
మిస్ వరల్డ్ అంటే అందమొక్కటే కాదు, అందమైన మసను కూడా..!! మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఏదో ఒక సామాజిక సేవ అంశాన్ని, లక్ష్యాన్ని కొనసాగిస్తున్న వారే. ఇందులో భాగంగానే నగరంలోని సరూర్ నగర్ విక్టోరియా హోమ్‌లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌ను సందర్శించి అక్కడి విద్యార్థుల లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. వాటిని చేరుకోవడానికి అవసరమైన సూచనలిచ్చారు.
ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ 2025 పోటీదారులు విక్టోరియా హోమ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యార్థులతో గురువారం ముచ్చటించారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న 107 మంది పోటీదారులతో పాటు మాజీ మిస్ వరల్డ్ క్రిస్టినా కలసి విక్టోరియా హోమ్‌ను సందర్శించి ప్రభుత్వ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు. కష్టపడే తత్వం, విజ్ఞాన సముపార్జనతో పాటు విద్యలో రాణిస్తేనే భవిష్యత్తు బాగుంటుందని చిన్నారులకు వివరించారు.
ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే పటిష్టమైన కలలు ఉంటేనే తమ లక్ష్యాలను చేరుకుంటారని అన్నారు. అనంతరం విక్టోరియా హోమ్ విద్యార్థినులకు బహుమతులతో పాటు వారికి నిత్య జీవితంలో ఉపయోగపడే వస్తువులను మిస్ వరల్డ్ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా విక్టోరియా హోమ్ విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను అలకించి అభినందించారు. అందాల తారలు.. ముచ్చటపడి ఆ చిన్నారులతో కలిసి ఆడారు.
విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మిస్ వరల్డ్ చైర్మన్ మోర్లే, పర్యాటక శాఖ డైరెక్టర్ హనుమంతు, రాచకొండ సీపీ, ఎస్సీ వెల్ఫేర్ అడిషనల్ డైరెక్టర్ ఉమాదేవి శ్రీనివాస్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్‌లతోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
(చదవండి: రానూ.. బొంబైకి రానూ.. విభిన్న కళలతో అలరించిన సుందరీమణులు)