
తెలంగాణలో జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ బ్యూటీ పాజెంట్‌లో భాగంగా ‘హెడ్ టు హెడ్ చాలెంజ్’ ఈవెంట్ కూడా పూర్తయింది. ఇందులో టర్కీ, వేల్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, జాంబియా దేశాలకు చెందిన సుందరీమణులు గెలుపొందారు. వాళ్ల పరిచయాలు..
బుద్ధవనం ప్రాజెక్ట్ వెరీ వెరీ స్పెషల్
– ఇడిల్ బిల్గెన్, మిస్ టర్కీ
మిస్ వరల్డ్ పాజెంట్‌లో భాగంగా హెడ్ టు హెడ్ ఛాలెంజ్‌లో విజేతగా నిలిచింది మిస్ టర్కీ ఇడిల్ బిల్గెన్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ – ‘‘ఈ రోజు నాకు చాలా స్పెషల్. నా దేశానికిప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గర్వంగానూ చాలా ఉత్సాహంగానూ ఉన్నాను. ఈ హెడ్ టు హెడ్ ఛాలెంజ్‌లో ముందంజలో ఉండటం మరింత ఆనందం. మహిళల భద్రత, సాధికారత, విద్య, సాంస్కృతిక గుర్తింపు, మానసిక ఆరోగ్యం, సోషల్ మీడియా ప్రభావం, వాతావరణ మార్పుల... ఇలా విభిన్నమైన టాపిక్స్‌తో హెడ్ టు హెడ్ చాలెంజింగ్ రౌండ్ గడిచింది.
ఎక్కడైనా మహిళల విజయానికి చదువు చాలా ముఖ్యమైనది. ఏ దేశంలోనైనా అభివృద్ధి, సాధికారిత రెండూ కలిసి ప్రయాణించాలి. జనాభాలో సగం మంది వెనకబడి ఉంటే మనం విజయం సాధించలేం. ఇక్కడ మహిళలు వెనుకబడి ఉండకుండా ప్రభుత్వాలు చూసుకుంటున్నాయి. సాంకేతికత, వైద్యపురోగతికి ఈప్రాంతం కేంద్రంగా ఉంది. ప్రజల ఆప్యాయత, ప్రేమ, దయాగుణం, ఇక్కడి సంస్కృతి హైలైట్ చేస్తున్నాయి. ఇవే విషయాలను వేదికపై నుంచి వినిపించాను.
తెలంగాణలోని టూరిజం నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా బుద్ధవనం ప్రాజెక్ట్ వెరీ వెరీ స్పెషల్. అక్కడ మాంక్స్ చదివే మంత్రాలు ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తాయి. నేను రేడియేషన్ అంకాలజీలో మెడిసిన్ చేస్తున్నాను. క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలలో పాల్గొంటుంటాను. ‘నేనొక వైద్యురాలిని, అంతేకాదు నేను ఒక టర్కిష్ మహిళను. మిస్ వరల్డ్‌లో టర్కిష్ మహిళల గొంతుగా నేను ఉండాలనుకుంటున్నాను’ అని వేదికపై వివరించాను.
బ్యూటీ విత్ ఎ పర్పస్‌ప్రాజెక్ట్‌లో భాగంగా రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ అవగాహనకు కృషి చేస్తున్నాను. ఒక వైద్యురాలిగా క్యాన్సర్ రోగులకు సహాయకారిగా ఉండటం నా బాధ్యత. క్రీడలు అంటే చాలా ఇష్టం. మానసిక ఒత్తిడి నుంచి విశ్రాంతి పొందడానికి క్రీడలు, జిమ్ నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. అసాధ్యం అనేది మన డిక్షనరీలో ఉండకూడాదు. ఎలాంటి సమస్య వచ్చినా దానిని అధిగమించగలను, సాధించగలను అనే ఆలోచన మనలో ధైర్యాన్ని నింపుతుంది. విజయాలను మన ముందుంచుతుంది’ అంటూ వివరించింది ఇడిల్.
