
సత్తా చాటిన మిస్ వేల్స్, మిస్ టర్కీ, మిస్ ట్రినిడాడ్, మిస్ జాంబియా
నాలుగు ఖండాల నుంచి నలుగురు సుందరీమణుల ఎంపిక
పోటాపోటీగా ముగిసిన చాలెంజ్
సాక్షి, హైదరాబాద్: మిస్ వరల్డ్ పోటీల్లో కీలకమైన హెడ్–టు–హెడ్ ఛాలెంజ్ ఫైనల్ హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్‌లో పోటాపోటీగా జరిగింది. యూరప్, ఆఫ్రికా, ఆసియా అండ్ ఓషియానియా, అమెరికా అండ్ కరేబియన్ నుంచి ఐదుగురు చొప్పున మొత్తం ఇరవై మంది పోటీదారులు సామాజిక అంశాలపై తమ అభిప్రాయాలను, తాము చేస్తున్న కార్యక్రమాలను తమదైన శైలిలో జడ్జిలకు వివరించారు. జడ్జిలు తమకు వేసిన ప్రశ్నలకు వారు జవాబిచ్చారు. వాటి ఆధారంగా నాలుగు ఖండాల నుంచి నాలుగు దేశాలకు చెందిన సుందరీమణులను హెడ్–టు–హెడ్ విజేతలుగా ఎంపిక చేశారు.
అమెరికా–కరేబియన్ నుంచి మిస్ ట్రినిడాడ్
హెడ్–టు–హెడ్ ఛాలెంజ్ ఫైనల్లో భాగంగా అమెరికా–కరేబియన్ ఖండంలోని బ్రెజిల్, సురినామ్, కేమెన్ ఐలాండ్స్, గయానా, ట్రినిడాడ్ అండ్ టొబాగో నుంచి వచ్చిన పోటీదారులకు ‘తెలంగాణలో మహిళా సాధికారత – భద్రత’ పై ప్రపంచానికి మీరు ఏ సందేశాన్ని ఇస్తారనే ప్రశ్న వేశారు. ఈ గ్రూపులో ఉత్తమ జవాబు ఇచ్చిన మిస్ ట్రినిడాడ్ అండ్ టొబాగో తుది రౌండ్‌కు ఎంపికయ్యింది. ప్రగతి, సాధికారత ఒకటే. భారత్ ముఖ్యంగా హైదరాబాద్ ఈ దిశగా చేయడుతున్న చర్యలు అభినందనీయం. సగం జనాభా వెనుకబడి ఉంటే విజయం సాధించలేమనే ఉద్దేశంతో మహిళలను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్న తెలంగాణ స్ఫూర్తిదాయకం..’ అంటూ సమాధానం ఇచ్చింది.
ఆఫ్రికా నుంచి మిస్ జాంబియా
ఆఫ్రికా ఖండానికి సంబంధించి దక్షిణాఫ్రికా, నమీబియా, సోమాలియా, ఉగాండా, జాంబియా పోటీదారులకు..‘సోషల్ మీడియా జీవితంలోని అనేక అంశాలను, ముఖ్యంగా యువతను ప్రభావితం చేస్తోంది. ఈ విషయంలో మీరు ఎలా ప్రామాణికంగా ఉంటారు’అనే ప్రశ్న వేశారు. ఈ గ్రూపు నుంచి తుది పోరుకు ఎంపికైన మిస్ జాంబియా మాట్లాడుతూ‘ప్రపంచం మారవచ్చు, కానీ మీరు మారాల్సిన అవసరం లేదు. మీరలాగే ఉండండి. ప్రపంచం దాన్ని స్వీకరించనివ్వండి. సమాజం పరిణామం చెందవచ్చు, కానీ మన నిజ స్వభావాన్ని కోల్పోకూడదు’ అని చెప్పారు.
యూరప్ నుంచి మిస్ వేల్స్..
