
ర్యాంప్‌పై అందాల భామల క్యాట్‌వాక్..
మిస్ వరల్డ్ ప్రధాన పోటీల్లో నిలిచే టాప్–40 స్థానాల్లో చోటు
భారత సుందరి నందినిని ఎట్టకేలకు నాలుగో చాలెంజ్‌లో వరించిన అదృష్టం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ సుందరి పోటీల్లో కిరీటం కోసం పోటీపడే టాప్–40 మందిలో 10 మంది చోటు దక్కించుకున్నారు. వారు ఒక్కో ఖండం నుంచి ఎంపికయ్యే టాప్–10లో భాగం కానున్నారు. శనివారం నాటికి మొత్తం నాలుగు రకాల చాలెంజ్ రౌండ్లు పూర్తయ్యాయి. గ్రాండ్ ఫినాలే ముందు మరో రౌండ్ మాత్రమే మిగిలి ఉంది. ఒక్కో ఖండం నుంచి ఎంపికయ్యే మొదటి 10 మందిలో ఫాస్ట్‌ట్రాక్ పద్ధతిలో స్థానం సంపాదించిన ఈ 10 మందిలో భారత సుందరి నందినీ గుప్తా కూడా ఉండటం విశేషం. మొదటి మూడు చాలెంజ్ రౌండ్లలో ఆమెకు నిరాశ ఎదురవగా శనివారం జరిగిన కీలక టాప్ మోడల్ చాలెంజ్‌లో ఆమె ఆసియా–ఓషియానియా నుంచి విజేతగా నిలిచి టాప్–10 గ్రూపులో చేరింది.
ఇక చివరగా ఈ నెల 26న హైటెక్స్‌లో బ్యూటీ విత్ పర్పస్ కార్యక్రమం జరగనుంది. అందులో పోటీదారులు వారి సామాజిక సేవా కార్యక్రమాల గురించి వివరించాల్సి ఉంటుంది. వాటిల్లో ఉత్తమంగా రాణించినవారు టాప్–40 (ఖండానికి 10 మంది చొప్పున)లో మిగతా బెర్తులు సాధిస్తారు. వారిలోంచి టాప్–20 (ఖండానికి ఐదుగురు చొప్పున), ఆ తర్వాత టాప్–8 (ఖండానికి ఇద్దరేసి) ఎంపిక చేస్తారు. ఈ ఎనిమిది మంది ఈ నెల 31న హైటెక్స్‌లో జరిగే గ్రాండ్ ఫినాలేలో భాగమవుతారు. వారి నుంచి విజేత, మొదటి రన్నరప్, రెండో రన్నరప్ ఎంపికవుతారు.
టాప్ మోడల్ చాలెంజ్: విజేతలు: మిస్ ఇండియా, మిస్ నమీబియా, మిస్ మార్టీనిక్, మిస్ ఐర్లాండ్ శనివారం జరిగిన టాప్ మోడల్ చాలెంజ్ ఆసాంతం ఆసక్తికరంగా సాగింది. ఇందులో తొలుత నాలుగు ఖండాల నుంచి ఇద్దరు చొప్పున మొత్తం ఎనిమిది మందితో షార్ట్‌లిస్ట్ తయారు చేశారు. అందులోంచి న్యాయ నిర్ణేతలు ఖండానికి ఒకరు చొప్పున నలుగురిని విజేతలుగా ప్రకటించారు. ఇందులో ఆసియా–ఓషియానియా నుంచి మిస్ ఇండియా నందినీ గుప్తా న్యూజిలాండ్ భామ నుంచి గట్టి పోటీ ఎదుర్కొని విజేతగా నిలిచింది.
