
ఈ అన్నదమ్ములు... సినిమాల గురించి మాట్లాడుకున్నంత ఇష్టంగా ఏఐ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటారు. అవి కాలక్షేప కబుర్లు కావు. ఈ కాలానికి అవసరమైన కబుర్లు. ‘ఏఐ టెక్నాలజీలో మనం ఎక్కడ ఉన్నాం? మనం చేయాల్సింది ఏమిటి?’ అనేది వారి మాటల సారాంశం. కేవలం మాటలకే పరిమితం కాకుండా ‘169పై. ఏఐ’ స్టార్టప్‌తో ఏఐ స్టార్స్‌గా పేరు తెచ్చుకున్నారు రజత్, చిరాగ్...
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన రజత్ ఆర్య, అతని తమ్ముడు చిరాగ్ ఆర్యకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అనేది చాలా ఇష్టమైన సబ్జెక్ట్. ఆ రంగంలో వస్తున్న మార్పుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేవారు. ఆ ఆసక్తే వారిని ఏఐ స్టార్టప్ కంపెనీ ‘169పై. ఏఐ’ స్థాపించేలా చేసింది.
అమెరికాలో కస్టమర్‌ల కోసం కొన్ని బ్లాక్‌చైన్ సొల్యూషన్స్‌ను డెవలప్ చేసి, చిన్నపాటి సాఫ్ట్‌వేర్ బిజినెస్ నిర్మించడంలో ఈ సోదరులకు కొంత అనుభవం ఉంది. రెండు సంవత్సరాల క్రితం ప్రసిద్ధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘ఓపెన్ ఏఐ’ సీయివో సామ్ ఆల్ట్‌మాన్ మన దేశానికి వచ్చినప్పుడు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ బిల్డ్ చేయడం గురించి మాట్లాడారు. ఈ నేపథ్యంలో ‘మనం కొత్తగా ఏంచేయవచ్చు’ అని ఆలోచించారు ఆర్య బ్రదర్స్.
ఇంటర్‌నెట్‌లో వెస్ట్–ఒరియెంటెడ్ సమాచారానికి బదులుగా మరింత దేశీయంగా ఏదైనా చేయడానికి ఒక అవకాశం ఉందని గ్రహించారు. అలా....‘169పై. ఏఐ’ స్టార్టప్ మొదలైంది. స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
ఈ స్టారప్‌కు తొలి యూజర్....ఇస్రో!
‘169పై. ఏఐ’ క్రియేట్ చేసిన పీడీఎఫ్ ఏజెంట్‌ను ‘ఇస్రో’ పరీక్షించి పచ్చ జెండా ఊపింది. టన్నుల కొద్దీ డేటా ఉన్న ‘ఇస్రో’కి ఉపయోగపడేలా పీడీఎఫ్ ఏజెంట్‌ను క్రియేట్ చేశారు. తాము సృష్టించిన ప్రోగ్రామ్ టేబుల్స్, డాక్యుమెంట్లు, చార్ట్‌లు జనరేట్ చేయడానికి ఇది యూజర్‌లకు ఉపయోగపడుతుంది. పదకొండు మందితో కూడిన ‘169పై. ఏఐ’ బృందం ఎడ్యుకేషనల్ సోల్యూషన్‌లను డెవలప్ చేస్తోంది.
బిహార్‌లోని ప్రభుత్వ బడుల కోసం ఎడ్యుకేషనల్ మెటీరియల్‌ను క్రియేట్ చేయడానికి ఎన్‌సీఈఆర్‌టీ టెక్ట్స్‌బుక్స్ డేటాను ఉపయోగిస్తున్నారు. ‘ఆర్టిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఖరీదు అనే భావన ఉంది. ఈ సాంకేతికత అందరికీ అందుబాటులో ఉండాలి. రైతు నుండి సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించాలి. ఎందుకంటే ఏఐ వారి పనిని సులభతరం చేస్తుంది. మా ఏఐ మోడల్ విదేశీ ఏఐ మోడల్స్‌లాగా డబ్బు తీసుకునేది కాదు. ఇది అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంటుంది.
ఇక స్టార్టప్ పేరు విషయానికి వస్తే 13 సంఖ్య స్క్వేర్, పై కన్‌స్టంట్ నుంచి స్ఫూర్తి పొందాం’ అంటున్నాడు కంపెనీ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ చిరాగ్ ఆర్య. పాతదారిలో నడవడం విశేషమేమీ కాదు. అయితే పాత దారిలో నడుస్తూనే కొత్త దారి గురించి ఆలోచించడం, అన్వేషించడమే విశేషం. అప్పుడే ‘169పై. ఏఐ’ రూపంలో కొత్త ఆవిష్కరణలు ప్రజలకు పరిచయం అవుతాయి.
మన దేశానికి తనదైన ఏఐ మోడల్ లేకపోవడం నన్ను ఎప్పుడూ నిరాశకు గురి చేసేది. మనం విదేశీ ఏఐ మోడల్స్ మీద ఎక్కువగా ఆధారపడుతున్నాం. ఏఐ సాంకేతికతకు సంబంధించి విదేశాలపై ఎక్కువగా ఆధారపడకూడదు అనే ఆలోచన నుంచే స్టార్టప్ ఆలోచన వచ్చింది. మన ఫోన్‌లో ఉన్న అత్యధిక యాప్స్ విదేశాల నుంచి వచ్చినవే. మనకంటూ స్వంతమైన ΄్లాట్‌ఫామ్ లేదు. భవిష్యత్తులో మనం ఏ దేశం మీద ఆధారపడకుండా ఉండడానికి మా స్టార్టప్ ఒక ప్రయత్నం.
– రజత్ ఆర్య, 169పై. ఏఐ ఫౌండర్, సీయివో
(చదవండి: మూడు నెలలకు మించి బతకడన్నారు.. కట్‌చేస్తే ఏకంగా వందేళ్లకు పైగా..)