
క్రైమ్: మనకు తెలియకుండానే మన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రత్యక్షమవుతున్న రోజులివి. మరీ ముఖ్యంగా మహిళల విషయంలో ఇది మరీ ఎక్కువగా ఉంటోంది. వాళ్లలో కొందరు ముందుకు వచ్చి పోలీసులను ఆశ్రయిస్తుండడంతో నిందితులను సైతం పట్టుకోగలుగుతున్నారు.
ఆ మధ్య ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓ యువకుడు రోడ్డు మీద వెళ్లే అమ్మాయిలను అసభ్యకరరీతిలో ఫొటోలు తీసి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నడిపి ఊచలు లెక్కిస్తున్నాడు. తాజాగా బెంగళూరులోనూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. బెంగళూరు మెట్రో రైళ్లలో అమ్మాయిలను ఫొటోలు తీసి.. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఓపెన్ చేసి అప్‌లోడ్ చేస్తున్నాడు ఓ వ్యక్తి. పదుల సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో బుధవారం పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆపై ఆ పోకిరీపై నజర్ వేశారు.
చివరకు.. అతన్ని పట్టుకున్నట్లు బెంగళూరు పోలీసులు శుక్రవారం ప్రకటించారు. Bangalore Metro Clicks (@metro_chicks) పేరిట నడిపిన ఆ అకౌంట్‌లో వందల కొద్దీ అమ్మాయిల చిత్రాలు ఉన్నాయి. ఆ అకౌంట్‌కు ఐదు వేళ మంది ఫాలోవర్స్ ఉన్నారని పోలీసులు వెల్లడించారు. అందులో ఉన్న మొత్తం ఫొటోలను తొలగించి.. అకౌంట్‌ను సైతం తొలగించారు. అయితే నిందితుడి వివరాలు వెల్లడించాల్సి ఉంది. తస్మాత్ జాగ్రత్త.. మీ చుట్టుపక్కలా ఇలాంటి కామాంధులు ఉండొచ్చు! జర జాగ్రత్త!!.