మలయాళ సినిమాలు అనగానే చాలామందికి థ్రిల్లర్సే గుర్తొస్తాయి. కానీ అంతకు మించినవి చాలానే ఉన్నాయి. అలాంటి ఓ మూవీనే 'కుంబలంగి నైట్స్'. కేరళలోని ఓ మత్స్యకార పల్లెలో జరిగే స్టోరీ ఇది. చూస్తున్నంతసేపు జీవితం కళ్లముందు కనిపిస్తుంది. గుండెని మెలిపెట్టేస్తుంది. ప్రేమలో పడేలా చేస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదో ఆణిముత్యం. అంతకంటే పెద్ద పదమే ఉన్నా దానితోనూ పోల్చొచ్చు. అంతటి అద్భుతమైన ఈ మూవీ సంగతేంటి అనేది రివ్యూలో చూద్దాం.
కథేంటి?
కేరళలోని కుంబలంగి గ్రామం. ఊరి చివరన ఓ సగం కట్టిన ఇల్లు. అందులో షాజీ, బోనీ, బాబీ, ఫ్రాంకీ అనే నలుగురు అన్నదమ్ములు. ఒకరంటే ఒకరికి పడదు. ఎవరూ ఏ పని చేయరు. ఇంట్లో ఆడవాళ్లు లేకపోతే ఎలా ఉంటుందో వీళ్ల జీవితం అలానే తయారవుతుంది. పెద్దవాడైన షాజీ(సౌబిన్ షాహిర్).. తన స్నేహితుడు ఓ రోజు చనిపోవడంతో బిడ్డతల్లి అయిన అతడి భార్యకు తన ఇంట్లో ఆశ్రయమిస్తాడు. రెండో వాడైన బోనీ(శ్రీనాథ్ బసి) ఓ విదేశీయురాలితో ప్రేమలో పడతాడు. మూడో వాడైన బాబీ(షేన్ నిగమ్).. అదే ఊరికి చెందిన బేబీ(అన్నా బెన్)ని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతాడు. ఇలా అన్నదమ్ముల జీవితాల్లోకి వచ్చిన మహిళల కారణంగా ఈ కుటుంబంలో ఎలాంటి మార్పులొచ్చాయి? అన్నదమ్ములు చివరకు ఎలా ఒక్కటయ్యారు? అనేదే స్టోరీ.

ఎలా ఉందంటే?
ఎంత పెద్ద హిట్ సినిమా అయినా ఏదో ఓ విషయంలో అసంతృప్తిగా అనిపిస్తూ ఉంటుంది. కానీ 'కుంబలంగి నైట్స్' చూసిన తర్వాక కంప్లీట్ మూవీ చూశాం అనిపిస్తుంది. ఎందుకంటే మొదటి సీన్ నుంచి చివరి సీన్ వరకు అద్భుతమైన దృశ్యకావ్యంలా అనిపిస్తుంది. మనం కూడా కుంబలంగి అనే ఊరిలో వాళ్లతో పాటు ఉన్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. మూవీ చూస్తున్నంతసేపు నవ్వుతాం, ప్రేమిస్తాం, ఏడుస్తాం, బాధపడతాం, భావోద్వేగానికి గురవుతాం. అంతలా మిమ్మల్ని కన్నీళ్లు పెట్టిస్తుంది.
సినిమా ఫస్టాప్ అంతా కూడా పాత్రలు, వాటి స్వభావాలే చూపిస్తారు. సెకండాఫ్‌కి వచ్చేసరికి అసలు కథ మొదలవుతుంది. పాత్రల మధ్య సంఘర్షణ పీక్ స్టేజీకి వెళ్తుంది. అన్నదమ్ములంతా ఒక్కడవడంతో ముగుస్తుంది. అయితే ఈ మూవీలో స్టోరీగా చూస్తే.. ఏముందా అనిపిస్తుంది. కానీ కథనం(స్క్రీన్ ప్లే) చూస్తే మాత్రం వావ్ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా సాధారణ సన్నివేశాలకు కూడా ముగింపు ఇచ్చిన తీరు కట్టిపడేసేలా ఉంటుంది.
స్టోరీ మధ్యలో వచ్చే షమ్మి పాత్ర అయితే హైలైట్. చాలా ఇళ్లలో పురుషాధిక్యత చూపించే మగాళ్లకు ఇది ప్రతీక. వెకిలిగా నవ్వుతూ అందరిని చులకనగా చూసే ఈ పాత్రని సైకోలా చూపించారు. తన పంతం నెగ్గించుకోవడానికి ఇంట్లోని మహిళల్ని కట్టిపడేసి, బాబీ అన్నదమ్ములతో కలబడతాడు. వాళ్లందరూ షమ్మిని బంధించి.. ఆడవాళ్లని విడిపిస్తారు. అయితే షమ్మికున్న మానసిక జాడ్యం ఆ పాత్రదా? సమాజంలో కొనసాగుతున్న పురుషాహంకారాన్ని ప్రతిబింబిస్తుందా? అనేది అర్థం చేసుకున్నోడికి అర్థం చేసుకున్నంత.

షమ్మి.. తనని తాను మగాడు అనుకుంటాడు. తను చెప్పిందే అందరూ వినాలి అన్నట్లు పవర్తిస్తుంటాడు. ఇతడికి పూర్తి వ్యతిరేకంగా షజీ పాత్ర ఉంటుంది. ఆడదిక్కు లేని ఇంటి బాధ్యతల్ని తన భుజానేసుకుని, తమ్ముళ్లకు తల్లి లేని లోటు రాకుండా చూసుకుంటూ ఉంటాడు. ఎలాంటి అహంకారం ఉండదు. తప్పు జరిగిందని తెలిసి ఆడదాన్ని కాళ్లమీద పడతాడు. తన వల్ల జరిగిన తప్పుని సరిదిద్దుకునేందుకు చేయాల్సిందంతా చేస్తాడు. కానీ ఎప్పుడూ నేను మగాడిని అనే అహంకారం ప్రదర్శించడు. తనలో బాధని బయటపెట్టలేక కనీసం ఏడుపు కూడా రాకపోయేసరికి.. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లమని తమ్ముడిని అడుగుతాడు. చివరకు సైకియాట్రిస్ట్ దగ్గరకెళ్లి తనివితీరా ఏడ్చి బాధనంతా పోగట్టుకుంటాడు. తెరపై షజీ పాత్ర కన్నీళ్లు పెట్టుకోవడం ఏమో గానీ మన కళ్లు కూడా చెమ్మగిల్లుతాయి.
ఈ సినిమాలో కథ బాగుంటుంది. సినిమాటోగ్రఫీ ఇంకా బాగుంటుంది. సంగీతం హృద్యంగా ఉంటుంది. క్లైమాక్స్ కడుపు నింపేస్తుంది. కేరళ అందాల దగ్గర నుంచి చేపల పట్టడం వరకు అన్నీ నచ్చేస్తాయి. అర్జెంట్‌గా మనం కూడా కుంబలంగి గ్రామానికి వెళ్లిపోవాలి అనిపించేంతలా నచ్చేస్తుంది. అలానే షజీగా చేసన సౌబిన్ షాహిర్, బోనీగా చేసిన శ్రీనాథ్ బసి, బాబీగా చేసిన షేన్ నిగమ్, ఫ్రాంకీగా చేసిన మ్యాథ్యూ థామస్, బేబీగా చేసిన అన్నా బెన్.. ఇలా ప్రతి పాత్ర మనకు కొన్నాళ్ల పాటు గుర్తుండిపోతుంది. వీళ్లందరి కంటే షమ్మిగా చేసిన ఫహాద్ ఫాజిల్ యాక్టింగ్ పిచ్చిపిచ్చిగా నచ్చేయడం గ్యారంటీ.
ఏదైనా సినిమా చూస్తే బలంగా గుర్తుండిపోవాలి. మానవ సంబంధాలు ప్రతిబింబించేలా ఉండాలి. ప్రేమకున్న గొప్పతనం తెలియాలంటే మాత్రం ఈ మలయాళ ఆణిముత్యాన్ని అస్సలు మిస్ చేయొద్దు. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో, యూట్యూబ్‌లో ఇది అందుబాటులో ఉంది. మలయాళ భాషలో మాత్రమే ఉందని చూడటం మానేయొద్దు. ఓ మంచి మూవీ మిస్ అవుతారు. కుటుంబంతో కలిసి చూడొచ్చు.
- చందు డొంకాన


