
న్యూఢిల్లీ: సీబీఐ నమోదు చేసిన చీటింగ్ కేసులో నిందితుడు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణను 27సార్లు వాయిదా వేసిన అలహాబాద్ హైకోర్టుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశంపై విచారణను 27 సార్లు వాయిదా ఎలా వేస్తారు?’ అంటూ ప్రశ్నించింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ మసీహ్‌ల ధర్మాసనం లక్ష్య తవార్ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై గురువారం విచారణ సందర్భంగా ఇలా వ్యాఖ్యలు చేసింది. తవార్‌కు బెయిల్ మంజూరు చేసిన ధర్మాసనం, సీబీఐకి నోటీసు జారీ చేసింది. ‘సాధారణంగా కేసు వాయిదాలకు సంబంధించిన వ్యవహారాల్లో జోక్యం చేసుకోం. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశంపై 27 పర్యాయాలు వాయిదా వేసి, పెండింగ్‌లో ఉంచడం అసాధారణమైన విషయం. ఈ వ్యవహారాన్ని పరిశీలించాల్సి ఉంది’ అని సీజేఐ పేర్కొన్నారు. కాగా, తవార్‌పై వివిధ నేరారోపణలకు సంబంధించిన 33 కేసులున్నందున, మరింత ఆలస్యం కాకుండా విచారణను వేగవంతం చేయాలంటూ మార్చి 20న తవార్ బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా సందర్భంగా అలహాబాద్ హైకోర్టు దిగువ న్యాయస్థానానికి ఉత్తర్వులు జారీ చేసింది.