
పటోలా లెహంగాలో ర్యాంప్‌పై నందినీ గుప్తా మెరుపులు
ఆసియా–ఓషియానియా గ్రూప్ నుంచి విజేతగా ఎంపిక
గొల్లభామ చీరలు, పోచంపల్లి వస్త్రాలతో క్యాట్‌వాక్ చేసి అదరగొట్టిన అందాల భామలు
సాక్షి, హైదరాబాద్: మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే ముందు ఒకే ఒక్క చాలెంజ్ రౌండ్ ఉందనగా మిస్ ఇండియా నందినీ గుప్తా టాప్–40 జాబితాలో చోటు దక్కించుకుంది. గ్రాండ్ ఫినాలే నాటికి పోటీలో ఉండాలంటే కచ్చితంగా ఖండానికి 10 మంది చొప్పున ఉండే ఈ టాప్–40లో చోటు దక్కించుకోవాల్సిందే. ఫాస్ట్‌ట్రాక్ పోటీ రౌండ్లలో విజయం సాధించడం ద్వారా నేరుగా అందులో చేరే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు జరిగిన మూడు రౌండ్లలో ఆమె విజయం సాధించలేకపోవడంతో మిస్ వరల్డ్ పోటీలను అనుసరిస్తున్న భారత అభిమానుల్లో నిరాశే మిగిలింది.
శనివారం హైటెక్స్‌లో జరిగిన టాప్ మోడల్ ఫ్యాషన్ షోలో నందినీ గుప్తా.. పటోలా లెహంగా వస్త్రధారణతో ర్యాంప్‌పై క్యాట్ వాక్‌తో న్యాయనిర్ణేతల దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ఆధునిక వస్త్రధారణలోనూ తళుక్కున మెరిసింది. వెరసి ఈ రౌండ్‌లో ఆసియా–ఓషియానియా గ్రూప్ నుంచి ఆమె న్యూజిలాండ్ సుందరితో కలిసి టాప్–8లో నిలిచింది. చివరకు న్యూజిలాండ్ భామను వెనక్కు నెట్టి విజేతగా ఎంపికైంది.
పోచంపల్లి, గద్వాల, గొల్లభామ చీరలు...
మిస్ వరల్డ్ పోటీలు ఆసాంతం తెలంగాణ సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబిస్తూ ముందుకు సాగుతుండగా దాన్ని మరింత విస్తరిస్తూ శనివారం టాప్ మోడల్ పోటీలు సాగాయి. ప్రపంచ ప్రఖ్యాత పోచంపల్లి వస్త్రాలు, సిద్దిపేట గొల్లభామ, గద్వాల చీరలతోపాటు లెహంగా, గాగ్రా చోలీ తదితర భారతీయ వస్త్రాలు ధరించిన అందాల భామలు.. ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేసి ఆకట్టుకున్నారు. తొలుత తెలంగాణ టాప్ డిజైనర్లు రూపొందించిన తెలంగాణ–భారతీయ సంప్రదాయ వ్రస్తాలతో క్యాట్ వాక్ చేశారు. అనంతరం టాప్ డిజైనర్లు రూపొందించిన ఆధునిక వ్రస్తాలతో రెండోసారి ర్యాంప్‌పై నడిచారు. ఈ రెండు రౌండ్లకు కలిపి న్యాయనిర్ణేతలు మార్కులు వేశారు. హైహీల్స్, పొడవాటి వ్రస్తాలు ధరించిన జపాన్ సుందరి క్యాట్‌వాక్ రౌండ్ చివర్లో అదుపుతప్పి ర్యాంప్‌పై పడిపోయింది. ఆ వెంటనే లేచి తేరుకుని వాక్ పూర్తి చేసింది.
తెలంగాణ డిజైన్లకు న్యాయ నిర్ణేతల ప్రశంసలు..
ఫ్యాషన్ ఫినాలేకు హాజరైన న్యాయ నిర్ణేతలు, ఆహూతులు.. తెలంగాణ సంప్రదాయ డిజైన్లను చూసి ప్రశంసలు కురిపించారు. పోటీదారులంతా స్థానిక చేనేతలను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించడం ఆ డిజైన్లకు, తయారీదారులకు గుర్తింపును, మార్కెటింగ్ అవకాశాలను అందిస్తుందన్నారు. తెలంగాణ చేనేత వ్రస్తాలతో డిజైన్లు చేయడం ఆనందంగా, గర్వంగా ఉందని డిజైనర్ అర్చనా కొచ్చార్ అన్నారు. దీని ద్వారా చేనేత చీరలకు ప్రపంచ ఖ్యాతి దక్కుతుందని అభిప్రాయపడ్డారు.
డిజైనర్ డ్రెస్ విజేతలు వీరే..
ఈ పోటీల్లో బెస్ట్ డిజైనర్ డ్రెస్ విజేతలుగా ఒక్కో ఖండం నుంచి ఒకరు చొప్పున నిలిచారు. ఆసియా–ఓషియానియా గ్రూప్ నుంచి న్యూజిలాండ్ సుందరి సమంతా పూల్, ఆఫ్రికా నుంచి దక్షిణాఫ్రికా ముద్దుగుమ్మ జోలైస్ జాన్సెన్ వాన్ రెన్స్‌బర్గ్, ఆమెరికా–కరీబియన్ బృందం నుంచి ప్యూర్టోరికో భామ వలేరియా పెరేజ్, యూరప్ నుంచి ఉక్రెయిన్ సుందరీమణి మారియా మెలి్నచెంకో విజేతలుగా నిలిచారు. అయితే వారు టాప్–40 పరిధిలోకి రారు.