యువతకు చదువు చాలా ముఖ్యం
– మిల్లీ మే ఆడమ్స్, మిస్ వేల్స్
మిస్ వరల్డ్ పాజెంట్‌లో భాగంగా హెడ్ టు హెడ్ ఛాలెంజ్ టాప్ టెన్ జాబితా యూరప్‌కుప్రాతినిధ్యం వహిస్తున్న మిస్ వేల్స్ మిల్లీ మే ఆడమ్స్ టాప్ టెన్ జాబితాలోకి చేరింది. ఈ సందర్భంగా మిల్లీ మాట్లాడుతూ – ‘‘ఈ ఫీలింగ్ చాలా గొప్పగా ఉంది. స్వతహాగా పర్యటనలు చేయడం, చారిత్రక ప్రదేశాలు సందర్శించడం అంటే నాకు చాలా ఇష్టం. వీలు చిక్కినప్పుడు గొప్ప గొప్ప కట్టడాలను సందర్శిస్తుంటాను. అందులో భాగంగా గతంలో ఇండియాకు వచ్చినప్పుడు తాజ్‌మహల్‌ని సందర్శించాను.
ఇప్పుడు ఈ మిస్ వరల్డ్ పాజెంట్‌లో భాగంగా హెరిటేజ్ టెంపుల్స్, చార్మినార్ చాలా బాగా నచ్చాయి. ఇక్కడి శిల్పనిర్మాణం అద్భుతం అనిపిస్తుంది. ట్రిప్స్ చాలా ఎంజాయ్ చేశాం. ఇక్కడి సంస్కృతితో పాటు మహిళల సాధికారిత గురించి తెలుసుకున్నాను. ప్రభుత్వాలు అందిస్తున్న రక్షణ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఫ్రీ బస్ సౌకర్యం గురించి తెలుసుకున్నాం. బ్యూటీ విత్ ఎ పర్పస్ హెడ్ టు హెడ్ ఛాలెంజ్ రౌండ్‌లో 20 మందితో పోటీపడ్డాను. పోటీలో నా వర్క్స్ గురించి, చదువుప్రాముఖ్యత గురించి అడిగారు. నేను వేల్స్‌లో మెడిసిన్ చదువుతున్నాను.
స్ట్రీట్ డాక్టర్స్ అనే జాతీయసంస్థతో కలిసి పనిచేయడంతో పాటు, యువతకు చదువు ఎంత అవసరమో వివరిస్తూ, పాఠశాల విద్య పట్ల అవగాహన కల్పిస్తున్నాను. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించడం, అందాల పోటీల ద్వారా నిధుల సేకరించి, ప్రపంచవ్యాప్తంగా వెనుకబడిన పిల్లలకు మద్దతుగా నిలుస్తున్నాను. నా విజయానికి ఇవన్నీ ఉపకరించాయి. యువతులు, బాలికలకు తమపై తమకు పూర్తి విశ్వాసం ఉండాలి. అప్పుడు ప్రపంచంలో ఏదైనా సాధించడానికి మనకు సహకారం అందుతుంది. కోరుకున్న జీవితాన్ని గడపటానికి మహిళకు సాధికారతతో పాటు దయ, వినయం కూడా ఉంటే ఎక్కడ ఉన్నా రాణిగా వెలిగిపోతాం’’ అంటూ అందమైన నవ్వుతో సమాధానమిచ్చింది మిస్ వేల్స్.
పెళ్లి తప్పించుకుని మెడిసిన్ చదివా
ఫేత్ వాలియా, మిస్ జాంబియా
‘‘వృత్తిరీత్యా డాక్టర్‌ని. నాకు ఒక తమ్ముడు. మా అమ్మ పాస్టర్. నాన్న కార్పెంటర్. మేము లుసాకాలో ఉంటాం. నాకు ముందునుంచీ అందాల పోటీలంటే ఇష్టం. నాకు పదిహేనేళ్లున్నప్పుడు మొదటిసారిగా అందాల పోటీల్లో పాల్గొన్నాను. గెలిచాను కూడా! బ్యూటీ అంటే నా దృష్టిలో ఆత్మవిశ్వాసం. మా దగ్గర బాల్య వివాహాలు ఎక్కువ. నన్నూ బాల్య వివాహానికి సిద్ధం చేసింది మా సమాజం. అయితే బాగా చదువుకుని మా దేశంలోని ఆడపిల్లల తలరాతను మార్చాలి అనుకునేదాన్ని.
మా ఆర్థిక పరిస్థితి బాలేనందువల్ల నా పదహారవ ఏట నాకు పెళ్లి చేసేయాలనే ఒత్తిడి తెచ్చారు మా కమ్యూనిటీ పెద్దలు. కానీ నేను తలవంచలేదు. ఆ పెళ్లిని తప్పించుకున్నాను. కష్టపడి మెడిసిన్ చదివాను. అప్పుడు గనుక నేను ఆ తెగువ చూపించక పోయుంటే ఈ రోజు మీతో ఇలా మాట్లాడే అవకాశం వచ్చేది కాదు. నా ఈ కథను ప్రపంచానికి చెప్పి, ఆడపిల్లలకు మానసిక స్థయిర్యాన్ని, స్ఫూర్తిని పంచడానికి అందాల పోటీలు ఓ వేదికగా కనిపించాయి. మన కథను వినిపించే, మన వ్యక్తిత్వాన్ని తెలియజేసే అవకాశాన్నిస్తాయి. అందుకే ఎలాగైనా ఈ ప్లాట్‌ఫామ్ దాకా రావాలనుకున్నాను. వచ్చాను.
వాయిస్ ఆఫ్ ఫెయిత్
జీవితంలో గెలవడానికి ఉపయోగపడేవి చదువు, నైపుణ్యం మాత్రమే. నా బ్యూటీ విత్ ఎ పర్పస్ కూడా అదే! ‘వాయిస్ ఆఫ్ ఫేత్’ అనే ఫౌండేషన్ ద్వారా అట్టడుగు వర్గాల పిల్లలకు చదువుప్రాధాన్యాన్ని తెలియజెబుతున్నాను. సేంద్రియ సాగు విధానాలను నేర్పి.. వాళ్ల సుస్థిర ప్రగతికి పాటుపడే ప్రయత్నం చేస్తున్నాను. సాంకేతిక రంగంలో వాళ్లు నైపుణ్యం సాధించేలా శిక్షణనిప్పిస్తున్నాను. ఈ పనులన్నీ ఎలా చేస్తున్నానో ‘హెడ్ టు హెడ్ చాలెంజ్ (బ్యూటీ విత్ ఎ పర్పస్)’ రౌండ్‌లో ప్రెజెంట్ చేశాను.
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్, హెల్త్, సాంకేతిక రంగాల్లో తెలంగాణ ప్రపంచంతో పోటీ పడుతున్నట్టుంది. అధిక జనాభా, తక్కువ భూభాగం లాంటి సవాళ్లతో కూడా ఇండియా సాధించిన ఈ ప్రగతి చూస్తుంటే ముచ్చటేస్తోంది. ప్రజల అవసరాల పట్ల ప్రభుత్వాలకున్న చిత్తశుద్ధి ప్రశంసనీయం. తెలంగాణ సంస్కృతికి, ఆతిథ్యానికీ నేను ఫిదా అయ్యాను. మా దేశం కూడా ఈ స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు మిస్ జాంబియా ఫేత్ వాలియా.
