
న్యూఢిల్లీ: పోక్సో చట్టం కింద శిక్ష పడ్డ ఓ వ్యక్తికి దేశ సర్వోన్నత న్యాయస్థానం ఊరట ఇచ్చింది. ఆర్టికల్ 142 కింద విస్తృత అధికారాలను ఉపయోగిస్తూ అతని శిక్షను రద్దు చేసింది. ఇదొక అరుదైన కేసుగా పేర్కొన్న సుప్రీం కోర్టు(Supreme Court) అద్భుతమైన తీర్పు ఇస్తూనే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
‘‘కుటుంబం ఆమెను వదిలేసింది. వ్యవస్థ ఆమెను నిందించింది. న్యాయ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. చట్టం దృష్టిలో ఇది నేరమే అయి ఉండొచ్చు. కానీ, బాధితురాలే జరిగిన దానిని నేరంగా పరిగణించడం లేదు. ఇప్పుడు ఆమె వేదనల్లా.. నిందితుడికి శిక్ష పడకుండా రక్షించుకోవాలని. అందుకోసమే ఆమె పోలీస్, న్యాయవ్యవస్థలతో పోరాడుతోంది. ఈ కేసులోని వాస్తవాలు.. ప్రతీ ఒక్కరికీ ప్రతి ఒక్కరికీ కంటి తెరుపు.
.. నిందితుడితో బాధితురాలికి ఉన్న భావోద్వేగ అనుబంధం, వారి ప్రస్తుత కుటుంబ జీవితంతో సహా అసాధారణ పరిస్థితులు పరిగణనలోకి తీసుకుని ‘‘పూర్తి న్యాయం’’ అందించేందుకు ఆర్టికల్ 142(Article 142) కింద అధికారాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా,జస్టిస్ ఉజ్జయ్ భుయాన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. తద్వారా అతని శిక్ష రద్దు చేస్తున్నట్లు జస్టిస్ ఓకా తీర్పు వెల్లడించారు.
సంచలన కేసుగా..
పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక వ్యక్తి తన 24 ఏళ్ల వయసులో 15 ఏళ్ల మైనర్ బాలికతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. అయితే.. ఆ తర్వాత మైనార్టీ తీరాక ఆమెనే అతను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ జంట పిల్లలతో సంతోషంగా జీవిస్తోంది. అయితే అప్పటికే అతనిపై పోక్సో యాక్ట్(POCSO Act) కింద కేసు నమోదు అయ్యింది. కింది కోర్టులో 20 ఏళ్ల కారాగార శిక్షపడడంతో.. కేసు కలకత్తా హైకోర్టుకు చేరింది.
అయితే.. 2023లో ఈ కేసు విచారణ సందర్భంగా సదరు వ్యక్తికి ఊరట ఇచ్చిన హైకోర్టు, తీర్పు ఇచ్చే ప్రయత్నంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. బాలికలు తమ లైంగిక కోరికలు అణుచుకోవాలంటూ వ్యాఖ్యలు చేసింది. ఈ తీర్పును సుమోటోగా తీసుకున్న సుప్రీం కోర్టు.. కోల్‌కతా హైకోర్టు వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టింది. కిందటి ఏడాది ఆగష్టులో హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసి నిందితుడికి శిక్షను పునరుద్ధరించింది. అయితే బాధితురాలు/అతని భార్య విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని శిక్షను అమలు చేయకుండా.. ఈ కేసును ప్రత్యేకంగా పరిగణించింది. ఈ కేసులో బాధితురాలి ప్రస్తుత మానసిక స్థితి పరిశీలన కోసం నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేయించింది సుప్రీం కోర్టు. ఏప్రిల్ సీల్డ్ కవర్‌లో అందిన ఆ నివేదికను పరిగణనలోకి తీసుకున్న ద్విసభ్య ధర్మాసనం తాజాగా.. బాధితురాలి భర్తకు ఊరట ఇస్తు తీర్పు వెల్లడించింది.
ఇదీ చదవండి: ఏకంగా 27 సార్లు బెయిల్ పిటిషన్ వాయిదా?