ఆఫ్రికా నుంచి నమీబియా సుందరి సెల్మా కమన్య, ఆమెరికా–కరీబియన్ నుంచి మిస్ మార్టీనిక్ అరేలీ జోచిమ్, యూరప్ నుంచి ఐర్లాండ్ సుందరి జాస్మిన్ గెర్హాడ్‌లు విజయం సాధించారు. ఇలా ఇప్పటి వరకు 10 మంది భామలు ఖండానికి 10 మంది చొప్పున మొత్తం 40 మంది ఉండే బృందంలో బెర్తు దక్కించుకున్నారు. గ్రాండ్ ఫినాలే నాటికి పోటీల్లో ఉండేందుకు చోటు దక్కించుకున్న 10 మందిలో ముగ్గురు ఆసియా ఖండానికి చెందిన వారున్నారు. మిగిలిన వారిలో యూరప్ నుంచి ముగ్గురు, ఆఫ్రికా నుంచి ఇద్దరు, ఆమెరికా–కరీబియన్ నుంచి ఇద్దరు ఉన్నారు.
ఆసియా ఖండం నుంచి ఫాస్ట్‌ట్రాక్ పద్ధతిలో టాలెంట్ చాలెంజ్‌లో ఇండోనేసియా సుందరి, హెడ్ టు హెడ్ చాలెంజ్‌లో తుర్కియే ముద్దుగుమ్మ , శనివారం నందినీ గుప్తా చోటు దక్కించుకున్నారు. ఇంకా ఏడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
ఇప్పటివరకు వివిధ చాలెంజ్‌లలో విజేతలుగా టాప్–40లో చోటుదక్కించుకున్న వారి వివరాలు ఇలా..
స్పోర్ట్స్ చాలెంజ్: విజేత మిస్ ఎస్తోనియా ఎలిస్ రాండ్‌మా
⇒ ఈ నెల 17న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగింది. 109 మంది పోటీదారులు ఫిట్‌నెస్‌లో తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. అందులో 32 మందిని షార్ట్‌లిస్ట్ చేయగా అందులోంచి మొదటి నాలుగు స్థానాలకు నలుగురిని ఎంపిక చేశారు. వారిలో ఎస్తోనియాకు చెందిన ఎలిస్ రాండ్‌మా విజేతగా నిలిచింది. ఖండానికి 10 మంది చొప్పున 40 మందితో కూడిన ప్రధాన పోటీదారుల జాబితాలో ఆమె తొలి స్థానాన్ని దక్కించుకుంది.
టాలెంట్ చాలెంజ్: విజేత మిస్ ఇండోనేసియా మొనికా కెజియా
⇒ ఈ నెల 22న శిల్పకళావేదికలో ఈ పోటీలు సాగాయి. పోటీదారులు ఆటాపాట, సంగీతంతో ఉర్రూతలూగించారు. అందులో మొత్తం 24 మందిని ఉత్తమ ప్రతిభావంతులుగా షార్ట్‌లిస్ట్ చేశారు. వారిలో నందినీ గుప్తా కూడా ఉన్నారు. ఆ తర్వాత టాప్–3లో ఇండోనేసియా, కామెరూన్, ఇటలీ పోటీదారులు నిలవగా చివరకు విజేతగా ఇండోనేసియా భామను ప్రకటించారు.
హెడ్ టు హెడ్ చాలెంజ్: విజేతలు మిస్ వేల్స్, మిస్ తుర్కియే, మిస్ ట్రినిడాడ్–టొబాగో, మిస్ జాంబియా
⇒ ఈ నెల 20, 21 తేదీల్లో టీ–హబ్‌లో జరిగింది. ఫైనల్ పోటీ శుక్రవారం హోటల్ ట్రైడెంట్‌లో నిర్వహించారు. కాంటినెంటల్ క్వాలిఫైర్స్, టాప్–8 మందిని ఎంపిక చేసి అందులోంచి శుక్రవారం విజేతలను ప్రకటించారు. అందులో ఆసియా నుంచి తుర్కియే భామ ఇదిల్ బిల్గెన్, ఆఫ్రికా నుంచి ఫెయిత్ బ్వాల్వా, అమెరికా–కరీబియన్ దీవుల నుంచి ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన అన్నా లిసే నాన్టన్, యూరప్ నుంచి వేల్స్ ముద్దుగుమ్మ విల్లీ మీ ఆడమ్స్ ఎంపికయ్యారు. తొలుత టాప్–20, ఆ తర్వాత టాప్–8 భామలను ఎంపిక చేసి చివరకు విజేతలను ప్రకటించారు.