
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ బకాయిలను చెల్లించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలపై ఆ రాష్ట్ర బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. ఎప్పట్నుంచో మమతా ప్రభుత్వం నాన్చుతూ వస్తున్న పెండింగ్ డీఏను చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగుల విజయంగా బీజేపీ పేర్కొంది. ఈరోజు(శుక్రవారం) దీనికి సంబంధించి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ప్రభుత్వ ఉద్యోగుల 25 శాతం డీఏ బకాయిలను మూడు నెలల నిర్ణీత వ్యవధిలో చెల్లించాలని సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
దీనిపై వెస్ట్ బెంగాల్ బీజేపీ అధికార ప్రతినిధి అమిత మాలవియా మాట్లాడుతూ.. ‘ ఇది ప్రభుత్వంపై ఉద్యోగులు సాధించిన అతిపెద్ద విజయం. సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం జరిగింది. ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నా మమతా సర్కారు దీన్ని పట్టించుకోవడం లేదు. 17 వాయిదాలు, విచారణలో ఆటంకాల తర్వాత సుప్రీంకోర్టుల చివరకు తన తీర్పును వెల్లడించడం హర్షించదగ్గ విషయం. ఇది ప్రభుత్వంపై ఉద్యోగులు, బీజేపీ సాధించిన అతిపెద్ద విజయం. ఇది ఒక మైలురాయి లాంటి తీర్పు’ అని పేర్కొన్నారు.
కాగా, 2022, మే నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తున్న విధానం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ చెల్లించాలని ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రావడంతో ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు.