
దేశంలో అధికం నుంచి అత్యధిక హీట్ రిస్క్ కేటగిరీలో 57 శాతం జిల్లాలు
మొత్తం జనాభాలో 76 శాతం మందికి ఉష్ణోగ్రతల ముప్పు
‘కౌన్సిల్ ఆన్ ఎనర్జీ ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్’ అధ్యయనంలో వెల్లడి
శిలాజ ఇంధనాల వాడకం నానాటికీ పెరిగిపోతుండడం, తద్వారా వాతావరణ మార్పులు సంభవిస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. భారత్ సైతం ఇందుకు మినహాయింపు కాదు. దేశంలో 57 శాతం జిల్లాలు అధికం నుంచి అత్యధిక హీట్ రిస్క్ కేటగిరీలో ఉన్నట్లు ఢిల్లీకి చెందిన వాతావరణ సంస్థ కౌన్సిల్ ఆన్ ఎనర్జీ ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్(సీఈఈడబ్ల్యూ) వెల్లడించింది. దేశంలోని మొత్తం జనాభాలో ఏకంగా 76 శాతం మంది ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతల ముప్పును ఎదుర్కొంటున్నట్లు తేల్చిచెప్పింది.
ఈ మేరకు మంగళవారం ఒక నివేదిక విడుదల చేసింది. ఢిల్లీ, మహారాష్ట్ర, గోవా, కేరళ, గుజరాత్, రాజస్తాన్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సహా పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో హీట్ రిస్క్ అత్యధికంగా ఉన్నట్లు తెలియజేసింది. గత పదేళ్లలో అత్యధిక వేడి కలిగిన పగటి దినాల కంటే అత్యధిక వేడి కలిగిన రాత్రి దినాల సంఖ్య వేగంగా పెరిగినట్లు వివరించింది.
⇒ అధ్యయనంలో భాగంగా సీఈఈడబ్ల్యూ సంస్థ 734 జిల్లాలకు సంబంధించిన హీట్ రిస్క్ ఇండెక్స్(హెచ్‌ఆర్‌ఐ)ను అభివృద్ధి చేసింది. ఇందుకోసం 1982 నుంచి 2022 వరకు.. 40 ఏళ్ల వాతావరణ గణాంకాలు, ఉపగ్రహా చిత్రాలు ఉపయోగించుకుంది. ఉష్ణోగ్రతలు, వాతావరణ పరిస్థితులు, జల వనరులు, భూవినియోగం, పచ్చదనం తదితర అంశాలను అధ్యయనం చేసింది.
⇒ జనాభా, భవనాలు, ఆరోగ్య, సామాజిక–ఆర్థిక అంశాలు, పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు, వాతావరణంలో తేమ వంటి అంశాలను సైతం పరిగణనలోకి తీసుకుంది.
⇒ 734 జిల్లాలకు గాను 417 జిల్లాలు హై నుంచి వెరీ హై రిస్క్ కేటగిరీల్లో ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. ఇందులో 151 జిల్లా హై రిస్క్, 266 జిల్లాలు వెరీ హై రిస్క్ విభాగంలో ఉన్నాయి. 201 జిల్లాలు సాధారణ, 166 జిల్లాలు తక్కువ లేదా అతి తక్కువ హీట్ రిస్క్ విభాగాల్లో నిలిచాయి.
⇒ ఉష్ణోగ్రతలు సాధారణం లేదా తక్కువగా ఉన్నట్లయితే దాని అర్థం వేడి వల్ల ముప్పు లేనట్లు కాదని, సీఈఈడబ్ల్యూ స్పష్టంచేసింది. ఇతర జిల్లాల కంటే కొంత తక్కువగా ఉన్నట్లు మాత్రమే భావించాలని పేర్కొంది.
⇒ దేశంలో అధిక ఉష్ణోగ్రత కలిగిన రోజులు పెరుగుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన రోజులు అంతకంటే ఎక్కువగా పెరుగుతుండడం గమనార్హం. అంటే మనుషులకు ముప్పు సైతం అదే స్థాయిలో పెరుగుతున్నట్లే లెక్క.
⇒ ఉష్ణోగ్రతలు అత్యధికంగా మనుషులు తట్టుకోలేరు. అది ప్రమాదకరమే. శారీరకంగా, మానసికంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. పల్లెలతో పోలిస్తే పట్టణాలు, నగరాల్లో అధిక ఉష్ణోగ్రత కలిగిన రాత్రి దినాలు అధికంగా నమోదవుతున్నాయి. అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్టే ఇందుకు కారణం.
⇒ 10 లక్షలకుపైగా జనాభా ఉన్న జిల్లాలతోపాటు ముంబయి, బెంగళూరు, భోపాల్, జైపూర్, ఢిల్లీ, చెన్నై వంటి నగరాల్లో అధిక ఉష్ణోగ్రత కలిగిన రాత్రి దినాల సంఖ్య భారీగా పెరిగింది.
⇒ చల్లగా ఉండే హిమాలయా ప్రాంతాల్లోనూ అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన పగటి, రాత్రి రోజుల సంఖ్య పెరుగుతోంది. సున్నితంగా ఉండే పర్వత ప్రాంత భౌగోళిక స్థితిగతులను ఈ పరిణామం తీవ్రంగా ప్రభావితం చేయనుంది.
⇒ జమ్మూకశీ్మర్, లద్దాఖ్‌లో అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన పగటి, రాత్రి రోజుల సంఖ్య 15 చొప్పున పెరిగింది. ఈ ప్రతి ఏటా వేసవిలో ఈ పెరుగుదల కనిపిస్తోంది.
⇒ ఉత్తర భారతదేశంలో వేసవి తేమ గత పదేళ్లలో 30–40 శాతం నుంచి 40–50 శాతం పెరిగింది.
⇒ అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా 2030 నాటికి 3.5 కోట్ల ఉద్యోగాలను కోల్పోతామని, జీడీపీలో 4.5 శాత తగ్గుదల నమోదవుతుందని సీఈఈడబ్ల్యూ అధ్యయనం అంచనా వేసింది.
⇒ ఇండియాలో 2024లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా 45,000కుపైగా గుండెపోటు కేసులు నమోదయ్యాయి. 159 మరణాలు సంభవించాయి. ఇవన్నీ అధికారికంగా నమోదైన గణాంకాలే. నమోదు కానివి ఇంకెన్నో ఉంటాయి. – సాక్షి, నేషనల్ డెస్క్