో గెలిచింది. సీజన్‌లో ఎనిమిదో గెలుపు నమోదు చేసి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది.
వాళ్లిద్దరి వల్లే నా పని సులువు.. అతడొక అద్భుతం
ఈ నేపథ్యంలో విజయానంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. ‘‘ఎలాంటి పరిస్థితుల్లోనైనా.. ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను సాంట్నర్, బుమ్రాలకు బంతిని ఇచ్చేందుకు వెనుకాడను. ఎందుకంటే వారిద్దరు మ్యాచ్‌ను ఆధీనంలోకి తెచ్చుకోవడంలో దిట్ట.
అంతేకాదు.. ఏ పని చేసినా దాని అంతు చూసేదాకా వదిలిపెట్టరు. వాళ్లిద్దరి వల్లే నా పని సులువైంది. ఈ పిచ్‌పై 160 పరుగుల రావడమే ఎక్కువ అనుకున్నాం. అలాంటి స్థితిలో సూర్య, నమన్ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా.. నమన్.. వికెట్ కఠినంగా మారుతున్న వేళ కూడా అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు’’ అని సహచర ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించాడు.
ఇక ఈ మ్యాచ్‌లో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. కేవలం మూడు పరుగులే చేశాడు. అదే విధంగా ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ వేయలేదు.
చదవండి: MI Vs DC: ముందు చేతులు శుభ్రం చేసుకో బుమ్రా!.. నీతా అంబానీ చర్య వైరల్
Dominant victory ✅
Playoffs ✅
A dream outing for #MI in their last match at Wankhede this season as they secure a 59-run win over #DC 💙👏
Scorecard ▶ https://t.co/fHZXoEJVed#TATAIPL | #MIvDC | @mipaltan pic.twitter.com/mitYRgtqlZ— IndianPremierLeague (@IPL) May 21, 2025