
ఐశ్వర్యారాయ్ తర్వాత ప్రపంచ సుందరి కిరీటాన్ని 3వసారి దేశానికి అందించిన ఘనత డయానా హేడెన్(Diana Hayden) దక్కించుకుంది. 1997 మిస్ వరల్డ్ పోటీ విజేత మెయిన్ టైటిల్‌తో పాటు మూడు సబ్–టైటిళ్లను కూడా గెలుచుకుని అలా గెలిచిన ఏకైక మిస్ వరల్డ్‌గా నిలిచింది. జన్మతః హైదరాబాద్ నగరంలోని ఆంగ్లో–ఇండియన్ కుటుంబంలో జన్మించిన డయానా హేడెన్... సికింద్రాబాద్‌లోని సెయింట్ ఆన్స్ హైస్కూల్‌లో తన పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసింది ఆమె పాఠశాల విద్యార్ధినిగా ఉన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు విడిపోయారు దాంతో ఆమె 13 సంవత్సరాల వయస్సులోనే తన భృతి కోసం పనిచేయడం ప్రారంభించాల్సి వచ్చింది.
మిస్ వరల్డ్‌గా గెలిచిన ఏడాది తర్వాత, హేడెన్ లండన్ కు వెళ్లి రాయల్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్ లో నటనను అభ్యసించింది. అక్కడ ఆమె షేక్స్పియర్ రచనలపై దృష్టి సారించి ఉత్తమ నటి నామినేషన్ పొందింది. ఆమె దక్షిణాఫ్రికాలో షేక్స్పియర్ ఒథెల్లో చలనచిత్రంతో 2001 లో, తెరపైకి అడుగుపెట్టింది. ఇండియన్ టీవీ షో బిగ్ బాస్ రెండవ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ పొంది 13 వ వారంలో ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ అయింది. మిస్ వరల్డ్ గెలిచినప్పటికీ సినిమా టీవీ రంగాల్లో ఆమె పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయింది. తెహ్ జీబ్, అబ్ బస్, లోన్ ఎ లవింగ్ డాల్...తదితర చిత్రాల్లో నటించినా ఆమె కేవలం ఒక సాదా సీదా నటిగానే మిగిలిపోయింది.
ఐశ్వర్యారాయ్, సుష్మితాసేన్‌ల తరహాలో కాకుండా బ్రౌన్ స్కిన్‌తో కొంత విలక్షణమైన అందంతో టైటిల్ గెల్చుకున్న డయానా హేడెన్ తన రూపం పట్ల కొందరు చేసిన పరుషమైన కామెంట్స్‌కు గురి కావాల్సి వచ్చింది. అలాంటివాటిలో ముఖ్యంగా ఆనాటి త్రిపుర సిఎం విప్లవ్‌కుమార్ దేవ్ ఆమె రూపాన్ని హేళన చేయడం ప్రస్తావనార్హం. అసలు మిస్ వరల్డ్ టైటిల్ గెలిచే సత్తా ఉన్న అందం ఆమెకు లేనేలేదని, ఐశ్వర్య గెలిచిందంటే ఓ అర్ధం ఉందని అంటూ ఆయన ఆమె రూపాన్ని ఎద్దేవా చేయడం సంచలనం సృష్టించింది. మనకు లక్ష్మి, సరస్వతి వంటి అందమైన దేవతలు ఉన్నారని డయానా లు కాదని అంటూ ఆయన తీవ్రమైన వ్యంగ్యోక్తులతో ఆమెను కించపరిచారు. ఈ మాటలు తీవ్ర వివాదంగా మారడంతో ఆయన డయానాను క్షమాపణలు కోరారు.