
రాంచీ: బిహార్ ఎన్నికల వేళ ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం)బాంబు పేల్చింది. పక్క రాష్ట్రం బిహార్‌లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రంగా ఆరు సీట్లలో పోటీ చేయనున్నట్లు జేఎంఎం శనివారం ప్రకటించింది.
అదేవిధంగా, ప్రస్తుతం జార్ఖండ్‌లో కాంగ్రెస్, ఆర్జేడీలతో కొనసాగుతున్న పొత్తుపై బిహార్ ఎన్నికల అనంతరం సమీక్షిస్తామని కూడా స్పష్టం చేసింది. జేఎంఎం జనరల్ సెక్రటరీ సుప్రియో భట్టాచార్య మీడియా సమావేశంలో ఈ విషయాలను ప్రకటించారు. బిహార్‌లో తమకు 12 సీట్లు కేటాయించాలని ఇండియా కూటమిని జేఎంఎం కోరింది. స్పందన లేకపోవడంతో స్వయంగా పోటీకి దిగాలని నిర్ణయించుకున్నామన్నారు.