
కొన్నింటిని ప్రకృతి సహజసిద్ధంగా చక్కటి ఆకృతిని ఏర్పరస్తుంది. చూస్తే.. కళ్లుతిప్పుకోలేనంత అందంగా ఉంటాయి. అలాంటి సుందరమైన క్రికెట్ స్టేడియం ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. పైగా దీన్ని నెటిజన్లు ప్రకృతి దాచిన క్రికెట్ మైదానంగా అభివర్ణిస్తున్నారు. అదెక్కడ ఉందంటే..
కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో వరందరప్పల్లిలో ఉంది. దీన్ని పాలప్పిల్లి క్రికెట్ మైదానం అంటారు. సాధారణంగా స్టేడియంలు పచ్చిక బయళ్లకు దూరంగా ఉంటాయి. కానీ ఇది ప్రకృతితో అల్లుకుపోయినట్లుగా రహస్యంగా ఉంది. ప్రకృతి అందాలకు నెలవైనా కేరళను తరుచుగా 'దేవుని స్వంత దేశం'గా వర్ణిస్తారు కవులు.
అందుకు తగ్గట్టు పచ్చని చెట్లతో ఆకర్షణీయంగా కనిపిస్తున్న క్రికెట్ మైదానం ఆ వర్ణనకు మరింత బలం చేకూర్చేలా ఉంది. ఈ మైదానం దశాబ్దాల కాలం నాటిదట. దీనిని మొదట హారిసన్ మలయాళం కంపెనీ తన తోటల కార్మికులకు వినోద స్థలాన్ని అందించడానికి సృష్టించింది. అప్పటి నుంచి ఇది ఉద్యోగులకు మాత్రమే కాకుండా స్థానికులకు ఆటవిడుపు స్థలంగా మారింది.
అయితే దట్టమైన చెట్లతో కప్పబడి మారుమూల ప్రాంతంలో ఉండటంతోనే బయటి ప్రపంచానికి అంతగా తెలియదని అంటున్నారు స్థానికులు. అయితే అందుకు సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ శ్రీజిత్ ఎస్ "ఇది అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్ కాదు" అనే క్యాప్షన్‌తో షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారింది.
(చదవండి: వర్షం సాక్షిగా.. ఒక్కటైన జంటలు..!)