యూరప్ గ్రూప్‌లో స్పెయిన్, వేల్స్, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్ దేశాల సుందరీమణులు పాల్గొనగా..‘మీ దేశంలో యువ జీవితాలను మెరుగుపరచడానికి మీరు ఒక మార్పును అమలు చేయగలిగితే అది ఏమిటి? అదే ఎందుకు?’ అనే ప్రశ్న వేయగా.. ఈ బృందంలో ఎంపికైన మిస్ వేల్స్.. ‘ఆరోగ్య సంరక్షణ, విద్య ప్రధానం. మా కుటుంబంలో విశ్వవిద్యాలయానికి వెళ్లిన మొదటి వ్యక్తిని నేనే. ఉగాండా, భారతదేశంలో వైద్య సేవలు, ముఖ్యంగా యాసిడ్ దాడి బాధితుల కథలు, నా లక్ష్యానికి స్ఫూర్తినిచ్చాయి. విద్య అత్యంత శక్తివంతమైన సాధనం..’ అని చెప్పడం ద్వారా విజేతగా నిలిచారు.
ఆసియా నుంచి మిస్ టర్కీ
ఇక ఆసియా అండ్ ఓషియానియా నుంచి శ్రీలంక, థాయిలాండ్, టర్కీ, లెబనాన్, జపాన్ కంటెస్టెంట్‌లకు.. ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ ప్రాజెక్ట్‌తో పనిచేయడం మీ దృక్పథాన్ని ఎలా మార్చింది?’ అనే ప్రశ్న జడ్జిలు వేశారు. ఈ గ్రూపులో విజేత మిస్ టర్కీ.. ‘నేటి ప్రపంచంలో సాంస్కృతిక వారసత్వం అత్యంత ముఖ్యమైనది. కాన్సులేట్లు, రాయబార కార్యాలయాలు నిర్వహించే అంతర్జాతీయ ఈవెంట్ ద్వారా సంగీతం, కళలు, వంటకాలు, సంప్రదాయాలతో మనం సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడటమే కాకుండా, ఐక్యతను పెంపొందించుకోగలం. సాంస్కృతిక తేడాలు అడ్డంకులు కావు.. వంతెనలు..’ అని చెప్పారు.
మీరు తెలంగాణను ప్రపంచానికి ఎలా పరిచయం చేస్తారు?
తుది పోరుకు ఎంపికైన మిస్ టర్కీ, వేల్స్, జాంబియా, ట్రినిడాడ్ అండ్ టొబాగోలకు జడ్జిలు చివరగా ఒక ప్రశ్న వేశారు. ‘భారతదేశంలోని అతి చిన్న రా ష్ట్రమైన తెలంగాణను సంస్కృతి, వారసత్వం, ఆవిష్కరణల పరంగా ప్రపంచానికి ఎలా పరిచయం చేస్తారు?’ అని అడగ్గా.. నలుగురూ జవాబిచ్చారు.
ఆవిష్కరణల కేంద్రం
తెలంగాణ సాంకేతిక, వైద్య ఆవిష్కరణల కేంద్రం. ఇది ప్రగతిశీల, శక్తివంతమైన రాష్ట్రం, మహిళల హ క్కులు, భద్రత, విద్యకు ప్రాధాన్యత ఇస్తుంది. తెలంగాణ ప్రపంచానికి ‘సాధికారత, ఆవిష్కరణ, లింగ సమానత్వంతో శక్తివంతమైన సందేశాన్ని పంపుతుంది. – మిస్ టర్కీ
నా దేశాన్ని ఆహ్వానిస్తా
తెలంగాణ గురించి చెప్పడమే కాదు.. ఈ రాష్ట్ర గొప్ప సంస్కృతిని ప్రత్యక్షంగా అనుభవించడానికి నా దేశాన్ని ఆహ్వానిస్తాను. – మిస్ వేల్స్
కళలు, సంస్కృతితో మమేకం
తెలంగాణ ప్రజలు కళలు, సంస్కృతితో మమేకమైన వారు. నాకు వారి ప్రామాణికతను ప్రతిబింబించే అనేక బహుమతులు లభించాయి. మిస్ వరల్డ్ నినాదం ‘బ్యూటీ విత్ ఎ పర్ప స్’ కాగా.. తెలంగాణ ఆ స్ఫూర్తిని పూర్తి స్థాయిలో కలిగి ఉంది. – మిస్ జాంబియా
దయ, సంస్కృతి నిండిన ప్రజలు
నా దేశం లార్డ్ అఫ్ ది సన్ దేశంగా ప్రసిద్ధి చెందింది. తెలంగాణ సన్ అఫ్ ది లార్డ్. ఇక్కడ ప్రజలు దయ, సంస్కృతితో నిండి ఉన్నారు. – మిస్ ట్రినిడాడ్ అండ్ టొబాగో