తెలంగాణ మినీ ఇండియా
– అనా లీజ్ నాన్సాన్, మిస్ ట్రినిడాడ్ అండ్ టొబాగో
‘‘మాది పెద్ద కుటుంబం. మేము మొత్తం ఎనిమిది మంది పిల్లలం. అందరిలోకి నేనే పెద్ద. అందుకే అన్ని విషయాల్లో నా తోబుట్టువులకు నేనో మార్గదర్శిగా ఉండాలని కోరుకునేదాన్ని! మా నాన్న ఇంజినీర్, అమ్మ గృహిణి. చదువు విషయంలో నాకు మా నాన్నే స్ఫూర్తి. ఇంగ్లండ్‌లో సివిల్ ఇంజినీరింగ్ చదివాను. ఇప్పుడు మాస్టర్స్ చేయాలనుకుంటున్నాను. పర్యావరణహిత నిర్మాణాలు నా లక్ష్యం. నేను అథ్లెట్ కూడా! ఫుట్‌బాల్ ప్లేయర్‌ని. బ్యూటీ పాజెంట్‌లో పాల్గొనడానికి నాకు ప్రేరణ.. ఇందులోని ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ సెగ్మెంట్.
ఇందులో నేను నమ్మే సుస్థిర అభివృద్ధి, హ్యాపీ లివింగ్ వంటివాటి గురించే చెప్పే అవకాశం దొరుకుతుందని అనుకున్నాను. నా బ్యూటీ విత్ ఎ పర్పస్ కూడా అదే! ‘ద రిపుల్ ఎఫెక్ట్’ అనే సంస్థను స్థాపించాను. స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ ద్వారా సస్టెయినబుల్ కమ్యూనిటీస్‌ని ఏర్పాటు చేయడమే దీని లక్ష్యం. ముఖ్యంగా నిస్సహాయ మహిళల సాధికారత, పిల్లల చదువు కోసం పనిచేస్తున్నాను. మా దేశానికి వలసలు ఎక్కువ. ఆ పిల్లలకు స్థానిక భాషలు, ఇంగ్లిష్ వంటివి రాక చదువుకు దూరమవుతున్నారు.
అందుకే ట్రినిడాడ్‌లోని ‘విస్‌డమ్ సియోరామ్’ అనే ఓ టెక్నాలజీ కంపెనీ సహాయంతో ఆ పిల్లలకు పలు భాషలు, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించే ప్రయత్నం చేస్తున్నాను. నేను అథ్లెట్‌ని కూడా కాబట్టి స్పోర్ట్స్ మీదా ఫోకస్ చేస్తున్నాను. ఆటలతో శారీరక దృఢత్వమే కాదు ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా అలవడుతుంది. అందుకే పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించే ప్రయత్నమూ చేస్తున్నాను. ముఖ్యంగా స్విమ్మింగ్‌లో. ఎందుకంటే అది లైఫ్ స్కిల్ కాబట్టి. స్థానిక వనరులతో గ్రీన్ బిల్డింగ్ టెక్నిక్స్‌ని చెప్పే పాడ్‌కాస్ట్ చానెల్‌నూ స్టార్ట్ చేశాను. ఇందులో ఇంజినీర్స్, ఆర్కిటెక్ట్స్, పర్యావరణవేత్తలను ఇంటర్వ్యూ చేస్తుంటాను. అంతేకాదు మొక్కలు నాటే కార్యక్రమాలూ నిర్వహిస్తుంటాను. ఇవన్నీ నా బ్యూటీ విత్ ఎ పర్పస్‌లో భాగాలే!
కలర్‌ఫుల్‌గా..
ఇండియా గురించి విన్నాను. కానీ తెలంగాణ స్టేట్ గురించి ఎప్పుడూ వినలేదు. తెలంగాణ మినీ ఇండియాలా అనిపించింది. మాలాగే ఇక్కడా భిన్న మతాలు, భిన్న సంస్కృతీసంప్రదాయాలు కనిపించాయి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. ఇక్కడి ఫుడ్ స్పైసీగా ఉన్నప్పటికీ చాలా బాగుంది. సో డిలీషియస్. మళ్లీ మళ్లీ ఇక్కడికి రావాలనిపించేలా ఉంది తెలంగాణ ఆతిథ్యం! చాలా హ్యాపీ!’’ అన్నారు అనా లీజ్ నాన్సాన్
ఇంటర్వ్యూలు: నిర్మలారెడ్డి, సరస్వతి రమ