
భారీగా తగ్గిన విద్యార్థి, పర్యాటక వీసా ప్రయాణాలు
ఈ ఆగస్టులో ఏకంగా 14.8 శాతం తగ్గుదల నమోదు
జనవరి–ఆగస్టులో 26 శాతం తగ్గిన స్టూడెంట్ వీసాలు
ఈ ఆర్థిక సంవత్సరంలో తగ్గనున్న భారతీయుల సంఖ్య?
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక.. ‘డాలర్ డ్రీమ్స్’కి బ్రేకులు పడటం మొదలయ్యాయి. కొత్తగా పెట్టిన హెచ్–1బీ వీసా ‘లక్ష డాలర్ల’ నిబంధన.. పెద్ద స్పీడ్ బ్రేకర్ అంటున్నారు నిపుణులు. ఇప్పటికే అమెరికాకు వెళ్లే భారతీయుల సంఖ్య ఈ ఏడాది గణనీయంగా తగ్గింది. 2024 మొదటి 8 నెలలతో పోలిస్తే.. 2025లో ఆగస్టు వరకు అమెరికా వెళ్లిన వారి సంఖ్య 4.3 శాతం తగ్గింది. ప్రత్యేకించి ఆగస్టులో ఇది ఏకంగా 14.8 శాతం తగ్గింది. గతంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా ఈ సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉంది.
అమెరికా అంతర్జాతీయ వాణిజ్య విభాగం (యూఎస్ ఐటీఏ) గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది మొదటి 8 నెలల్లో... విద్యార్థి వీసాపై అమెరికా వెళ్లిన భారతీయులు 1,77,435. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 26.1 శాతం తక్కువ. ఇక పర్యాటక వీసాల మీద వెళ్లినవారు 9.98 లక్షలు. గతేడాది మొదటి 8 నెలలతో పోలిస్తే ఇది 2.7 శాతం తక్కువ.

ఏయే వీసా మీద ఎంతమంది?
ప్రత్యేకించి విద్యార్థి వీసా మీద అమెరికా వెళ్లే వారి సంఖ్య.. 2024 ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో 44.5 శాతం తగ్గిపోయింది. పర్యాటక, విద్యార్థి వీసాలపై వెళ్లినవాళ్లు తగ్గడంతో మొత్తం సంఖ్యలోనూ భారీ తగ్గుదల నమోదయింది.
యూకే తరవాత మనమే
యూఎస్ ఐటీఏ గణాంకాల ప్రకారం.. గత రెండేళ్లలో ఆగస్టు నెలలో అమెరికాకు వచ్చిన విదేశీ విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే.. ఈ ఏడాది ఆగస్టులో వీరి సంఖ్య భారీగా తగ్గిపోయింది. 2025లో ఆగస్టు వరకు చూస్తే.. యూకే తరవాత అమెరికాను అత్యధికంగా సందర్శించింది భారతీయులే. ఈ ఏడాది మొదటి 8 నెలల్లోమొత్తం 14.87 లక్షల మంది అమెరికాకు వెళ్లారు. 2024 జనవరి – ఆగస్టుతో పోలిస్తే ఇది 4.3 శాతం తక్కువ.
ఈ ఏడాది తగ్గుతుందా?
భారత ప్రభుత్వ బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ గణాంకాల ప్రకారం.. అమెరికాకు వెళ్తున్న భారతీయుల సంఖ్య 2022 నుంచి భారీగా పెరుగుతోంది. కానీ, ఈ ఏడాది గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయి. అమెరికా ఆర్థిక సంవత్సరం అక్టోబరు 1న ప్రారంభమై సెప్టెంబరు 30న ముగుస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరం 11 నెలల్లో యూఎస్ వెళ్లిన మొత్తం భారతీయులు సుమారు 19.4 లక్షలు. గతేడాది సెప్టెంబర్‌లో 1.81 లక్షల మంది వెళ్లారు. ఈసారి సెప్టెంబరులో ఈ సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం సంఖ్య 21 లక్షలు దాటకపోవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు.