ఓటీటీ వీక్షకులు @ 60 కోట్లు | 60 crore audience stream shows | Sakshi
Sakshi News home page

ఓటీటీ వీక్షకులు @ 60 కోట్లు

Oct 6 2025 5:43 AM | Updated on Oct 6 2025 5:44 AM

60 crore audience stream shows

2024తో పోలిస్తే 9.9% పెరుగుదల నమోదు దేశ జనాభాలో 41% ఆన్‌లైన్‌ వీడియో వీక్షకులే

కనెక్టెడ్‌ టీవీ ప్రేక్షకుల సంఖ్య సుమారు 13 కోట్లు

సకుటుంబ సపరివార సమేతంగా... టీవీ ముందు కూర్చుంటున్నారు. అది కేబుల్‌ కనెక్షన్‌ టీవీ కాదు.. ‘కనెక్టెడ్‌ టీవీ’. అందులో తమకు నచ్చిన సినిమా లేదా వెబ్‌ సిరీస్‌ లేదా షో చూస్తున్నారు. సంప్రదాయ టీవీ చానళ్లలో కాదు.. ఓటీటీ వేదికల్లో. ఇదే ఇప్పుడు ట్రెండ్‌. ఇది కరోనా తరవాత రికార్డు స్థాయిలో దేశమంతా పాకేసింది. దేశంలో ఓటీటీ చూస్తున్న ప్రేక్షకుల సంఖ్య రికార్డు స్థాయిలో 60 కోట్లకు ఎగబాకిందన్న అంచనాలే ఇందుకు నిదర్శనం. అంటే దేశ జనాభాలో 40 శాతానికిపైగా ఓటీటీలకు అలవాటుపడ్డారన్నమాట.

టీవీ కొనాలంటే.. వందసార్లు ఆలోచించడం లేదు. హాల్లోకి సరిపోయే పెద్ద సైజు టీవీని.. అది కూడా స్మార్ట్‌ టీవీనే కొనేస్తున్నారు. ‘మార్డోర్‌ ఇంటెలిజెన్స్‌’ అంచనా ప్రకారం 2025లో దేశీయ స్మార్ట్‌ టీవీ మార్కెట్‌ విలువ 22.39 బిలియన్‌ డాలర్లు. 2023లో ఇది సుమారు 11 బిలియన్‌ డాలర్లే. స్మార్ట్‌ టీవీల కొనుగోళ్లు ఎంతలా పెరిగాయో చెప్పడానికి ఈ అంకెలే నిదర్శనం. అంత ఖరీదైన టీవీ కొన్నాక.. సాధారణ కేబుల్‌ టీవీ ఒక్కటే ఉంటే ఏం బాగుంటుంది? అందుకే, ఏదో ఒకటి లేదా అంతకుమించి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ తీసేసుకుంటున్నారు. అంతే, ఎంచక్కా ఇక సకుటుంబ సపరివార సమేతంగా సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, షోలు చూస్తున్నారు. దేశంలో ఇటీవలి కాలంలో ఈ ధోరణి పెరిగింది.

కనెక్టెడ్‌ టీవీలో..: ఒకప్పుడు కేబుల్‌ టీవీ ప్రతి ఇంటా సర్వసాధారణంగా ఉండేది. ఇప్పుడు దాని స్థానాన్ని కనెక్టెడ్‌ టీవీ ఆక్రమిస్తోంది. కనెక్టెడ్‌ టీవీ అంటే ఇంటర్నెట్‌కి కనెక్ట్‌ అయ్యే టీవీ. ఇది మధ్య తరగతి, ఆపై స్థాయి కుటుంబాల్లో సర్వసాధారణం అయిపోయింది. మీడియా కన్సల్టింగ్‌ సంస్థ ఆర్మాక్స్‌ మీడియా ‘ఓటీటీ ఆడియన్స్‌ రిపోర్ట్‌ 2025’ ప్రకారం.. కనెక్టెడ్‌ టీవీ వీక్షకుల సంఖ్య 2024లో 6.97 కోట్లు మాత్రమే ఉండేది. 2025లో అది ఏకంగా 12.92 కోట్లకు పెరిగింది. అంటే.. దాదాపు రెట్టింపు అయిందన్నమాట.

ఆకట్టుకునే కంటెంట్‌
అమెజాన్‌ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్‌ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విభిన్నమైన కంటెంట్‌తో వెబ్‌సిరీస్‌లు, సినిమాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కంటెంట్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ఆర్మాక్స్‌ అంచనా ప్రకారం.. దేశంలో ఓటీటీ వీక్షకుల (నెలలో కనీసం ఒక్కసారైనా ఓటీటీ వీడియో చూసినవారు) సంఖ్య 60 కోట్లకుపైనే. 2024తో పోలిస్తే ఇది దాదాపు 10 శాతం ఎక్కువ. దేశ జనాభాలో ఇది 40 శాతానికిపైనే. వీక్షకులు పెరగడంతో ఓటీటీల్లో దేశీయ భాషల్లో వచ్చే వెబ్‌సిరీస్‌ల సంఖ్య కూడా పెరుగుతోంది. ఓటీటీల్లోనే విడుదల చేసే సినిమాలూ పెరుగుతున్నాయి. సెలవు రోజుల్లోనూ... రాత్రుళ్లు భోజన సమయాల్లోనూ కుటుంబ సభ్యులతో అమెజాన్‌ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, ఆహా, జీ5, సోనీ లివ్‌.. ఇలాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో నచ్చిన సినిమా లేదా రియాలిటీ షో లేదా వెబ్‌సిరీస్‌ చూడటం సర్వసాధారణం అయిపోయింది.

దేశంలో ఓటీటీ చందాదారుల సంఖ్య (సుమారుగా)
⇒ జియో హాట్‌స్టార్‌ 30 కోట్లు
⇒ అమెజాన్‌ ప్రైమ్‌ 2.8 కోట్లు
⇒  నెట్‌ఫ్లిక్స్‌ 1.23 కోట్లు

ఆర్మాక్స్‌ మీడియా నివేదిక ప్రకారం.. 2025 జనవరి–జూన్  మధ్య ప్రసారమైన ఒరిజినల్స్‌లో వీక్షకులు అత్యధికంగా చూసినవి వెబ్‌ సిరీస్‌లే. వీక్షకుల పరంగా టాప్‌–50 
ఒరిజినల్స్‌లో 80 శాతం వాటా వెబ్‌ సిరీస్‌లు కైవసం చేసుకోవడం విశేషం. ఆ తరవాతి స్థానంలో సినిమాలు, రియాలిటీ షోలు ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement